కేసులు కమ్మేస్తున్నాయి

ABN , First Publish Date - 2020-05-30T09:35:00+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కేసులు తాండవం చేస్తున్నాయి. వరుసపెట్టి అందరిని చుట్టేస్తు న్నాయి. ముఖ్యంగా మామిడాడను కోలుకోకుండా కేసులు కమ్మేస్తున్నాయి

కేసులు కమ్మేస్తున్నాయి

శుక్రవారం ఒక్కరోజే జిల్లాలో 41 పాజిటివ్‌ కేసులు 

ఇందులో గొల్లలమామిడాడలో ఏకంగా 30 మందికి వైరస్‌ నిర్ధారణ

అన్నీ ఇటీవల కొవిడ్‌తో మృతిచెందిన వ్యక్తి ద్వారా సంక్రమణ

చనిపోయిన వ్యక్తి ద్వారా మొత్తం 112 మందికి సోకిన వైరస్‌

ఒక్క మామిడాడలోనే 83కి చేరిన కొవిడ్‌ బాధితులు

మరోపక్క మామిడాడలో పాజిటివ్‌ వచ్చిన 64 ఏళ్ల వృద్ధుడు మృతి

గుండెపోటుతో చనిపోయాడంటున్న వైద్యులు, కానీ వారి కుటుంబంలో ఇద్దరికి పాజిటివ్‌

ముమ్మిడివరం, రాజమహేంద్రవరం క్వారంటైన్లలో 11 మందికి.. 

జిల్లాలో మొత్తం 203కి పాకిన పాజిటివ్‌ కేసులు 

తొమ్మిది రోజుల్లో జిల్లావ్యాప్తంగా ఏకంగా 141కేసుల నమోదు


(కాకినాడ-ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

జిల్లాలో కొవిడ్‌ కేసులు తాండవం చేస్తున్నాయి. వరుసపెట్టి అందరిని చుట్టేస్తు న్నాయి. ముఖ్యంగా మామిడాడను కోలుకోకుండా కేసులు కమ్మేస్తున్నాయి. దీంతో జిల్లాలో రోజురోజుకు కేసుల సంఖ్య అపారంగా పెరిగిపోతున్నాయి. అటు వైద్యులు, ఇటు అధికారుల్లో ప్రస్తుత పరిస్థితితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంతకంతకు కేసులు ఎగబాకుతుండడంతో తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా శుక్రవారం 41 పాజిటివ్‌ కేసులు నమోదవగా ఇందులో 30 మామిడాడలోనే నిర్ధారణ అయ్యాయి. వీరందరికి ఇటీవల కొవిడ్‌తో చనిపోయిన వ్యక్తి ద్వారా వైరస్‌ వ్యాపించినట్టు తేల్చారు. దీంతో కొవిడ్‌ మృతుడి ద్వారా వైరస్‌ బారినపడిన బాధితుల సంఖ్య జిల్లాలో 112కి చేరుకుంది. ఇందులో మామిడాడ గ్రామంలో వైరస్‌కు గురైనవారు 83 మంది. అటు జిల్లాలో మొత్తం కొవిడ్‌ కేసులు 203కి చేరుకున్నాయి. కాగా తొమ్మిది రోజుల వ్యవధిలో జిల్లాలో ఏకంగా 141 కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజులుగా జిల్లాను కొవిడ్‌ కేసులు కునుకుతీయడం లేదు. ముఖ్యంగా మామిడాడలో అయితే వైరస్‌ విలయతాండవం చేస్తోంది. గత గురువారం వైరస్‌తో మృతి చెందిన వ్యక్తి ద్వారా గ్రామం మొత్తానికి కొవిడ్‌ కమ్మేసింది.


దీంతో గడిచిన ఎనిమిది రోజులుగా సదరు మృతుడి ద్వారా వైరస్‌ వ్యాపించి నిరంతరం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం మరో 39 పాజిటివ్‌ కేసులు జిల్లాలో నమోదవగా (మహిళలు 19 మంది కాగా పురుషులు 20మంది. వీరిలో రెండేళ్లు, నాలుగేళ్లు,ఏడేళ్ల చిన్నారులు ముగ్గురు, తొమ్మిదేళ్ల వయస్సు న్న బాలురు). ఒక్క మామిడాడలోనే 30 నిర్ధారణ అయ్యాయంటే ఇక్కడ పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మామిడాడలో శుక్రవారం గుర్తించిన 30 మంది కొవిడ్‌ బాధితులకు గతవారం మృతిచెందిన 53 ఏళ్ల వ్యక్తి ద్వారానే వైరస్‌ సంక్రమించినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో సదరు కొవిడ్‌తో మృతి చెందిన వ్యక్తి ద్వారా వైరస్‌ బారినపడ్డ బాధితుల సంఖ్య జిల్లావ్యాప్తంగా 112కి చేరింది. ఇందులో 83 మంది మృతుడి స్వస్థలమైన మామిడాడలోనే ఉన్నారు.


దీంతో సదరు మృతుడి ద్వారా ఇంకా ఎంతమంది బాధితులుగా చేరుతారనే భయం మామిడాడలో అలముకుంది. ఇదిలా ఉంటే శుక్రవారం ముమ్మిడివరం ప్రభుత్వ క్వారంటైన్‌లోలో ఆరుగురికి, రాజమహేంద్ర వరంలో బొమ్మూరు క్వారంటైన్‌లో అయిదుగురికి పాజిటివ్‌ నిర్ధారించారు. ఇందులో ఇద్దరు మహిళలు రాజమహేంద్రవరంలోని జాంపేటకు చెందినవారు. వీరు విజయవాడ నుంచి రంజాన్‌ పండుగ సందర్భంగా ఇక్కడకు చేరుకున్నారు. అనుమానిత లక్షణాలతో వీరిని క్వారంటైన్‌కు తర లించి పరీక్షలు చేయగా, వారికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వీరందరినీ జీఎస్‌ఎస్‌ ఆసుపత్రి లోని ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించినట్టు వైద్య వర్గాలు తెలిపాయి.


చనిపోయింది దేంతో..

మామిడాడలో శుక్రవారం 64 ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. అయితే ఈయనకు పాజిటివ్‌ నిర్ధారణ కావడం, విషయం తెలియడంతో సదరు వృద్ధుడు ఒక్కసారిగా ఆయాసానికి లోన య్యారు. దీంతో 108 వాహనంలో ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశాడు. దీంతో కొవిడ్‌తో మృతి చెందాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం ఇది కొవిడ్‌ మరణం కాదని, ఆయాసంతో గుండెపోటు వచ్చి సదరు వ్యక్తి మృతిచెందినట్టు నిర్ధారించారు. కాగా ఈ మృతుడి కుటుంబంలో ఇద్దరికి కొవిడ్‌ వైరస్‌ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు జిల్లాలో కొవిడ్‌తో మృతిచెందిన వారు అధికారిక లెక్కల ప్రకారం ఒకరు కాగా, అనధికారికంగా మూడుకు చేరాయి.


జిల్లాలో 203కి చేరిన కేసులు

శుక్రవారం నమోదైన 41 పాజిటివ్‌లతో కలిపి జిల్లాలో కొవిడ్‌ కేసుల సంఖ్య 203కి చేరింది. దీంతో 200 మార్కు కేసులు దాటవని అనుకున్న వైద్యులు తాజా కేసులతో  కలవరపడు తున్నారు. ముఖ్యంగా గడిచిన తొమ్మిది రోజుల కిందటి వరకు జిల్లాలో కొవిడ్‌ కేసుల సంఖ్య కేవలం 62 మాత్రమే. దీంతో జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉన్నట్టు అంతా భావించారు. కానీ మామిడాడ మృతుడి ద్వారా ఒక్కసారిగా పరిస్థితి తారుమారైపోయింది. గుట్టలుగుట్టలుగా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈనెల 21 నుంచి 29వ తేదీ వ్యవధిలో ఏకంగా కేసులు 139 నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది.


మామిడాడలో కంట్రోల్‌ రూమ్‌

పెదపూడి: మామిడాడలో శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌-3 చేకూరి కీర్తి పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామంలోని ద్వారంపూడి అచ్చియ్యమ్మ రామచంద్రారెడ్డి కన్వెన్షన్‌ హాల్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి ఏపీసీఎస్‌సీఎస్‌ జోనల్‌ మేనేజర్‌ డి.పుష్పమణిని నోడల్‌ అధికారిణిగా నియమించారు. అనుమానితులను ఉంచేందుకు మామిడాడ లోని ప్రైవేటు హాస్పటళ్లు, పెద్దాడ, పెదపూడి పీహెచ్‌సీలను జేసీ పరిశీలించారు. గ్రామంలో పరిస్థి తులను తహశీల్దారు కే రాజ్యలక్ష్మి, ఎంపీడీవో పి.విజయభాస్కర్‌, డీఎస్పీ వీ భీమారావు ఆధ్వ ర్యంలో కాకినాడ రూరల్‌ సీఐ ఆకుల మురళీకృష్ణ, పెదపూడి ఎస్‌ఐ లక్ష్మి సమీక్షిస్తున్నారు.

Updated Date - 2020-05-30T09:35:00+05:30 IST