కరోనా కల్లోలం

ABN , First Publish Date - 2020-06-24T11:02:26+05:30 IST

జిల్లాలో పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం 41 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కరోనా కల్లోలం

ఒక్కరోజే 41 కేసులు నమోదు

601 చేరిన బాధితుల సంఖ్య

రోజురోజుకూ పెరుగుతున్న ఉధృతి

ఉపాధి కోల్పోతున్న కార్మికులు

హైరానా పడుతున్న ఉద్యోగులు

భయాందోళనలో ప్రజలు


జిల్లాలో కరోనా కల్లోలంగా సృష్టిస్తోంది. రోజురోజుకూ ఉధృతి పెరుగుతోంది. వారం రోజుల వ్యవధిలో సరాసరిన రోజుకు 25కుపైగానే కేసులు నమోదవుతున్నాయి. పల్లె, పట్టణం అని తేడా లేకుండా కరోనా పాకుతోంది. మంగళవారం ఒక్కరోజే 41 కేసులు నమోదు కావడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 601కి చేరింది.


కడప, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం 41 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రొద్దుటూరులో 10, జమ్మలమడుగులో 6, మైలవరం మండలంలో 5, చాపాడులో 2, వీరబల్లెలో 1, సంబేపల్లె, ఒంటిమిట్ట, కలసపాడు, వల్లూరు, బద్వేలు, రాజుపాలెం, గోపవరం, కడప, నందలూరు, వేముల మండలంలో ఒక్కో కేసు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా బయటపడింది. దీంతో పాజిటివ్‌ బాధితుల సంఖ్య 601కి చేరుకుంది.


55 మంది డిశ్చార్జ్‌

కోవిడ్‌-19 నుంచి సంపూర్ణంగా కోలుకుని జిల్లా ఫాతిమా ఆసుపత్రి నుంచి 55 మంది డిశ్చార్జి అయ్యారని కలెక్టర్‌ హరికిరణ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కోలుకున్న వారిలో విదేశాల నుంచి వచ్చిన వారు 27 మంది, మైలవరం మండలంలో 15, ప్రొద్దుటూరులో 6, చాపాడులో 5, గోపవరంలో ఇద్దరు, కడపలో ముగ్గురు, జమ్మలమడుగుకు చెందిన ఇద్దరు ఉన్నారుఉ. దీంతో ఇప్పటి వరకు 255 మంది డిశ్చార్జి అయినట్లు తెలిపారు.


ఉపాధి కోల్పోతున్న కార్మికులు

జిల్లాలో కరోనా వైరస్‌ అన్ని వర్గాలకు వ్యాపిస్తోంది. ముఖ్యంగా మహమ్మారి బారిన పడి కార్మికులు, వ్యాపారులు రోడ్డున పడుతున్నారు. అసలే లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు రెండు మాసాల పాటు ఉపాధి కరువైంది. ఇప్పుడు ఈ మహమ్మారి బారిన పడుతుండడంతో ఆర్థికంగానూ ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో నమోదైన 601 పాజిటివ్‌ కేసుల్లో కేటగిరివారీగా పరిశీలిస్తే కార్మికులు 294 మందికి పాజిటివ్‌ సోకింది. విద్యార్థులు 12, రైతులు 83, గృహిణిలు 60, వ్యాపారులు 25 మంది ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 127 మందికి వైరస్‌ సోకింది.


తల్లికి, 8 నెలల పాపకు..?

మైదుకూరులో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చిందని తెలిసింది. అయితే దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మంగళవారం వచ్చిన ఫలితాల్లో తల్లితో పాటు ఆమె 8 నెలల పాపకు,  మరొక యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి మల్లేష్‌ పేర్కొన్నారు.


ఆసుపత్రికి వెళ్లి...

దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తిరుపతి, హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు తీసుకెళితే అక్కడి నుంచి వచ్చిన తరువాత వ్యాఽధిగ్రస్తులతో పాటు కుటుంబీకులకు కూడా వైరస్‌ బయట పడింది. ఇలా పలువురికి పాజిటివ్‌ బయట పడుతుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇక లాక్‌డౌన్‌ కారణంగా పొరుగు రాష్ట్రాల్లో ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వారు, ప్రభుత్వ ఉద్యోగులు కొందరు వైరస్‌ బారిన పడ్డారు. రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులకూ వైరస్‌ సోకింది. దీంతో వారి కుటుంబ జీవనం దయనీయంగా మారింది. కుటుంబ సభ్యులకు పాజిటివ్‌ రావడంతో ఇంట్లోని మహిళలు, చిన్నారులు కూడా కరోనా బారిన పడ్డారు. వల్లూరు మండలంలోని ఓ పేద కుటుంబానికి చెందిన యువతి ఓ ప్రైవేటు ల్యాబ్‌లో పనిచేస్తూ కరోనా వైర్‌సకు గురైంది. ఆ కుటుంబంలో నలుగురికి పాజిటివ్‌ వచ్చింది.


అలాగే మైలవరం మండలం నవాబుపేట్‌లో దాదాపు 90 మందికి పైగా పాజిటివ్‌ సోకింది. వీరంతా వ్యవసాయ కూలీలు. ఉపాధి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఒకరి నుంచి వైరస్‌ గ్రామం మొత్తం చుట్టేసింది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో వైరస్‌ సోకడంతో పొలం పనులకు అడ్డంకిగా మారుతోంది. కొంత మంది వ్యాపారులకు కూడా వైరస్‌ సోకడంతో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కరోనా సోకిన వారిని కొందరు చిన్నచూపు చూస్తుండడం కూడా వారిలో ఆవేదనకు గురి చేస్తోంది. కరోనాపై ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు ఇంకా పాజిటివ్‌ సోకి కోలుకున్న వారితో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. 


కోవిడ్‌-19 సమాచారం

మొత్తం శాంపిల్స్‌  - 61418

రిజల్ట్‌ వచ్చినవి - 55807

నెగటివ్‌ - 55206

పాజిటివ్‌ - 601

డిశ్చార్జ్‌ అయినవారు - 255

రిజల్ట్‌ రావాల్సినవి - 5611

23వ తేదీ తీసిన శాంపిల్స్‌  - 2124

Updated Date - 2020-06-24T11:02:26+05:30 IST