Abn logo
Jun 17 2021 @ 00:05AM

407 కేసులు, ఐదుగురు మృతి

మనకొద్దీ రద్దీ.. కంగారుగా పరుగులు పెట్టినా.. కరోనాతో పందెం వేసినా.. గజిబిజిగా తిరిగినా.. గందరగోళంగా గడిపినా.. అందరి గమనం విజయంవైపు.. అంతిమ లక్ష్యం భద్రమైన రేపు. కొన్ని క్షణాల కోసం కొండంత భవితను పణంగా పెట్టడం వివేకమనిపించుకోదని మనందరికీ తెలుసు. అప్పుడప్పుడు మరిచిపోతాం అంతే. ఆ మరపు ఒక్కోసారి జీవితాన్ని బలి తీసుకుంటుందనడానికి ఈ చిత్రమే నిదర్శనం. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా జనాల్లో పౌరస్పృహ మాత్రం పెద్దగా కనిపించట్లేదు. రద్దీ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉంటుందని తెలిసినా బీసెంట్‌ రోడ్డులో బుధవారం ఇలా కిక్కిరిసిపోయి మరీ షాపింగ్‌ చేశారు.

విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో కరోనా బారినపడిన మరో ఐదుగురు బాధితులు బుధవారం మరణించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 407 మందికి వైరస్‌ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా మరణాలు 1,046కు చేరాయి. పాజిటివ్‌ కేసులు 96,723కు పెరిగాయి. వీరిలో 89,886 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకోగా, ఇంకా 5,791 మంది చికిత్స పొందుతున్నారు.