ఒక్కరోజే 400కు పైగా కేసులు

ABN , First Publish Date - 2020-04-03T09:22:01+05:30 IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య 2360కి చేరింది. ఢిల్లీలో జరిగిన తబ్లీగే జమాత్‌ ప్రార్థనల కు వెళ్లినవారందరికీ వైద్యపరీక్షలు చేయిస్తుండడంతో.. గురువారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 400కు పైగా పాజిటివ్‌ కేసులను...

ఒక్కరోజే 400కు పైగా కేసులు

  • దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2360కి
  • వైరస్‌ కారణంగా 73 మంది మృత్యువాత
  • నేటి ఉదయం ప్రధాని వీడియో సందేశం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: దేశంలో కరోనా కేసుల సంఖ్య 2360కి చేరింది. ఢిల్లీలో జరిగిన తబ్లీగే జమాత్‌ ప్రార్థనల కు వెళ్లినవారందరికీ వైద్యపరీక్షలు చేయిస్తుండడంతో.. గురువారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 400కు పైగా పాజిటివ్‌ కేసులను నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 328 కరోనా పాజిటివ్‌ కేసులను గుర్తించామని, దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1965కు చేరిందని, 12 మరణాలు నమోదయ్యాయని  కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. అయితే, వివిధ రాష్ట్రాలు ప్రకటిస్తున్న సంఖ్యలను బట్టి పాజిటివ్‌కేసుల సంఖ్య 400 దాటింది. వీటిలో  ఎక్కువ భాగం మర్కజ్‌ ప్రార్థనలకు హాజరైనవారివేనని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వైరస్‌ కారణంగా 14 మంది మృతి చెందడంతో మృతుల సంఖ్య 73కు చేరింది.   శుక్రవారం ఉదయం ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ఒక వీడియో సందేశం ఇస్తారని కేంద్ర హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు. కాగా.. ఎయిమ్స్‌ సీనియర్‌ వైద్యుడు సహా  దేశవ్యాప్తంగా 50 మంది వైద్యులు, నర్సులు, పారామెడిక్స్‌కు కరోనా సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతినిధి ఒకరు  తెలిపారు. 


దేశవ్యాప్తంగా గురువారం పలు చోట్ల వైద్యులపై, సామాజిక సేవకులపై, పోలీసు సిబ్బందిపై దాడులు జరిగాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వైద్య సిబ్బందిపై దాడి చేసిన ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వైరస్‌ పాజిటివ్‌గా తేలిన వ్యక్తి కుటుంబసభ్యులను, బంధువులను క్వారంటైన్‌కు తరలించేందుకు వెళ్లిన వైద్య సిబ్బందిపై వారు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మహిళా వైద్యులకు గాయాలయ్యాయి. ఈ దాడి తాలూకూ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. బిహార్‌లోని ముంగర్‌లో వైద్యపరీక్షల నిమిత్తం శాంపుల్స్‌ తీసుకోవడానికి వెళ్లిన వైద్య సిబ్బంది, పోలీసులపై దాడి జరిగింది. బెంగళూరులో ఆశా వర్కర్లపై దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌లో కరోనా అనుమానిత లక్షణాలతో క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్న 40 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేశంలో సమూహ వ్యాప్తి (కమ్యూనిటీ స్ర్పెడ్‌) ఇంకా లేనప్పటికీ కరోనా కేసులు అధికంగా ఉన్న 20 హాట్‌స్పాట్‌లను.. ఆ ముప్పు ఎక్కువగా ఉన్న మరో 22 హాట్‌స్పాట్లను కేంద్రం గుర్తించింది. ఉదాహరణకు.. ఢిల్లీలో తబ్లీగే జమాత్‌ ప్రార్థనలు జరిగిన నిజాముద్దీన్‌ దర్గా ప్రాంతం.   రాజస్థాన్‌లో అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన భిల్వారా ప్రాంతాన్ని కూడా హాట్‌స్పాట్‌గా ప్రకటించారు.  దేశవ్యాప్తంగా వైరస్‌ విస్తృతిని అడ్డుకోవడానికి, వైరస్‌ బారిన పడినవారిని గుర్తించి వైద్యం చేయించడానికి భారీగా మానవవనరులు అవసరమవుతాయని రాష్ట్రప్రభుత్వాలకు ఇచ్చిన మార్గదర్శకాల్లో పేర్కొంది.   


హాట్‌స్పాట్‌లలో యాంటీబాడీ టెస్టులు

కరోనా ఉధృతంగా ఉన్న ప్రాంతాల్లో(కరోనా హాట్‌స్పాట్‌లు) నివసించే ప్రజలకు పెద్ద ఎత్తున యాంటీబాడీ పరీక్షలు నిర్వహించాలని ఐసీఎంఆర్‌ సూచించింది. ఈ పరీక్షల ద్వారా వ్యక్తుల రోగ నిరోధక శక్తిని అంచనా వేస్తారు. శరీరంలో ప్రతినిరోధకాల స్థాయిని గుర్తిస్తారు. 


Updated Date - 2020-04-03T09:22:01+05:30 IST