400 ఎంబీబీఎస్‌ సీట్లు గాయబ్‌!

ABN , First Publish Date - 2022-05-22T10:03:05+05:30 IST

వచ్చే విద్యాసంవత్సరానికి (2023- 24) గాను రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది వైద్యవిద్య కళాశాలను 100 చొప్పున ఎంబీబీఎస్‌ సీట్లతోనే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

400 ఎంబీబీఎస్‌ సీట్లు గాయబ్‌!

  • వచ్చే విద్యా సంవత్సరానికి 8 కొత్త  కాలేజీల్లో 800 సీట్లే! 
  • తొలుత  వీటిలో 150 చొప్పున 1,200 సీట్లుగా డీపీఆర్‌ 
  • ఫ్యాకల్టీ కొరతతో 100 చొప్పున కుదించాలని నిర్ణయం?

హైదరాబాద్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): వచ్చే విద్యాసంవత్సరానికి (2023- 24) గాను రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది వైద్యవిద్య కళాశాలను 100 చొప్పున ఎంబీబీఎస్‌ సీట్లతోనే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 24 వైద్యవిద్య కాలేజీలు దశలవారీగా ప్రారంభించుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వీటిలో ఈ విద్యాసంవత్సరం 8, వచ్చే విద్యా సంవత్సరం, ఆ మరుసటి విద్యాసంవత్సరం 8 చొప్పున ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి కొత్తగా కట్టే అన్ని కాలేజీల్లోనూ 150 సీట్ల చొప్పున ఉంటాయని తొలుత సర్కారు ప్రకటించింది. ఆ మేరకు డీపీఆర్‌ను సిద్ధం చేసింది. అయితే వచ్చే ఏడాది ప్రారంభించనున్న కాలేజీల్లో 50 చొప్పున సీట్లను తగ్గించింది. దీంతో 400 సీట్లు తగ్గనున్నాయి. కొత్త కాలేజీలకు సరిపడా అధ్యాపకులు దొరుకుతారో లేదోనన్న అభిప్రాయంతోనే సీట్లను సర్కారు తగ్గించుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఈ కాలేజీల్లో ఒకట్రెండు మినహా అన్నీ గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండటంతో అక్కడికి వెళ్లేందుకు విద్యార్థులు ఇష్టపడరనే అభిప్రాయం కూడా వైద్యశాఖలో ఉంది. 


వచ్చే ఏడాది కొత్త కాలేజీలివే..

ప్రభుత్వం వచ్చే ఏడాది ఖమ్మం, కరీంనగర్‌, భూపాలపల్లి, కామారెడ్డి, ఆసిఫాబాద్‌, సిరిసిల్ల, జనగాం, వికారాబాద్‌లలో మెడికల్‌ కాలేజీలను నిర్మించనుంది. జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) నిబంధన ప్రకారం కొత్త కాలేజీ ప్రారంభించాలంటే కనీసం 430 పడకల అనుబంధ ఆస్పత్రి ఉండాలి. కరీంనగర్‌ తప్ప ఎక్కడా ఆ మేరకు పడకల సంఖ్య లేదు. ఏడు చోట్ల పడకల సంఖ్యను అప్‌గ్రేడేషన్‌ చేయాల్సివుంది. దీనిపై అంచనాలను సిద్ధం చేయాలని వైద్య విద్య సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి రెండు రోజుల క్రితం తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ) ఎండీకి లేఖ రాశారు. ఆ ప్రతిపాదిత కొత్త మెడికల్‌ కాలేజీల్లో సివిల్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పనులతో పాటు ఎక్వి్‌పమెంట్‌ ఏర్పాటు, ఎంబీబీఎస్‌ విద్యార్ధులకు హాస్టల్‌ వసతి కల్పించడానికి అంచనాలను సిద్ధం చేయాలని ఆ లేఖలో కోరారు. కాగా ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, వనపర్తి,  కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌ కర్నూల్‌, రామగుండంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి కోసం ఇప్పటికే ఎన్‌ఎంసీకి దరఖాస్తు కూడా  చేశారు. ఈ కాలేజీలకు అనుబంధంగా ఉండే ఆస్పత్రులు మాత్రం ఇంకా తెలంగాణ వైద్య విధానపరిషత్‌ పరిధిలోనే ఉన్నాయి. వాటిని తమకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి గత ఫిబ్రవరి 11న డీఎంఈ రమేశ్‌రెడ్డి లేఖ రాశారు.  ఆ మేరకు 8 చోట్ల ఉన్న ఆస్పత్రులను డీఎంఈకి బదిలీ చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ శనివారం ఉత్తర్వ్యులు జారీ చేశారు.  

Updated Date - 2022-05-22T10:03:05+05:30 IST