'శంకరాభరణం'కు 40 ఏళ్ళు పూర్తి

కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కి, తెలుగువారి కీర్తిపతాకను దశదిశలా రెపరెపలాడించిన చిత్రం 'శంకరాభరణం' ఆదివారంతో నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం.

 

తెలుగు చలన చిత్రాలతో ఓ వెలుగు చూసినవారు ఎందరో ఆ వెలుగులో ఎన్నెన్నో కళాఖండాలు తెలుగువారిని మురిపించాయి, మైమరిపించాయి. ఆ తరువాత తెలుగు సినిమా కమర్షియల్ బాట పట్టి కళావిహీనమవుతున్న తరుణంలో కె. విశ్వనాథ్ 'శంకరాభరణం'ను జనం ముందు నిలిపారు. మళ్ళీ మన కర్ణాటక సంగీతం పట్ల జనాల్లో ఆసక్తి మేల్కొలిపారు. పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై 'శంకరాభరణం' చిత్రాన్ని ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు నిర్మించారు. 1980 ఫిబ్రవరి 2న విడుదలైన 'శంకరాభరణం' చిత్రం అనూహ్య విజయం సాధించింది. తెలుగులోనే కాకుండా, తమిళ, మళయాళ, కర్ణాటక సీమల్లోనూ ఈ చిత్రం జయభేరీ మోగించింది.

 

'శంకరాభరణం' చిత్రంలో సంగీతసాహిత్యాలు జోడుగుర్రాల్లా సాగాయి. వేటూరి పాటలకు కేవీ మహదేవన్ సంగీతం జీవం పోసింది. ఇక ఈ చిత్రం ద్వారా అప్పటివరకు నాటకరంగానికే పరిమితమైన జె.వి.సోమయాజులు చిత్రసీమలోనూ ఓ వెలుగు వెలిగారు. అప్పటి దాకా నర్తకిగా రాణించిన మంజుభార్గవికి ఈ సినిమా నటిగానూ మంచి మార్కులు సంపాదించి పెట్టింది. ఇందులో నటించిన రాజ్యలక్ష్మి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకుంది. ఇక బాలనటిగా నటించిన తులసి మంచి గుర్తింపు సంపాదించింది.

 

'శంకరాభరణం' ప్రేక్షకుల విశేషాదరణతో పాటు ప్రభుత్వ అవార్డులనూ సంపాదించుకుంది. ఈ సినిమాతోనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తొలిసారి జాతీయ ఉత్తమ గాయకునిగా నిలిచారు. కేవీ మహదేవన్, వాణీ జయరామ్ సైతం జాతీయ అవార్డులు సంపాదించుకున్నారు. ఉత్తమ కళాత్మక వినోదభరిత చిత్రంగానూ జాతీయ అవార్డు సంపాదించిందీ చిత్రం ఎస్పీ బాలుకు ఉత్తమగాయకునిగా నంది అవార్డునూ అందించింది. ఉత్తమ చిత్రంగా బంగారు నందినీ సొంతం చేసుకున్న ఈ చిత్రం వేటూరికి ఉత్తమ గీతరచయితగా నందిని సమర్పించింది. తరువాతి రోజుల్లో ఈ సినిమాను దూరదర్శన్‌లో చూసిన విఖ్యాత సంగీత దర్శకుడు నౌషాద్ సైతం అభినందించి, కేవీ మహదేవన్ బాణీలను ఎంతగానో కొనియాడారు. ఇలా పండితపామరులను ఎంతగానో ఆకట్టుకున్న 'శంకరాభరణం' ఇప్పటికీ బుల్లితెరపై సందడి చేస్తూనే ఉండడం విశేషం.

Advertisement