శ్రీ మతికి అందాల బహుమతి!

ABN , First Publish Date - 2020-07-15T05:30:00+05:30 IST

మమతా త్రివేది... ఒక సాధారణ గృహిణి. నలభై ఏళ్లు దాటిన తర్వాత అందాల పోటీలో పాల్గొని అంతర్జాతీయ విజేతగా నిలిచారామె. ఆ తర్వాత తన అనుభవాల సారంతో వివాహిత మహిళలను సాధికారులుగా నిలబెట్టే లక్ష్యంతో...

శ్రీ మతికి అందాల బహుమతి!

మమతా త్రివేది... ఒక సాధారణ గృహిణి. నలభై ఏళ్లు దాటిన తర్వాత అందాల పోటీలో పాల్గొని అంతర్జాతీయ విజేతగా నిలిచారామె. ఆ తర్వాత తన అనుభవాల సారంతో వివాహిత మహిళలను సాధికారులుగా నిలబెట్టే లక్ష్యంతో ‘మిసెస్‌ ఇండియా తెలంగాణ’, ‘మిసెస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌’ అందాల పోటీల ద్వారా ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్నారు. ఈ రంగంలో మమత అనుభవాలు ఆమె మాటల్లోనే...




‘‘మాది ఉత్తర భారతదేశం. కానీ ఇక్కడే స్థిరపడ్డాం. నేను పుట్టింది హైదరాబాద్‌లోనే. భద్రుకా కాలేజీలో చదువుకున్నా. సైకాలజీ విద్యార్థిని. నాన్న విలువలు, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. బంధాలు, బంధుత్వాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. నా మీద నాన్న ప్రభావం చాలా ఉంది. మా ఇంట్లో అందరూ అన్ని పనులూ క్రమశిక్షణతో చేయాల్సిందే. నేను ఐదేళ్ల వయసు నుంచి యోగా చేస్తున్నా. 


చిన్నవయసులోనే పెళ్లి..

నాకు చిన్న వయసులోనే పెళ్లయిపోయింది. మా అత్తగారిది ఉమ్మడి కుటుంబం. పైగా అందరూ ఉన్నత చదువులు చదివారు. మా మామగారికి పబ్లిషింగ్‌ బిజినెస్‌ ఉంది. నేను ఆ బిజినెస్‌ చూస్తానంటే అందుకు ఆయన ఒప్పుకున్నారు. నేను కొత్త కొత్త అంశాలను ప్రవేశపెడుతూ బిజినెస్‌ను ముందుకు తీసుకెళ్లా. అది చూసి ఆయన సంతోషించారు. పిల్లలు, కుటుంబ బాధ్యతలతో పాటు ఇంట్లో పెద్దవాళ్ల క్షేమం కూడా చూడాలి. మరోవైపు మా మామగారికి కేన్సర్‌. మా అమ్మకు కేన్సర్‌. నాన్న చనిపోవడంతో అమ్మను మా ఇంట్లోనే పెట్టుకుని చూశా. తల్లిదండ్రుల బాధ్యత కేవలం కొడుకులదే కాదు కూతుళ్లది కూడా అని నా అభిప్రాయం. ఆ విధంగా కుటుంబ బాధ్యతలు, బిజినెస్‌ రెండూ చూసుకునేదాన్ని.


కూతురు ఒత్తిడితో...

 పాతికేళ్ల వైవాహిక జీవితం తర్వాత నేను ‘మిసెస్‌ ఇండియా’ అందాలపోటీలో పాల్గొన్నా! అది కూడా నా కూతురు ఒత్తిడితో. అప్పుడు నా వయసు 45 సంవత్సరాలు. నా కూతురు ‘మిసెస్‌ ఇండియా’ పోటీల ప్రకటన చూసి ‘అమ్మా ఈ పోటీల్లో నువ్వెందుకు పాల్గొనకూడదు?’ అంది. ‘నాకేం వచ్చు? ఆ పోటీల గురించి ఏమీ తెలియదు’ అని చెప్పినా వినిపించుకోలేదు. చివరకు పాప కోసం ఆ పోటీల్లో పాల్గొన్నా. 2017 ‘మిసెస్‌ ఇండియా’గా గెలిచాను. ఆ విజయం నా జీవితంపై చాలా ప్రభావం చూపింది. నాకెన్నో విషయాలు నేర్పించింది. మొదటినుంచి ఏదైనా పని చేపడితే పట్టుదలగా కృషి చేసే స్వభావం నాది. పర్ఫెక్ట్‌గా చేయాలనుకుంటా. మిసెస్‌ ఇండియా పోటీల విషయంలోనూ అలాగే ఉన్నా. ‘మిసెస్‌ ఇండియా’ కిరీటం గెలిచిన తర్వాత మనదేశం నుంచి వరల్డ్‌ ప్లాట్‌ఫామ్‌లో పాల్గొనేందుకు అదే ఏడాది చైనాకు వెళ్లా. వివిధ దేశాల నుంచి వచ్చిన పీజెంట్‌ విజేతలు ఇందులో పాల్గొన్నారు. ఆ పోటీలో నేను భారతమాత కాన్సెప్టుతో డ్రెస్‌ ధరించా. వివిధ రౌండ్లు దాటుకుంటూ ఎట్టకేలకు మిసెస్‌ వరల్డ్‌ పీజెంట్‌ విజేతగా గెలవడం మరచిపోలేని సందర్భం. 


ఒక విజయం మలుపు తిప్పింది...

ఈ గెలుపు నా జీవితాన్ని మార్చేసింది. పోటీలో గెలిచి హైదరాబాద్‌కు వచ్చిన నెలలోపే ‘మిసెస్‌ ఇండియా తెలంగాణ’ పీజెంట్‌ డైరెక్టర్‌గా ఉండాల్సిందిగా నాకు బాధ్యతలు అప్పగించారు. ‘మిసెస్‌ ఇండియా తెలంగాణ’ పోటీలను 2018లో చేశా. అది ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌’ అయ్యింది. తర్వాత ‘మిసెస్‌ ఆంధ్రా’ పోటీలను నిర్వహించే బాధ్యతను కూడా నాకు అప్పగించారు. వీటితో పాటు పలు ఆరోగ్య, బ్యూటీ ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నా. మారుమూల ప్రాంతాల నుంచి కూడా మేము నిర్వహించే అందాల పోటీల్లో స్త్రీలు ఉత్సాహంగా పాల్గొనాలన్నది మా లక్ష్యం. ఏ మహిళలో ఏ శక్తి ఉందో ఎవరికి తెలుసు? అందుకోసం నేను వారికి ఒక ప్లాట్‌ఫామ్‌ సృష్టించ గలిగా. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే చాలామంది మహిళలు తమ కోసం తాము సమయాన్ని కేటాయించుకోరు. అలాంటి వారిని మోటివేట్‌ చేస్తుంటా. ఆరోగ్యం, యోగ, లుక్స్‌, వాకింగ్‌, మాట్లాడటం వంటివన్నీ నేర్పిస్తా. ప్రస్తుతం ఆన్‌లైన్‌ ద్వారా అవగాహన కార్యక్రమాలు, శిక్షణ ఇస్తున్నాం. వివాహితులైన మహిళలకు సరికొత్త ఎక్స్‌పోజర్‌ ఇస్తున్నాం. 2020 పోటీలకు సంబంధించి ఇప్పటికే ఈ-ఆడిషన్స్‌ నిర్వహించాం. మేము నిర్వహిస్తున్న ‘మిసెస్‌ ఇండియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమాలు ఎందరో వివాహిత మహిళలకు స్ఫూర్తిగా నిలిచాయి. వారికంటూ ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. ఈ పోటీల వల్ల మహిళల్లోని అంతర్గత శక్తిసామర్థ్యాలు బయటపడతాయనడంలో సందేహం లేదు.’’


ఈ-ఆడిషన్స్‌ ద్వారా ఎంపిక!

మిసెస్‌ ఇండియా తెలంగాణ, మిసెస్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌ పీజెంట్‌ ఈ-ఆడిషన్స్‌ ఇటీవల విజయవంతంగా పూర్తిచేశాం. టెక్నాలజీ ఉపయోగించుకుని ఇలా ఈ-ఆడిషన్స్‌ ద్వారా ఫైనలిస్టులతో పీజెంట్‌ నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ-ఆడిషన్స్‌ చేపట్టాం. ఫైనలిస్టులలో విజేతను మరి కొద్దిరోజుల్లో వెల్లడిస్తాం. 2019 పోటీలు విజయవంతం కావడంతో 2020 పోటీలకు వందల సంఖ్యలో వివాహిత మహిళలు పాల్గొన్నారు. వీరిలో వివిధ రంగాలకు చెందినవారితో పాటు గృహిణులు కూడా ఉన్నారు. హైదరాబాద్‌, విశాఖపట్టణం, విజయవాడ లాంటి నగరాల నుంచే కాకుండా ఆదిలాబాద్‌, వరంగల్‌, కొత్తగూడెం, అనంతపురం, కాకినాడ, తిరుపతి వంటి ప్రాంతాల మహిళలు కూడా పాల్గొన్నారు.

- నాగసుందరి


Updated Date - 2020-07-15T05:30:00+05:30 IST