భారత్‌కు సాయం కోసం.. టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడిన 40 యూఎప్ కంపెనీలు!

ABN , First Publish Date - 2021-04-27T19:59:31+05:30 IST

కరోనాతో సతమతమవుతున్న భారత్‌ను ఆదుకునేందుకు యావత్ ప్రపంచ దేశాలు తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి.

భారత్‌కు సాయం కోసం.. టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడిన 40 యూఎప్ కంపెనీలు!

వాషింగ్టన్: కరోనాతో సతమతమవుతున్న భారత్‌ను ఆదుకునేందుకు యావత్ ప్రపంచ దేశాలు తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా సహా ఫ్రాన్స్, బ్రిటన్, కువైట్, సింగపూర్‌ వంటి దేశాలు ఇండియాకు వివిధ రూపాల్లో సాయం చేసేందుకు అంగీకారం తెలిపాయి. తాజాగా యూఎస్‌లోని టాప్ 40 దిగ్గజ కార్పొరేట్ సంస్థలు టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడి భారత్‌కు సహాయం చేయాలని నిశ్చయించాయి. ఇలా 40 కంపెనీలు ఏకతాటిపైకి వచ్చి కరోనాతో అల్లాడుతున్న ఇండియాను ఆదుకోవాలని నిర్ణయించాయి. యూఎస్‌-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ యూఎస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, యూఎస్‌-ఇండియా స్ట్రాటజిక్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్‌ ఫోరం, బిజినెస్‌ రౌండ్‌టేబుల్‌ వంటి వాణిజ్య సంఘాల పర్యవేక్షణలో భారత్‌కు సహాయ సహకారాలు కొనసాగుతాయని సోమవారం జరిగిన ఈ 40 సంస్థల సమావేశంలో నిర్ణయించాయి.


ఈ సందర్భంగా డెలాయిట్‌ సీఈఓ పునీత్‌ రెంజెన్‌ మాట్లాడుతూ.. వచ్చే కొన్ని వారాల్లో సుమారు 20వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను భారత్‌కు పంపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వీలైన మార్గంలో సాధ్యమైనంత వరకు ఇండియాకు సాయం చేయాలని టాస్క్‌ఫోర్స్ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. భారత్ ఈ విపత్కర పరిస్థితి నుంచి అతి త్వరలోనే బయటపడుతుందని పునీత్‌ రంజన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాబోయే రోజుల్లో ప్రధాన వైద్య పరికరాలు, ఆక్సిజన్‌, టీకాలు సహా ఇతర కీలక సరఫరాలను భారత్‌‌కు అందజేయనున్నట్లు ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి సృష్టించిన ఈ సంక్షోభం నుంచి త్వరగా గట్టెక్కాలంటే ప్రపంచం మొత్తం స్పందించాలని యూఎస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు, సీఈఓ సుజాన్ క్లార్క్ అన్నారు. ఇక ఓ దేశంలో నెలకొన్న ఆరోగ్య సంక్షోభాన్ని తొలగించేందుకు అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్‌ సంస్థలు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పడడం ఇదే మొదటిసారి అని యూఎస్ విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్ పేర్కొన్నారు.    

Updated Date - 2021-04-27T19:59:31+05:30 IST