లక్షణాలు లేని 40శాతం కరోనా కేసులు!

ABN , First Publish Date - 2020-08-10T07:22:44+05:30 IST

అమెరికాలోని బోస్టన్‌లో ఒక అనాథాశ్రమంలో 147మందికి కరోనా వైరస్‌ సోకింది. అందరూ కలిసే నివసిస్తున్నారు. కానీ వారిలో 88శాతంమందికి వైర్‌సకు సంబంధించి ఈ లక్షణాలూ లేవు...

లక్షణాలు లేని 40శాతం కరోనా కేసులు!

  • కారణం కనుగొనేందుకు పరిశోధకుల యత్నం


శాన్‌ఫ్రాన్సిస్కో, ఆగస్టు 9: అమెరికాలోని బోస్టన్‌లో ఒక అనాథాశ్రమంలో 147మందికి కరోనా వైరస్‌ సోకింది. అందరూ కలిసే నివసిస్తున్నారు. కానీ వారిలో 88శాతంమందికి వైర్‌సకు సంబంధించి ఈ లక్షణాలూ లేవు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. పరిశోధకుల అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ సోకిన వారిలో 40శాతంమందికి లక్షణాలు లేవు. అందరికీ ఒకేలా సోకే వైరస్‌, లక్షణాల్లో మాత్రం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఎందుకు ప్రవర్తిస్తోంది..? లక్షణాలు కనిపించని వారి రక్షణ వెనుక కారణాలేంటి..? జన్యువులే కారణమా? రోగ నిరోధక శక్తి బాగుండటమా?.. ఇలా ఎన్నో ప్రశ్నలు పరిశోధకుల్ని ప్రస్తుతం వేధిస్తున్నాయి. వీటికి సమాధానం దొరికితే.. ఇక మహమ్మారి అంతమేనని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


టీ- సెల్స్‌ రక్షిస్తున్నాయా?

శరీరంలోకి వచ్చే వైర్‌సలను అడ్డుకుని అంతం చేసే కణాలే టీ-సెల్స్‌. బాల్యంలో వేసిన వాక్సిన్ల కారణంగానో, లేక కరోనా జాతికే చెందిన సాధారణ జలుబుపై పోరాడిన జ్ఞాపకశక్తి కారణంగానో కొంతమందిలో టీ-సెల్స్‌ కరోనాపై పోరాటాన్ని చేస్తున్నాయని పలువురు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. మానవాళిలో కరోనాపై పోరాడలేదని ఇప్పటి వరకూ ఉన్న అంచనా తప్పనేది వారి వాదన. శాన్‌డీగో లోని లా జోల్లా ఇమ్యునాలజీ సంస్థకు చెందిన పరిశోధకులు 2015-18మధ్యలో దానం చేసిన రక్త నమూనాలపై పరిశోధనలు నిర్వహించారు. ఆ రక్తంలోకి కరోనా వైర్‌సను ప్రవేశపెట్టేందుకు యత్నించగా.. 40 నుంచి 50శాతం రక్త నమూనాల్లోని టీ-సెల్స్‌ వైర్‌సపై సమర్థంగా పోరాడాయి.  పలు దేశాల్లోని పరిశోధకులు ఇదే తరహా ప్రయోగంనిర్వహించగా.. నెదర్లాండ్స్‌లో 20ు, జర్మనీలో 34ు, సింగపూర్‌లో 50ు నమూనాల్లో టీ-సెల్స్‌ కరోనాపై విజయాన్ని సాధించాయని తేలింది. అయితే.. లక్షణాలు కనిపించకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయని.. అప్పుడే ఆ విషయంలో ఒక అంచనాకు రాకూడదని అమెరికా అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ హెచ్చరిస్తున్నారు. యువకులు కావడం, మానసికంగా బలంగా ఉండటం, రోగనిరోధక శక్తి బాగుండటం.. ఇలా ఒక్కో వ్యక్తిలో ఒక్కో కారణం వలన లక్షణాలు బయటపడకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 


Updated Date - 2020-08-10T07:22:44+05:30 IST