40 కిలోల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2022-08-19T06:19:35+05:30 IST

: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న 40కిలోల గంజాయిని జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసి, గంజాయిని తరలిస్తున్న కారును సీజ్‌ చేశారు.

40 కిలోల గంజాయి స్వాధీనం
జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో గంజాయి స్వాధీన వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

సూర్యాపేటక్రైం, ఆగస్టు 18: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న 40కిలోల గంజాయిని జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసి, గంజాయిని తరలిస్తున్న కారును సీజ్‌ చేశారు.  గురువారం సూర్యాపేట పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ ఫరీద్‌ గంజాయికి అలవాటుపడ్డాడు. ఇదే క్రమంలో గంజాయిని పీల్చే యాదాద్రి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండల కేంద్రానికి చెందిన కొండూరు మధు, వీరమళ్ల స్వామి, హైదరాబాద్‌కు చెందిన కనగాల వెంకటసాయి సాత్విక్‌, లింగంపల్లి మిధున్‌, ఆడప మణికంఠ అనే వ్యక్తులతో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. ఈ  క్రమంలో పలు ప్రాంతాల్లో కలుసుకుని మద్యం, గంజాయి తాగేవారు. ఇలా ఏడాదిగా కలిసి తాగుతున్నారు. అయితే గంజాయి కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇబ్బందిగా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం, అరకు ప్రాంతాల్లో గంజాయి తక్కువ ధరకు లభిస్తుందని తెలుసుకున్నారు. ఆరు నెలలుగా వీరంతా కలిసి హైదరాబాద్‌లో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు అద్దెకు తీసుకుని అరకు ప్రాంతానికి వెళ్లి అక్కడ కిలో గంజాయిని రూ.1,500కు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలించి రూ.10వేలకు విక్రయిస్తున్నారు. అదేవిధంగా వారు కూడా గంజాయిని పీలుస్తున్నారు.  ఇలా ఇప్పటి వరకు ఐదుసార్లు గంజాయిని హైదరాబాద్‌కు తరలించి విక్రయించారు. ఈ క్రమంలోనే ఈ నెల 17న హైదరాబాద్‌లో ఇన్నోవా కారును అద్దెకు తీసుకుని అరకు వెళ్లి అక్కడ ఓ వ్యక్తి వద్ద సుమారు 40 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. దాన్ని హైదరాబాద్‌కు తరలిస్తుండగా ఈ నెల 18న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పట్టణ శివారులోకి రాగానే వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులను గమనించారు. అక్కడి నుంచి వాహనాన్ని తప్పించే క్రమంలో చిక్కారు. పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా సుమారు రూ.4లక్షల విలువ చేసే 40కిలోల గంజాయి లభ్యమైంది. దీంతో గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురిపై కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.



Updated Date - 2022-08-19T06:19:35+05:30 IST