కాచిగూడలో 40 ఐసోలేషన్‌ కోచ్‌లు

ABN , First Publish Date - 2020-04-09T16:42:40+05:30 IST

కాచిగూడలో 40 ఐసోలేషన్‌ కోచ్‌లు

కాచిగూడలో 40 ఐసోలేషన్‌ కోచ్‌లు

మూడు రోజుల్లో అందుబాటులోకి..

500 మందికి చికిత్స చేసేందుకు చర్యలు

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని గడగడ వణికిస్తోన్న కరోనా వైరస్‌ నివారణకు దక్షిణ మధ్య రైల్వే తనవంతు సాయానికి సిద్ధమైంది. రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తన పరిధిలో అందుబాటులో ఉన్న సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లను ఆధునికీకరిస్తూ వైద్యశాఖ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోంది. రైలు కోచ్‌లను క్వారంటైన్‌, ఐసోలేషన్‌ వార్డులుగా మార్పు చేసి సిద్ధంగా ఉంచింది. ఇప్పటివరకు లాలాగూడ క్యారేజీ వర్క్‌షాప్‌ అధికారులు నాన్‌ ఏసీ స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌లోని జీఎ్‌ససీఎన్‌ 00205కి చెందిన 2 క్యాబిన్లను ప్రోటోటైప్‌ ఐసోలేషన్‌ క్యాబిన్లుగా మార్పు చేసి కరోనా బాధితులకు అందుబాటులో ఉంచారు. తాజాగా కాచిగూడ రైల్వేస్టేషన్‌లో 40 ఐసోలేషన్‌ కోచ్‌లను సిద్ధంగా ఉంచుతున్నారు. ఇప్పటికే 19 బోగీలను ఐసోలేషన్‌ కోచ్‌లుగా మార్చారు. మిగతా బోగీల్లో పనులను చురుగ్గా చేస్తున్నారు. ఒక్కో కోచ్‌లో 13 మంది కరోనా అనుమానితులకు చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 500 మందికి చికిత్స అందించే అవకాశం ఉంటుందని, ఈ కోచ్‌లను కాచిగూడ స్టేషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు స్థానిక అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల్లో ఐసోలేషన్‌ కోచ్‌లు సేవలకు సిద్ధంగా ఉంటాయని పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-09T16:42:40+05:30 IST