HYD : వంట చేస్తుండగా ప్రమాదం.. 40 గుడిసెలు దగ్ధం.. సర్వం కోల్పోయారు..!

ABN , First Publish Date - 2022-01-01T16:23:04+05:30 IST

వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పంటుకుని 40 గుడిసెలు దగ్ధమయ్యాయి...

HYD : వంట చేస్తుండగా ప్రమాదం.. 40 గుడిసెలు దగ్ధం.. సర్వం కోల్పోయారు..!

హైదరాబాద్ సిటీ/అఫ్జల్‌గంజ్ : వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పంటుకుని 40 గుడిసెలు దగ్ధమయ్యాయి. పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లింది. ప్రాణనష్టం ఏమీ జరగలేదు. అఫ్జల్‌గంజ్‌ సీఐ రవీందర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌కు చెందిన 30 కుటుంబాలు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి చాదర్‌ఘట్‌ సాయిబాబా దేవాలయం సమీపంలో ఉన్న మూసీ ఒడ్డున గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. వెదురు కట్టెలతో తయారు చేసిన బుట్టలు అల్లి విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు.


శుక్రవారం మధ్యాహ్నం 3 సమయంలో ఓ గుడిసెలో వంట చేస్తుండగా పొయ్యి నుంచి నిప్పు గుడిసెకు అంటుకుంది. ఆ మంటలు పక్కనున్న గుడిసెలకు కూడా వ్యాపించాయి. దీంతో గుడిసెవాసులు పిల్లలను తీసుకొని రోడ్డుపైకి పరుగులు తీశారు. గుడిసెలో ఉన్న మూడు గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో మంటలు మరింత ఎగిసిపడ్డాయి. సుల్తాన్‌బజార్‌ ఏసీపీ దేవేందర్‌ గుప్తా, ఇన్‌స్పెక్టర్‌లు రవీందర్‌ రెడ్డి, భిక్షపతి ఘటనాస్థలానికి చేరుకుని సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. గౌలిగూడ అగ్నిమాపక కేంద్రం నుంచి ఐదు ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పాయి. ప్రమాదంలో అత్యధిక మంది సర్వం కోల్పోయి బోరున విలపిస్తున్నారు. 




Updated Date - 2022-01-01T16:23:04+05:30 IST