నాటిన వ్యక్తికి రికార్డు అందించిన మామిడి చెట్టు!

ABN , First Publish Date - 2021-06-24T23:43:25+05:30 IST

అది సాధారణ మామిడి చెట్టే.. అయితే అసాధారణంగా ఎదిగింది..

నాటిన వ్యక్తికి రికార్డు అందించిన మామిడి చెట్టు!

అది సాధారణ మామిడి చెట్టే.. కానీ, అసాధారణంగా ఎదిగింది.. 18 ఏళ్లలో ఏకంగా 40 అడుగులు పెరిగిపోయింది.. అంతేకాదు నాటి, సంరక్షించిన వ్యక్తికి ఏకంగా ప్రపంచ రికార్డు అందించబోతోంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) మాజీ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.రమేష్ బాబు 18 ఏళ్ల క్రితం తన ఇంటి పెరట్లో నాటిన మల్లిక మామిడి చెట్టు ఈ అరుదైన ఘనతను సాధించింది.


సహజంగా మల్లిక మామిడి చెట్లు 20 నుంచి 25 అడుగులకు మించి పెరగవు. అయితే బెంగళూరులోని రమేష్ బాబు ఇంటి పెరట్లో నాటిన చెట్టు ఏకంగా 40 అడుగులకు పెరిగింది. అంత ఎత్తు చూసి ఆశ్చర్యపోయిన రమేష్.. రికార్డుల పుస్తకం తిరిగేయగా ఇదొక అరుదైన అంశమని తేలింది. దాంతో ఈ అంశాన్ని ఆధారాలతో సహా ప్రపంచ రికార్డు పుస్తకాల సంస్థకు పంపగా వారు ఇలాంటి రికార్డు ఇంతవరకు ఎక్కడా నమోదు కాలేదని పేర్కొన్నారు. అంతేకాదు, దీనిని త్వరలోనే ప్రపంచ రికార్డు పుస్తకంలో నమోదు చేయబోతున్నట్లు సమాచారం అందించారు.


2003లో జయనగరంలోని ఓ సైంటిఫిక్ నర్సరీలో మల్లికా మామిడి మొక్కను కొన్న రమేష్ తమ ఇంటి పెరట్లో నాటి సురక్షితంగా పెంచుకుంటూ వచ్చారు. 18 సంవత్సరాలుగా సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువులనే ఈ చెట్టుకు వినియోగిస్తూ వచ్చారు. దాంతో అది అసాధారణ ఎత్తుకు ఎదిగింది. ఏదో ఆసక్తి కొద్దీ సరదాగా పెంచుకున్న మామిడి మొక్క ఇంత ఎత్తు చెట్టుగా ఎదిగి తనకు ఒక రికార్డు అందిస్తుందని ఊహించలేదని రమేష్ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, రమేష్‌కు ఇది 104వ రికార్డు కావడం విశేషం. ఇప్పటికే ఆయన వివిధ అంశాల్లో 94 ప్రపంచ రికార్డులు, 9 జాతీయ రికార్డులను సొంతం చేసుకున్నారు.


Updated Date - 2021-06-24T23:43:25+05:30 IST