Abn logo
May 1 2021 @ 20:26PM

మరి కొద్ది గంటల్లోనే కౌంటింగ్.. ఈసీ తాజా ఆదేశాలు

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల (2021) కౌటింగ్‌‌కు భారత ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. ఈ ఐదు రాష్ట్రాలు/యూటీలో జరిగే కౌంటింగ్ కోసం 822 ఆర్ఓ‌లు, 7000కు పైగా ఏఆర్ఓలను ఏర్పాటు చేసినట్టు శనివారంనాడు ఎన్నికల కమిషన్ తెలియజేసింది. కౌంటింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లతో సహా సుమారు 95,000 కౌంటింగ్ అధికారులు కౌంటింగ్ పక్రియ టాస్క్‌ను పర్యవేక్షిస్తారని ఆ ఉత్తర్వులో ఈసీ తెలిపింది.

ఈసారి కౌంటింగ్ హాల్స్‌ను 200 శాతం పెంచినట్టు ఈసీ తెలిపింది. 2016 ఎన్నికల్లో 1002 కౌంటింగ్స్ హాల్స్ ఏర్పాటు చేయగా, ఈసారి 2364 కౌంటింగ్స్ హాల్స్‌ ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. కోవిడ్ చర్యలపై కమిషన్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు ఈసీ తెలిపింది. కౌంటింగ్ దృష్ట్యా కఠిన చర్యలను జారీ చేసినట్టు పేర్కొంది.  ఆర్‌టీ-పీసీఆర్/ఆర్ఏటీ టెస్టులు చేయించుకోవడం కానీ, 2 డోసుల వ్యాక్సన్ తీసుకోవడం కానీ చేయని అభ్యర్థులు, ఏజెంట్లను కౌంటింగ్ హాల్స్‌లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. హెల్త్ సేఫ్టీ ప్రోటోకాల్స్ కఠినంగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నామని పేర్కొంది.

పశ్చిమబెంగాల్‌లో 256 కంపెనీల కేంద్ర బలగాలను ఈసీ మొహరించింది. అసోం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలోనూ ఇదే తరహా ఏర్పాట్లు చేసింది. కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు గాను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు 957 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకేతో పాటు కమల్ హాసన్ మక్కల్ నీధి మయ్యం పార్టీ బరిలో ఉంది. 75 కౌంటింగ్ కేంద్రాలను రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. పుదుచ్చేరిలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్-బీజేపీ కూటమి, కాంగ్రెస్-డీఎంకే ప్రధాన ప్రత్యర్థులుగా బరిలో ఉన్నారు.

Advertisement
Advertisement