RJDలోకి MIM ఎమ్మెల్యేలు.. నెం.1 స్థానం కోల్పోనున్న BJP!

ABN , First Publish Date - 2022-06-30T02:40:10+05:30 IST

బిహార్‌లో ఎంఐఎంకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు తొందరలోనే ఆర్‌జేడీలో చేరనున్నారట. ఇదే జరిగితే బిహార్ ఎంఐఎం పూర్తిగా ఆర్జేడీలో కలిసిపోయినట్టే అవుతుంది...

RJDలోకి MIM ఎమ్మెల్యేలు.. నెం.1 స్థానం కోల్పోనున్న BJP!

పాట్నా: బిహార్‌లోని ఏఐఎంఐఎం(AIMIM) పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాష్ట్రీయ జనతాదళ్(RJD) పార్టీలో చేరనున్నారు. వీరి చేరిక గురించి ఈ నెల మొదటి వారం నుంచే చర్చ జరుగుతుండగా తాజాగా ఇది తుది దశకు చర్చలు జరిగాయని తెలుస్తోంది. దీంతో కొద్ది రోజుల క్రితం బిహార్‌లో ఏకైక పెద్ద పార్టీ హోదాను కోల్పోయిన ఆర్జేడీ.. మళ్లీ ఆ స్థానాన్ని సంపాదించుకోనుంది. కొద్ది రోజుల క్రితం వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ)కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను చేర్చుకుని బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా అవతరించి ఆర్జేడీని రెండవ స్థానానికి నెట్టేసింది. అయితే ఎంఐఎం ఎమ్మెల్యేలను చేర్చుకుని ఆర్జేడీ తన మొదటి స్థానాన్ని మరోసారి నిలుపుకోనుంది.


బిహార్‌లో ఎంఐఎంకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు తొందరలోనే ఆర్‌జేడీలో చేరనున్నారట. ఇదే జరిగితే బిహార్ ఎంఐఎం పూర్తిగా ఆర్జేడీలో కలిసిపోయినట్టే అవుతుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం బిహార్‌లోని ఎంఐఎం ఎమ్మెల్యేల ఆలోచనలు మారిపోయాయట. ఆ ఎన్నికల్లో 90 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టిన ఎంఐఎం.. ఏ ఒక్క స్థానం గెలవకపోగా కనీసం డిపాజిట్ కూడా సాధించలేకపోయింది. యూపీలో 20 శాతం ముస్లిం ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ ఎంఐఎం కేవలం ఒకే ఒక్క శాతం ఓట్ బ్యాంక్‌కు పరిమితమైంది. వచ్చే రోజుల్లో బిహార్‌లో సైతం ఇవే పరిస్థితులు రావొచ్చని ఎంఐఎం నేతలు భావిస్తున్నారట. తమ భవిష్యత్‌ను దృష్టిల్లో పెట్టుకుని ఆర్జేడీలోకి వెళ్తే 2025లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అస్థిత్వాన్ని నిలుపుకోవచ్చని అనుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇదెంత వరకు వాస్తవమో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.


2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం.. 75 స్థానాలు సాధించి ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక బీజేపీ 74 స్థానాలో రెండో స్థానంలో నిలిచింది. వీఐపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో 77 స్థానాలతో బీజేపీ మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆర్జేడీలోకి వస్తే ఆ పార్టీ బలం 79కి చేరుతుంది. దీంతో బీజేపీ కంటే రెండు స్థానాలు ఎక్కువతో బిహార్ అసెంబ్లీలో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది.

Updated Date - 2022-06-30T02:40:10+05:30 IST