ఒకే కుటుంబంలో నలుగురికి

ABN , First Publish Date - 2020-04-10T08:01:36+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి తగ్గడం లేదు. గురువారం కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. ప్రకాశంలో 11, గుంటూరులో 2, కడప, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కొక్కరికి పాజిటివ్‌గా...

ఒకే కుటుంబంలో నలుగురికి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) : రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి తగ్గడం లేదు. గురువారం కొత్తగా 15 కేసులు నమోదయ్యాయి. ప్రకాశంలో 11, గుంటూరులో 2, కడప, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కొక్కరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 363కి చేరింది. ప్రకాశం జిల్లాలో ఒక్కరోజే 11 కేసులు నమోదవడం తీవ్ర కలకలకం రేపింది. వీటిలో 10 ఒంగోలు ఇస్లాంపేటకు చెందినవి కావడం ఆందోళన కలిగించే విషయం. వారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. ఆ ఇంట్లోని వ్యక్తికి ఇంతకుముందే పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటికే ఇస్లాంపేటలో ఏడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గురువారం నమోదైన మరో కేసు ఒంగోలులోని గోపాలనగరానికి చెందిన వారు. 


గుంటూరులో తొలి కరోనా మరణం 

కరోనా మహమ్మారి గుంటూరు జిల్లాలో తొలిసారిగా ఒకరిని బలి తీసుకుంది. నరసరావుపేటకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి గురువారం మృతిచెందాడు. ఇంటింటికీ వెళ్లి కేబుల్‌ బిల్లు వసూలు చేసే అతనికి ఈ నెల 6న పాజిటివ్‌ అని తేలింది. దీంతో అతన్ని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అతడికి క్షయ కూడా ఉండడంతో కరోనా ప్రభావం ఎక్కువై మూడు రోజుల్లోనే మరణించాడు. కాగా.. పొన్నూరుకు చెందిన మాజీ సైనికుడి (70)కి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో విజయవాడకు తరలించారు. ఇటీవల గుంటూరు వచ్చిన అతనికి ఢిల్లీ కనెక్టివిటీ ద్వారా సోకిందేమోనని అనుమానిస్తున్నారు.  


మృతుడి సోదరుడూ మృతి

కృష్ణాజిల్లా కరోనా వైరస్‌ బారినపడి మృతి చెందిన వ్యక్తి సోదరుడు మృతి చెందాడు. మచిలీపట్నానికి చెందిన రోల్డ్‌గోల్డ్‌ వ్యాపారికి పాజిటివ్‌ రావడంతో విజయవాడలో చికిత్స పొందుతూ మరణించారు. పెడన క్వారంటైన్‌ సెంటరులో ఉన్న అతడి సోదరుడికి గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. వైద్యపరీక్షల్లో నెగెటివ్‌ అని తేలిన తర్వాతే మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. 


ఉపాధ్యాయుడికి కరోనా 

విశాఖ జిల్లా పాయకరావుపేట మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు (38)కి తూర్పుగోదావరిజిల్లాలో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అతనికి న్యుమోనియా కూడా ఉండడంతో ముందుజాగ్రత్తగా విశాఖకు తరలించారు. ఆయున భార్యకు నెగిటివ్‌ వచ్చింది. ఆయనకు వ్యాధి లక్షణాలున్నా సమాచారమివ్వకుండా దాచిపెట్టినందుకు ఉపాధ్యాయుడి మావయ్య, ఆర్‌ఎమ్‌పీ వైద్యుడు, లాబ్‌ టెక్నీషియన్‌లపై కేసులు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ నయీమ్‌ అస్మీ తెలిపారు. 


కడప జిల్లాలో మరొకటి

కడప జిల్లాలో మైదుకూరుకు చెందిన మహిళకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఢిల్లీ వెళ్లొచ్చిన కొడుకు నుంచి ఆమెకు వైరస్‌ సోకింది. 


చిత్తూరులో కోలుకున్న బాధితుడు

చిత్తూరు జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసుగా నమోదైన యువకుడు కోలుకున్నాడు. గురువారం అతడ్ని వైద్యులు డిశ్చార్జి చేశారు. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన 23 ఏళ్ల యువకుడు లండన్‌ నుంచి మార్చి 19న స్వస్థలం చేరుకున్నాడు. అతనికి కరోనా పాజిటివ్‌ అని 24న తేలింది. దీంతో అతనికి తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స అందించారు. రెండోసారి కూడా నెగెటివ్‌ రిపోర్టు రావడంతో గురువారం అతన్ని డిశ్చార్జి చేశారు.



Updated Date - 2020-04-10T08:01:36+05:30 IST