కుల్గాంలో నలుగురు ఉగ్రవాదులు హతం

ABN , First Publish Date - 2020-04-04T21:09:33+05:30 IST

ప్రపంచాన్ని కరోనా వైరస్ కుదిపేస్తున్నా, ఉగ్రవాదులు తమ రాక్షసత్వాన్ని వీడటం లేదు.

కుల్గాంలో నలుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ : ప్రపంచాన్ని కరోనా వైరస్ కుదిపేస్తున్నా, ఉగ్రవాదులు తమ రాక్షసత్వాన్ని వీడటం లేదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. దక్షిణ కశ్మీరులో సాధారణ ప్రజానీకంపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల వీరి రక్తదాహానికి నలుగురు అమాయకులు బలయ్యారు. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. 


జమ్మూ-కశ్మీరు పోలీసులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం, గత 12 రోజుల్లో దక్షిణ కశ్మీరులో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు యథేచ్ఛగా సాధారణ ప్రజలపై విరుచుకుపడ్డారు. నలుగురు సామాన్యులను హత్య చేశారు. ఈ నేపథ్యంలో కుల్గాంలో భద్రతా దళాలు ఉగ్రవాదుల ఏరివేత కార్యకలాపాలు నిర్వహించాయి. భద్రతా దళాలను గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పని చేస్తున్నట్లు గుర్తించారు. 


మృతి చెందిన ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల ఏరివేత కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయి.


Updated Date - 2020-04-04T21:09:33+05:30 IST