ఫోన్ చేస్తే చాలు.. పెట్రోల్ హోం డెలివరీ.. నలుగురు కుర్రాళ్లు ఈ వినూత్న ఐడియాతో ఎంత సంపాదిస్తున్నారంటే..

ABN , First Publish Date - 2021-08-28T03:06:45+05:30 IST

పెట్రోల్ హోం డెలివరీతో కోట్లల్లో వ్యాపారం..

ఫోన్ చేస్తే చాలు.. పెట్రోల్ హోం డెలివరీ.. నలుగురు కుర్రాళ్లు ఈ వినూత్న ఐడియాతో ఎంత సంపాదిస్తున్నారంటే..

ఇంటర్నెట్ డెస్క్:  మీరు కారులో  ఓ లాంగ్ టూర్‌పై వెళ్లారనుకోండి.. మార్గమధ్యంలో అకస్మాత్తుగా పెట్రోల్ అయిపోయింది.. అప్పుడు ఏం చేస్తారు..? ఇంకేముందీ లెఫ్ట్‌రైట్ అంటూ కాలినడకన దగ్గర్లోని పెట్రోల్ బంక్‌కు వెళతాం అంటారా.. మరి దగ్గర్లో పెట్రోల్ పంప్ ఏదీ లేకపోతే..టూర్ సరదా మొత్తం పాడైపోదు..? అటువంటి టైం‌లో ఒక్క ఫోన్‌కాల్‌తో మనవద్దకే పెట్రోల్ వస్తే  భలేగా ఉంటుంది కదూ..! ఆగండాగండీ.. ఇదేమీ పగటికల కాదు! గుజరాత్ రాష్ట్రంలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. అంతేకాదు.. త్వరలో దేశమంతటా కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రానుందట. ఫ్యూలీ అనే కంపెనీ ఈ వినూత్న ఐడియాను ఆచరణలో పెట్టి విజయం సాధించింది. గిరాకీ అదిరిపోవడంతో ప్రస్తుతం కోట్లల్లో లాభాలు కళ్లజూస్తోంది!  ‘అవసరాలే ఆవిష్కరణలకు ప్రాణం పోస్తాయి’ అన్నట్టు.. ఓ యువకుడు ఎదుర్కొన్న ఇబ్బందిలోంచే ఈ కంపెనీ పుట్టుకొచ్చింది. 


టూర్ ఇబ్బంది.. కొత్త కంపెనీకి నాంది.. 

గుజరాత్‌కు చెందిన స్వపన్(33) అమెరికాలో మాస్టర్స్ చేశారు. కొన్నేళ్ల పాటు అక్కడే ఉద్యోగం చేశారు. అయితే.. కొంత కాలం క్రితం ఆయన తన మిత్రులతో కలిసి రాజస్థాన్‌లో విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో వారి కారులో పెట్రోల్ అయిపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. దగ్గర్లో ఎక్కడా పెట్రోల్ బంక్ లేదని తెలిసింది. అయితే..స్థానికుడు ఒకరు కొంత దూరంలో ఉన్న షాపులో పెట్రోల్ దొరుకుతుందని చెప్పడంతో వారు అక్కడికి కెళ్లారు. రెట్టింపు ధర చెల్లించి పెట్రోల్ తెచ్చుకుని తమ టూర్ కొనసాగించారు. అయితే.. ఈ అనుకోని అవాంతరం వారి ఉత్సాహాన్ని కొంతమేర నీరుగార్చింది. ఆ సమయంలోనే స్వపన్‌కు ..ఇంధనాన్ని హోం డెలివరీ చేయాలన్న ఐడియా మదిలో మెదిలింది. 


ఈ విషయాన్ని స్వపన్ తన ముగ్గురు స్నేహితులైన పూర్వమ్, ఆలయ్, వ్యోమ్‌లకు చెప్పారు. ఈ ఐడియాకు కార్యరూపం ఇస్తే ప్రజలు కోరుకున్న చోటుకి పెట్రోల్, డీజిల్ చేరవేయచ్చన్నారు. దీంతో..అందరికీ ఈ ఐడియా నచ్చేసింది. అసలే వారందరూ ఉన్నత విద్యావంతులు.. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారు. వ్యాపారావకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవడంలో నేర్పు గలవారు. మరోవైపు.. వీరు ఎంచుకున్న వ్యాపారరంగం ప్రస్తుతం శైశవ దశలో ఉంది. దేశంలో ఇలాంటి కంపెనీల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. కాబట్టి.. కంపెనీ ప్రారంభించే ధైర్యం చేయగలిగితే..వ్యాపారాభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఈ ఆలోచనతో వారు కార్యరంగంలోకి దూకేశారు. 


ఈ క్రమంలో స్వపన్ తన అమెరికా ఉద్యోగాన్ని వదిలేసి భారత్‌కు వచ్చేశాడు. ఆ తరువాత నలుగురూ కలిసి గతేడాది రూ.50 లక్షలతో ఫ్యూలీ పేరిట ఓ కంపెనీ ప్రారంభించారు. మొదట్లో గుజరాత్‌లోని వడోదర నగరానికే ఈ కంపెనీ సేవలు పరిమితమయ్యాయి. అక్కడున్న ఆస్పత్రులు, హోటళ్లు, చిన్న చిన్న కంపెనీలకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేసేశారు. దీంతో..వారి కంపెనీ మెల్లగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ క్రమంలో కంపెనీ సేవలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. వడోదర, పంచ్‌మహల్, బరోచ్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకూ ఫ్యూలీ.. డీజిల్ సరఫరా చేయసాగింది. ఈ క్రమంలో కంపెనీ ప్రారంభమైన తొలి ఏడాదే మూడు కోట్ల వరకూ లాభం వచ్చింది. 


ఫోన్ చేస్తే చాలు..కావాల్సిన చోటుకి పెట్రోల్..

పెట్రోల్, డీజిల్ కోసం ఫ్యూలీ(Fuely) కొన్ని ఆయిల్ కంపెనీలతో నేరుగా ఒప్పందం కుదుర్చుకుంది. కావాల్సిన చోటుకు పెట్రోల్ డీజిల్‌ను సరఫరా చేసేందుకు వివిధ ప్రాంతాల్లో ట్యాంకర్లను కూడా ఏర్పాటు చేసింది. ఇక ఫోన్ కాల్ వచ్చిన వెంటనే ఈ ట్యాంకర్ల నుంచి సమీపంలో ఉన్న చోటుకు డీజిల్‌, పెట్రోల్‌ను సరఫరా చేస్తుటుంది. ఇక గ్రామీణావసరాల కోసం ప్రత్యేకంగా ఓ ట్యాంకర్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా ఆర్డర్ ఇస్తే చాలు..కోరిన చోటుకు పెట్రోల్ చేరుకుంటుంది. ఆర్డరిచ్చిన 30 నిమిషాల్లోనే డెలివరీ అయిపోతుంది. అంతేకాదు.. పెట్రోల్ బంకుల్లోని ధరకే వారు ఇలా కోరుకున్న చోటుకి ఇంధనాన్ని డెలివరీ చేస్తారు. తాము సరఫరా చేసే ఇంధనంలో ఎటువంటి కల్తీ ఉండదని కూడా కంపెనీ నిర్వాహకులు హామీ ఇస్తున్నారు. 


ఇక..ఫ్రాంచైజ్ మోడల్లో ఈ వ్యాపారాన్ని విస్తరించేందుకు అవకాశమివ్వాలంటూ అనేక ఔత్సాహిక వ్యాపారులు తమను సంప్రదిస్తున్నారని ఫ్యూలీ నిర్వాహకులు తెలిపారు. అన్నీ అనుకూలిస్తే..వచ్చే నాలుగు ఐదేళ్లలో ఫ్రాంచైజ్ విధానంలో దేశమంతటా తమ సేవలు విస్తరిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే..భారత్ పెట్రోలియం ఇప్పటికే ఫ్యూయల్ కార్ట్ పేరిట ఇటువంటి సేవలను నిర్వహిస్తోంది. బీహార్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఫ్యూయల్‌కార్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్, రిపోజ్ ఎనర్జీ, మై పెట్రోల్ పంప్, పెప్ ఫ్యూల్స్  వంటి సంస్థలూ కుడా ప్రస్తుతం ఇంధనాన్ని హోం డెలివరీ చేస్తున్నాయి. 

Updated Date - 2021-08-28T03:06:45+05:30 IST