నేడు అల్పపీడనం

ABN , First Publish Date - 2021-06-11T07:59:31+05:30 IST

తూర్పు, ఈశాన్య బంగాళాఖాతం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ప్రభావంతో శుక్రవారం వాయవ్య బంగాళాఖాతం పరసరాల్లో అల్పపీడనం ఏర్పడనున్నది

నేడు అల్పపీడనం

  • 4 రోజులు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
  • మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వానలు 
  • సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచన
  • రాష్ట్రమంతటా విస్తరించిన నైరుతి 


అమరావతి/విశాఖపట్నం, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): తూర్పు, ఈశాన్య బంగాళాఖాతం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ప్రభావంతో శుక్రవారం వాయవ్య బంగాళాఖాతం పరసరాల్లో అల్పపీడనం ఏర్పడనున్నది. తదుపరి 24 గంటల్లో ఇది మరింత బలపడి, తీవ్ర అల్పపీడనంగా మారనుంది. పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ, ఒడిసా మీదుగా పయనిస్తుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో ఈ నెల 14 వరకు ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని పేర్కొంది. నాలుగురోజుల పాటు కోస్తా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం సూచించింది. గురువారం కోస్తాలో అక్కడక్కడా తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. ఉత్తర కోస్తాలో 32-36 డిగ్రీలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 35-39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో వాతావరణం చల్లబడింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా సగటున 2-3 డిగ్రీలు తగ్గాయి. విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. 


నైరుతికి అనుకూలం 

నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి రాష్ట్రమంతటా విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. ఈ నెల 4న రాష్ట్రంలో తొలుత రాయలసీమలో పలు ప్రాంతాలను రుతుపవనాలు తాకాయి. ఆ తరువాత ఐదు రోజుల వ్యవధిలో రాయలసీమతో పాటు కోస్తాలోని అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. గుజరాత్‌,  మధ్యప్రదేశ్‌, ఒడిసాలలో దక్షిణాది ప్రాంతాలకు, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌ల్లో కొన్ని ప్రాంతాలకు, ఉత్తర బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాల్లో ప్రవేశించాయి. రానున్న 48 గంటల్లో మధ్య, తూర్పు, ఉత్తర భారత్‌లో అనేక ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - 2021-06-11T07:59:31+05:30 IST