కల్లోల కాబూల్‌ నుంచి 390 మంది భారత్‌కు

ABN , First Publish Date - 2021-08-23T11:36:35+05:30 IST

కల్లోలిత అఫ్ఘానిస్థాన్‌ నుంచి భారతదేశం ఇద్దరు అఫ్ఘాన్‌ ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో సహా 390 మందిని భారతదేశానికి తరలించింది. మొత్తం మూడు విమానాల్లో వీరిని ఆదివారం కాబూల్‌ నుంచి

కల్లోల కాబూల్‌ నుంచి 390 మంది భారత్‌కు

ఇద్దరు అఫ్ఘానిస్థాన్‌ ఎంపీలతో సహా ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన అధికారులు

న్యూఢిల్లీ, ఆగస్టు 22: కల్లోలిత అఫ్ఘానిస్థాన్‌ నుంచి భారతదేశం ఇద్దరు అఫ్ఘాన్‌ ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో సహా 390 మందిని భారతదేశానికి తరలించింది. మొత్తం మూడు విమానాల్లో వీరిని ఆదివారం కాబూల్‌ నుంచి ఢిల్లీలోని హిండన్‌ ఎయిర్‌బీ్‌స కు తీసుకొచ్చారు. సి-17 హెవీ లిఫ్ట్‌ మిలటరీ రవాణా విమానంలో తొలుత 168 మందిని తీసుకొచ్చారు. అందులో 107 మంది భారతీయ పౌరులు కాగా.. 23 మంది అఫ్ఘానీ సిక్కులు, హిందువులు. అలాగే ఎయిరిండియాకు చెందిన ప్రత్యేక విమానంలో తజకిస్థాన్‌ నుంచి 87 మంది భారతీయులను, ఇద్దరు నేపాలీ పౌరులను తీసుకొచ్చారు. ఆ 89 మందినీ శనివారమే కాబూల్‌ నుంచి డూషాన్‌బే (తజకిస్థాన్‌ రాజధాని) నగరానికి తరలించారు. వారంతా అఫ్ఘానిస్థాన్‌లో వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు. ఆదివారం అక్కణ్నుం చి వారు భారత్‌కు వచ్చారు.


అంతకుముందు.. అమెరికా, నాటో విమానా ల్లో దశలవారీగా కాబూల్‌ నుంచి దోహాకు తరలించిన 135 మంది భారతీయులను.. ఒక ప్రత్యేక విమానంలో ఆదివారం ఢిల్లీకి తీసుకొచ్చారు. మిలటరీ రవాణా విమానంలో వచ్చిన 168 మందిలో కాబూల్‌ చట్టసభల సభ్యులు అనార్కలీ హొనర్యార్‌, నరేంద్రసింగ్‌ ఖల్సాతోపాటు.. వారి కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ‘‘భారతదేశం మా రెండో ఇల్లు. మేం తరతరాలుగా అఫ్ఘానిస్థాన్‌లో ఉంటున్నా, అఫ్ఘాన్‌పౌరులమే అయినా.. ప్రజలు మమ్మల్ని హిందుస్థానీలుగానే పిలుస్తారు. మాకు చేయూతనందించినందుకు భారతదేశానికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను’’ అని నరేంద్ర సింగ్‌ ఖాస్లా ఢిల్లీలో విలేకరులతో అన్నారు. కాబూల్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చేదారిలో తాలిబాన్లు తమను పక్కకు నిలబడమన్నారని.. తా ము అఫ్ఘాన్‌ పౌరులం కావడమే ఇందుకు కారణమని తెలిపారు. కానీ తమ వద్ద పిల్లలుండడం వల్లనే రాగలిగామని  పేర్కొన్నారు. నరేంద్ర  సింగ్‌ తండ్రి అవతార్‌సింగ్‌ 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీచేశారు. కానీ, ఆయన ఆ ఏడాది జూలై 1న జరిగిన ఆత్మాహుతి దాడిలో మరణించారు. ఆయన జీవించి ఉంటే.. అఫ్ఘాన్‌ పార్లమెంటులో అడుగుపెట్టిన తొలి సిక్కుగా నిలిచేవారు.



ఆ దాడిలో నరేంద్ర సింగ్‌ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కోలుకుని తండ్రిస్థానంలో గెలుపొంది అఫ్ఘాన్‌ ప్రజాప్రతినిధుల సభలో (మన లోక్‌సభతో సమానం) అడుగుపెట్టారు.  అఫ్ఘాన్‌ పార్లమెంటులో ఎగువసభ సభ్యురాలైన అనార్కలీ హొనర్యార్‌ కూడా భారత ప్రభుత్వానికి, కృతజ్ఞతలు తెలుపుతూ ఒక వీడియో విడుదల చేశారు. తాలిబాన్లు తమ ఇంటిని తగలబెట్టడంతో.. తాను, తన కూతురు, ఇద్దరు మనవలతో పారిపోయి భారత్‌కు చేరుకున్నానని, భారతీయ సోదరసోదరీమణులే తమను కాపాడారాని మరో అఫ్ఘానీ మహిళ కృతజ్ఞతలు తెలిపారు.


ఇప్పటిదాకా..

ఆదివారంనాడు తరలించినవారితో కలిపి భారతదేశం ఇప్పటిదాకా కాబూల్‌ నుంచి దాదాపు 590 మందిని ఇక్కడికి తీసుకొచ్చింది. మరికొంత మందిని సోమవారం తీసుకొచ్చే అవకాశం ఉందని.. ఇందుకోసం కాబూల్‌ ఎయిర్‌పోర్టులో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్దిమంది భారతీయ అధికారుల బృందం అమెరికా సేనలతో కలిసి, తరలింపు మిషన్‌ను సమన్వయం చేస్తోందని తెలుస్తోంది.  భారతీయ వీసాలున్నవారిపై కాబూల్‌లో నిఘా పెరిగింది. అక్కడున్న భారతీయుల సంఖ్యపై కచ్చితమైన అంచనాకు రావాలంటే.. అక్కడ శాఖలున్న కంపెనీలన్నీ తమ వద్ద పనిచేస్తున్న భారతీయుల వివరాలను ఆగస్టు 16న ఏర్పాటుచేసిన ప్రత్యేక విభాగానికి అందజేయాలని విదేశాంగ శాఖ సూచించింది. కాగా.. ఆ విభాగానికి ఇప్పటిదాకా సాయం కోరుతూ 2000 ఫోన్‌కాల్స్‌, 6000 వాట్సాప్‌ సందేశాలు వచ్చాయని సమాచారం. అలాగే.. 1200కు పైగా ఈమెయిల్స్‌కు ఆ విభాగం సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది.  కష్టకాలంలో అండగా నిలుస్తున్నందుకు భారతీయ స్నేహితులకు కృతజ్ఞతలు చెబుతున్నానని భారత్‌లో అఫ్ఘాన్‌ రాయబారి ఫరీద్‌ ట్వీట్‌ చేశారు.


Updated Date - 2021-08-23T11:36:35+05:30 IST