4 సంవత్సరాల్లో 39 మ్యాచ్‌లు..38 విజయాలు: ఆస్ట్రేలియా మహిళల జైత్రయాత్ర

ABN , First Publish Date - 2022-04-03T23:10:22+05:30 IST

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన ఆస్ట్రేలియా జట్టు మరో ప్రపంచకప్‌ను తన..

4 సంవత్సరాల్లో 39 మ్యాచ్‌లు..38 విజయాలు: ఆస్ట్రేలియా మహిళల జైత్రయాత్ర

క్రైస్ట్‌చర్చ్: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన ఆస్ట్రేలియా జట్టు మరో ప్రపంచకప్‌ను తన ఖాతాలో వేసుకుంది. మహిళా క్రికెట్‌లో బలమైన జట్టుగా పేరుగాంచిన ఆసీస్ ఖాతాలో ఏడో ప్రపంచకప్ వచ్చి చేరింది. ఈ ప్రపంచకప్‌ను కనుక ఆస్ట్రేలియా గెలుచుకుంటే ప్రపంచంలోనే అతిగొప్ప మహిళా జట్టుగా భావిస్తానని ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అన్నాడు.

 

మహిళా క్రికెట్‌లో ఆస్ట్రేలియా సాధిస్తున్న విజయాలు నాసిర్ హుస్సేన్ వ్యాఖ్యలను నిజం చేస్తున్నాయి. ఆస్ట్రేలియా జట్టు గత నాలుగేళ్లలో మొత్తం 39 మ్యాచ్‌లు ఆడితే కేవలం ఒక్కదాంట్లోనే ఓడి 38 మ్యాచుల్లో విజయం సాధించింది. గతేడాది భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా సాధిస్తున్న ఈ వరుస విజయాలు ఆ జట్టును అత్యుత్తమ స్థాయిలో నిలబెడుతున్నాయి. 


2017 ప్రపంచకప్ సెమీస్‌లో మెగ్ లానింగ్ సేన భారత జట్టుపై పరాజయం పాలైంది. ఆ తర్వాతి నుంచి ఆస్ట్రేలియా మళ్లీ ఎప్పుడూ పరాజయాల బాట పట్టలేదు. విజయమే లక్ష్యంగా వీరవిహారం చేస్తోంది. 2017 నుంచి ఆస్ట్రేలియా ఒక్క వన్డే సిరీస్‌లోనూ ఓడిపోలేదు. ఫలితంగా రికీ పాంటింగ్ జట్టు సాధించిన వన్డేల్లో అత్యధిక విజయాల రికార్డును బద్దలుగొట్టింది. 


వరుసగా 26 వన్డేలు గెలిచి రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా అమ్మాయిల జోరుకు గతేడాది భారత జట్టు బ్రేక్ వేసింది. ఆ ఓటమి తర్వాత కూడా ఆసీస్ వరుసగా 12 విజయాలు సాధించింది. ఇక, ఈ ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమన్నదే ఎరుగకుండా కప్‌ను ఎగరేసుకుపోయింది.


ఇప్పటి వరకు జరిగిన మొత్తం 12 ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియా ఏడింటిని సొంతం చేసుకుంది. 2018, 2020 టీ20 ప్రపంచకప్ టైటిళ్లను గెలుచుకున్న ఆ జట్టు తాజా వన్డే కప్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తలపడిన 9 గేముల్లోనూ విజయం సాధించడం విశేషం.

Updated Date - 2022-04-03T23:10:22+05:30 IST