ఒక్క రోజులో 3,780 మంది మృతి

ABN , First Publish Date - 2021-05-06T07:56:45+05:30 IST

కొత్త కేసులు తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నా.. దేశంలో కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం వైర్‌సతో 3,780 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఇవే అత్యధికం...

ఒక్క రోజులో 3,780 మంది మృతి

  • ఇప్పటివరకు దేశంలో ఇవే అత్యధికం..
  • కొత్తగా 3.82 లక్షల కేసులు నమోదు



న్యూఢిల్లీ, మే 5: కొత్త కేసులు తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నా.. దేశంలో కరోనా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం వైర్‌సతో 3,780 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఇవే అత్యధికం. 13 రాష్ట్రాల్లో వందకుపైగా మరణాలు నమోదయ్యాయి. మరోవైపు 3,82,315 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. క్రితం రోజుతో పోలిస్తే ఇవి 25 వేలు అధికం. 70 శాతం కేసులు ఆంధ్రప్రదేశ్‌ సహా పది రాష్ట్రాల్లో నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కర్ణాటక (44,600), కేరళ (37,190)లో కరోనా ఉధృతి మరింత పెరుగుతోంది. తాజా మరణాల్లో మహారాష్ట్రలోనే 891 నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌ (351) తర్వాతి స్థానంలో ఉంది. ఢిల్లీలో వరుసగా రెండో రోజు కేసులు 20 వేల దిగువనే ఉన్నాయి. మృతుల (338) సంఖ్య మాత్రం భారీగానే ఉంటోంది. వైరస్‌ విజృంభణ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలను కఠినం చేస్తున్నాయి. బుధవారం సీఎం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో కరోనా తీరుపై సమీక్షించారు. గురువారం నుంచి లోక్‌ల్‌ రైళ్ల సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మెట్రో రైళ్లు, బస్సులను 50 శాతం సామర్థ్యంతోనే నడపనున్నారు. విమానాలు, దూరప్రాంతాల నుంచి రైళ్లలో రాష్ట్రానికి వచ్చేవారికి కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో శుక్రవారం నుంచి పది రోజుల లాక్‌డౌన్‌ అమలు కానుంది. వారాంత లాక్‌డౌన్‌ను యూపీ ప్రభుత్వం ఈ నెల 10 వరకు పొడిగించింది. కర్ణాటక లో వైరస్‌ తీవ్రత నేపథ్యంలో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ పై ప్రభుత్వం ఆలోచిస్తోంది. విదేశాంగ మం త్రి జైశంకర్‌ ఆధ్వర్యంలో జీ-7 దేశాల సమావేశానికి లండన్‌ వెళ్లిన భారత ప్రతినిధి బృందంలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో జైశంకర్‌ ఐసోలేషన్‌కు వెళ్లారు. 


3 రోజుల్లో తెలంగాణకు 50 వేల టీకాలు

మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 2.65 లక్షల టీకాలు, తెలంగాణకు 50 టీకాలు కేటాయించనున్నట్లు కేంద్రం తెలిపింది. అన్ని రాష్ట్రాలకు 36 లక్షల వ్యాక్సిన్లు పంపిణీ చేస్తామని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 94 లక్షలపైగా టీకాలు ఉన్నట్లు తెలిపింది. 109 రోజుల్లో 16 కోట్లమందిపైగా టీకా ఇచ్చినట్లు పేర్కొంది. ఇందుకు అమెరికాకు 111 రోజులు, చైనాకు 116 రోజులు పట్టిందని తెలిపింది. కాగా, మంగళవారం 14.84 లక్షల టీకాలే పంపిణీ చేశారు. గతవారం ప్రపంచవ్యాప్తంగా 57 లక్షల కేసులు నమోదు కాగా వాటిలో 46 శాతం, 93 వేల మరణాలు సంభవించగా.. అందులో 25 శాతం భారత్‌లోనే నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.  




Updated Date - 2021-05-06T07:56:45+05:30 IST