అప్పుల ఉరి

ABN , First Publish Date - 2020-06-07T07:36:31+05:30 IST

బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేటకు చెందిన బీరం వెంకటరెడ్డికి నాలుగు ఎకరాల పొలం ఉంది.

అప్పుల ఉరి

ఐదు నెలల్లో 37 ఆత్మహత్యలు

లాక్‌డౌన్‌లో 17 మంది బలి

రైతు పట్ల పాలకుల నిర్లక్ష్యం

సేద్యానికి అందని చేయూత


కర్నూలు, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి):

బనగానపల్లె మండలం ఇల్లూరు కొత్తపేటకు చెందిన బీరం వెంకటరెడ్డికి నాలుగు ఎకరాల పొలం ఉంది. మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. శనగ, మిరప తదితర పంటలు సాగు చేశాడు. పెట్టుబడి కోసం రూ.20 లక్షల వరకు అప్పు చేశాడు. పంటలు సరిగా పండ లేదు. వచ్చిన కాస్త దిగుబడిని లాక్‌డౌన్‌ కారణంగా ఎవరూ కొనలేదు. అప్పుల వారి ఒత్తిళ్లు తీవ్రమయ్యాయి. జీవితంపై విరక్తి చెంది ఇంటి వద్దనే విషగుళికలు మింగాడు. ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. భార్య, ఇద్దరు కుమారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.


పత్తికొండకు చెందిన కురువ రాజశేఖర్‌(32) ఐదున్నర ఎకరాల్లో వ్యవసాయం చేసేవాడు. వర్షాభావ పరిస్థితుల కారణంగా సరైన దిగుబడులు రాలేదు. ఏటేటా సేద్యం ఖర్చులు పెరిగాయి. పెట్టుబడి అప్పులు రూ.8 లక్షలు దాటాయి. దిక్కు తోచని స్థితిలో ఇంటి పరిసరాల్లో విష గుళికలు మింగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు వదిలాడు. భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడి భవిష్యత్తు అంధకారంలో పడింది. వృద్ధాప్యంలో ఉన్న రాజశేఖర్‌ తల్లిదండ్రులు కుటుంబ బాధ్యతలను నెత్తికెత్తుకోవాల్సి వచ్చింది.


పత్తికొండ మండలం చందోలికి చెందిన కురువ వెంకటేశ్వర్లు (25)కు మూడు ఎకరాల పొలం ఉంది. వివిధ పంటలను సాగు చేసేవాడు. మూడేళ్లుగా దిగుబడి సరిగా రాలేదు. రూ.5 లక్షల మేర అప్పులు మిగిలాయి. రబీ సీజన్‌లో ఉల్లి సాగు చేశాడు. పంట కోసి పొలంలో ఆరబెట్టాడు. లాక్‌డౌన్‌ కారణంగా అమ్ముకునే వీలులేకుండా పోయింది. అప్పులవారి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. పొలానికి వెళ్లి అక్కడే ఉరివేసుకున్నాడు. 


ఆకలి తీర్చే అన్నదాత కడుపు నింపుకోలేక ఆవిరవుతున్నాడు. భుక్తి కోసం చేస్తున్న వ్యవసాయం ఏనాడూ కడుపు నిండా భోజనం పెట్టడం లేదు. పెట్టుబడులు పెరిగాయి. ప్రకృతి విపత్తులు వేధిస్తున్నాయి. ఇన్నీ దాటుకుని పంట పండించినా.. చివరగా మార్కెట్‌ మాయ కబలిస్తోంది. అప్పులు పెరిగి, ఆశలు కరిగి.. చివరకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. జిల్లాలో రైతు ఆత్మహత్యలు సర్వ సాధారణమైపోయాయు. ప్రాణాలు పోయాక ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారంలో వాటా కోసం దళారులు ఎగబడుతున్నారు. అన్నదాతను భుజం తట్టి ప్రోత్సహించే నాయకులే కరువయ్యారు. ఉమ్మడి, విభజిత రాష్ట్రంలో రాయలసీమ నాయకులే అధికంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తున్నారు. కానీ సొంత ప్రాంతంలో రైతు ఉసురు తీసుకుంటున్నా పట్టించుకోవడం లేదు.


ఈ ఏడాది ఆరంభం నుంచి కేవలం ఐదు నెలల్లో 37 మంది రైతులు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారు. లాక్‌డౌన్‌ ఉన్న మూడు నెలల్లో 17 మంది ఉసురు తీసుకున్నారు. రైతుకు చేరని మద్దతు ధరలు, సబ్సిడీల నిలిపివేత వంటి కారణాలు రైతులను మరింత దయనీయ స్థితిలోకి నెట్టేస్తున్నాయి. కరోనా కేసులు, మరణాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాగా శ్రద్ధ పెట్టాయి. కానీ కొన్నేళ్లుగా రైతులను వెంటాడుతున్న పురుగు మందు డబ్బాలు, ఉరితాళ్లు, విషపు గుళికల నుంచి మాత్రం కాపాడటం లేదు. 


అప్పుల సాగు

అప్పులు నాటి.. అప్పులు పండించి, వడ్డీతో సహా దిగుబడి సాధిస్తున్నట్లుగా తయారైంది జిల్లాలో వ్యవసాయం. సకాలంలో వర్షాలు కురవవు. బోర్లు ఇంకిపోతాయి. తెగుళ్లు వెంటాడుతాయి. గిట్టుబాటు ధర లభించదు. కానీ.. అప్పు మాత్రం అలా పెరిగిపోతూనే ఉంటుంది. ఏటా రైతుల్ని బలి తీసుకుంటూనే ఉంటుంది. పంట కొనుగోలు, గిట్టుబాటు ధర కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. లాక్‌డౌన్‌ సమయంలో ఉల్లి, పత్తి, మొక్కజొన్న, టమోటా రైతులు 17 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీటిని ధ్రువీకరిస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పుల పాలవుతున్న రైతులకు ప్రభుత్వమే అండగా నిలవాలి. మద్దతు ధరను తప్పకుండా అమలు చేయాలి. కానీ అలసత్వం ప్రదర్శిస్తోంది. కేంద్రం ప్రకటించే మద్దతు ధర నాలుగో వంతు దిగుబడికి మాత్రమే అందుతోంది. కొనుగోలు కేంద్రాల్లో ఆంక్షల పేరిట అలసత్వం రాజ్యమేలుతోంది. 


ఎప్పుడు ఇస్తారు..?

ఉల్లి, మొక్కజొన్న, కందులు, పప్పు శనగ తదితర పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. ఈ పంటలు అమ్మిన రైతులకు రూ.61 కోట్లు రావాల్సి ఉంది. దాదాపు 15 నెలల నుంచి చెల్లించలేదు. టీడీపీ హయాంలో ఉల్లి రైతులకు మార్కెట్‌ ధరపై రూ.200 నుంచి రూ.400 అదనంగా ఇచ్చారు. దీనికి సంబంధించి 2019 ఫిబ్రవరి నుంచి డిసెంబరు వరకు రూ.7 కోట్లు బాకీ ఉంది. ఇప్పటికీ ప్రభుత్వం విడుదల చేయలేదు. పప్పు శనగ, మొక్కజొన్న, కందులు తదితర పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.56 కోట్లు (మద్దతు ధర సొమ్ము) కూడా నేటికీ విడుదల కాలేదు. పంట దిగుబడులను వ్యాపారులకు అమ్మితే 10-15 రోజుల్లో డబ్బు చెల్లిస్తారు. కానీ ప్రభుత్వానికి అమ్మితే ఏళ్ల తరబడి సొమ్ము రావడం లేదు. 


లాక్‌డౌన్‌లో ఆత్మహత్యలు


ప్రాంతం సంఖ్య

గూడూరు 1

పత్తికొండ 1

బనగానపల్లె 2

బండి ఆత్మకూరు 1

పెద్ద కడుబూరు 1

చాగలమర్రి 1

బేతంచెర్ల 2

మహానంది 3

రుద్రవరం 1

ఓర్వకల్లు 1

మద్దికెర 1

నందికొట్కూరు 1

ఆలూరు 1

Updated Date - 2020-06-07T07:36:31+05:30 IST