కరోనా.. మృత్యు కేక!

ABN , First Publish Date - 2020-07-14T07:40:46+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ మృత్యు కేక పెడుతోంది. రోజురోజుకీ అనేక ప్రాణాలు బలి తీసుకుంటోంది. గతంలో రాష్ట్రంలో ఒకటి రెండు

కరోనా.. మృత్యు కేక!

  • 37 మరణాలు.. 1935 కేసులు
  • ఒక్కరోజులో ఇదే అత్యధికం
  • 30 వేలు దాటేసిన పాజిటివ్‌లు
  • మొత్తం మృతులు 365
  • రాష్ట్రాన్ని వణికిస్తున్న వైరస్‌
  • చోద్యం చూస్తున్న క్రిటికల్‌ కేర్‌ కమిటీ
  • డీఎంఈ అధికారుల్లోనూ తీవ్ర నిర్లక్ష్యం

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో కరోనా వైరస్‌ మృత్యు కేక పెడుతోంది. రోజురోజుకీ అనేక ప్రాణాలు బలి తీసుకుంటోంది. గతంలో రాష్ట్రంలో ఒకటి రెండు మరణాలే నమోదు కాగా.. ఇప్పుడు కేసుల తీవ్రతతోపాటు మరణాలు కూడా ఎక్కువయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 37 మంది మృత్యువాత పడ్డారు. కరోనా విధ్వంసం మొదలయ్యాక ఒక్కరోజులో ఇంతమంది చనిపోవడం ఇదే తొలిసారి. మరణాల నివారణలో ఆరోగ్యశాఖ పూర్తిగా విఫలమవుతోంది. సీరియస్‌ కేసులు హాస్పిటల్‌కు వచ్చిన గంటల వ్యవధిలో మృత్యువాత పడుతున్నారు. క్రిటికల్‌ కేర్‌ కమిటీలు, డెత్‌ ఆడిట్‌ కమిటీలు పేపర్లకే పరిమితం అవుతున్నాయి. ఉన్నతాధికారులు కూడా వీడియో కాన్ఫరెన్సుల పేరుతో కాలయాపన చేస్తున్నారు. సీరియస్‌ కేసులకు ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స జరుగుతుందా..? లేదా..? అనే విషయాన్ని పట్టించుకోవడం లేదు.


అధికారుల నిర్లక్ష్యం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఆదివారం 19 మంది మృతి చెందితేనే అమ్మో అనుకున్నాం. కానీ ఇప్పుడా రికార్డును బ్రేక్‌ చేస్తూ ఏకంగా 37 మంది మరణించారు. భవిష్యత్తులో ఇలాంటి రికార్డులు ఎన్నో చూడాల్సి వస్తుందన్న ఆందోళన ఆరోగ్యశాఖలోనూ ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 365కి చేరింది. వారిలో కర్నూలు జిల్లాల్లోనే అత్యధికంగా 105 మంది ఉన్నారు. ఆ తర్వాత కృష్ణా జిల్లాల్లో 83 మంది ఉన్నారు. సోమవారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ కరోనా మరణాలు నమోదయ్యాయి.


డీఎంఈలో నిర్లక్ష్యం..

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఉన్న డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) అధికారులకు కరోనా మరణాల నివారణ బాధ్యతలు అప్పగించారు. ఒక వైపు రాష్ట్రంలో కరోనాతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతున్నా... వారు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.  కరోనా మరణాల నివారణకు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ నెల 2న కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. కరోనా రిపోర్టుతో సంబంధం లేకుండా చెస్ట్‌ ఎక్స్‌రే, చెస్ట్‌ సిటీ స్కాన్‌లో అనుమానం ఉంటే వెంటనే కొవిడ్‌ ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని, ఈ మేరకు అన్ని ఆస్పత్రులకు సర్క్యులర్‌ ఇవ్వాలని సూచించారు. రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఈ ఆదేశాలు క్షేత్రస్థాయికి చేరలేదు. ఈ రెండు వారాల వ్యవధిలో వందల మంది మృత్యువాత పడ్డారు. ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేస్తున్నారో..? లేదో పట్టించుకోవడం లేదు.

Updated Date - 2020-07-14T07:40:46+05:30 IST