Abn logo
Aug 5 2021 @ 16:26PM

హెచ్‌పీసీఎల్ నికరలాభంలో... 36 శాతం క్షీణత

ముంబై : ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థ... హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) జూన్‌ త్రైమాసికంలో... నికరలాభం 36 శాతం క్షీణతతో రూ. 2,183.83 కోట్ల నుంచి రూ. 1,795 కోట్లకు పడిపోయింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ నికరలాభం రూ. 3,017.96 కోట్లు. ఇక... టర్నోవర్‌ విషయానికి వస్తే 68 శాతం వృద్ధితో రూ. 77,586 కోట్లుగా నమోదు కావడం గమనార్హం. జూన్‌ త్రైమాసికంలో డిమాండ్‌ తక్కువగా ఉన్నప్పటికీ ధరలు భారీగా పెరగడంతో తమ టర్నోవర్‌ కూడా భారీగా పెరిగిందని కంపెనీ ప్రకటించింది. కంపెనీకి చెందిన ముంబై రిఫైనరీని జూన్ త్రైమాసికంలో 45 రోజుల పాటు మూసివేసి ఉంచడంతో తమ లాభాలు భారీగా తగ్గాయని హెచ్‌పీసీఎల్ సీఎండీ ముఖేష్‌ కుమార్‌ వెల్లడించారు. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


కంపెనీ యూనిట్‌లో విస్తరణ, సామర్థ్య పెంపు కోసం 45 రోజల పాటు మూసివేసి ఉంచారు. మొత్తంమీద... నిరుత్సాహకరంగా ఉన్న ఆర్థిక ఫలితాల ప్రకటనతో ఈ రోజు... హెచ్‌పీసీఎల్‌ భారీ కరెక్షన్‌కు లోనవుతోంది. ఇంట్రాడేలో షేర్‌ దాదాపు 4 శాతం నష్టపోయి, డే కనిష్ట స్థాయి రూ. 262.50 కు పడిపోయింది. ప్రస్తుతం దాదాపు 3 శాతం నష్టంతో రూ. 264.95 వద్ద కదలాడుతోంది. ఈ రోజు... ఇప్పటివరకు ఎన్‌ఎస్‌ఈలో 27 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ రూ. 37,584 కోట్లకు పడిపోయింది.