లక్షా 36 వేల ఉద్యోగాలు ఇచ్చాం

ABN , First Publish Date - 2021-02-28T08:17:02+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్షా 36 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, అవి లెక్కలతో సహా ఉన్నాయని ఆ పార్టీ సెక్రటరీ జనరల్‌, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తెలిపారు.

లక్షా 36 వేల ఉద్యోగాలు ఇచ్చాం

  • తప్పని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా: కేకే
  • వాణీదేవి గెలుపే పీవీకి ఇచ్చే నిజమైన నివాళి: గంగుల
  • కిషన్‌రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారు?: తలసాని

రాంగోపాల్‌పేట్‌/నాచారం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్షా 36 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, అవి లెక్కలతో సహా ఉన్నాయని ఆ పార్టీ సెక్రటరీ జనరల్‌, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తెలిపారు. ఇవ్వలేదని ప్రతిపక్షాలు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకొంటానని అన్నారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం సికింద్రాబాద్‌లోని జొరాస్టియన్‌ క్లబ్‌లో సనత్‌నగర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేకే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏయే శాఖలో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేసిందో ప్రభుత్వం పక్కా లెక్కలతో తెలిపిందని, ఎవరికైనా అనుమానాలుంటే సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. ప్రధానిగా దివంగత పీవీ నరసింహారావు భారతదేశ గౌరవాన్ని ప్రపంచదేశాలకు చాటి చెప్పారని, పీవీ కుమార్తె వాణీదేవిని ఎమ్మెల్సీగా గెలిపించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. కాగా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గడచిన రెండేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. ఉద్యోగాలు, ప్రమోషన్లు రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఇస్తుందని, కేంద్ర ప్రభుత్వం కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. ఆరేళ్లుగా ఎమ్మెల్సీగా ఉన్న రాంచందర్‌రావు శాసనమండలిలో ఏనాడూ ఉద్యోగాల గురించి ప్రశ్నించలేదని, ఇప్పుడు ఓట్లు అడిగే అర్హత లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


వాణీదేవిని గెలిపించాలి

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవి మంచి విద్యావేత్త అని, ఎంతో మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎమ్మెల్సీగా ఆమెను గెలిపించాలని కోరారు. శనివారం మల్లాపూర్‌లోని వీఎన్‌ఆర్‌ గార్డెన్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 

Updated Date - 2021-02-28T08:17:02+05:30 IST