హైదరాబాద్‌లో రూ.35కే కిలో ఉల్లిగడ్డ

ABN , First Publish Date - 2020-10-24T16:07:31+05:30 IST

ఉల్లి ధర ఘాటెక్కిస్తోంది. రూ.40 నుంచి మొదలైన ఉల్లి ధర పెంపు రెండు నెలల వ్యవధిలోనే

హైదరాబాద్‌లో రూ.35కే కిలో ఉల్లిగడ్డ

హైదరాబాద్ : ఉల్లి ధర ఘాటెక్కిస్తోంది. రూ.40 నుంచి మొదలైన ఉల్లి ధర పెంపు రెండు నెలల వ్యవధిలోనే రూ.100కు చేరింది. రైతుబజార్లలో కిలో రూ.75కు విక్రయిస్తుండగా, బయటి మార్కెట్లో మాత్రం వంద రూపాయలు పలుకుతోంది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు కర్నూలులోని పంట మొత్తం నాశనమైపోయింది. ఈ తరుణంలో రైతు బజార్లలో తక్కువ రేట్లకే అమ్మేలా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఏపీలో తక్కువ రేటుకే ఉల్లిపాయలు విక్రయిస్తున్నారు.


తాజాగా.. హైదరాబాద్‌లోని రైతు బజార్లలో రూ.35 కే కిలో ఉల్లిగడ్డలు విక్రయించనున్నారు. ఉల్లిధరల నియంత్రణ కోసం మార్కెటింగ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. జంట నగరాల్లోని 11 రైతుబజార్లలో ఇది అందుబాటులోకి రానుంది. ప్రతి వ్యక్తికి రెండు కిలోల చొప్పున విక్రయిస్తారు. ఏదైనా గుర్తింపుకార్డు చూపించడం తప్పనిసరి చేశారు. భారీ వర్షాలకు దేశవ్యాప్తంగా ఉల్లిపంట దెబ్బతిన్నది. ఎలాంటి లాభం లేకుండా రవాణా ఖర్చులు, దెబ్బతిన్న సరుకును దృష్టిలో ఉంచుకుని అమ్మకాలు జరపాలని మార్కెటింగ్ అధికారులను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.

Updated Date - 2020-10-24T16:07:31+05:30 IST