35 లక్షల అక్రమాలు

ABN , First Publish Date - 2022-06-26T07:50:03+05:30 IST

35 లక్షల అక్రమాలు

35 లక్షల అక్రమాలు

వెబ్‌ల్యాండ్‌లో అడ్డగోలుగా రికార్డుల మార్పు 

ప్రైవేటు వ్యక్తుల పేరిట ప్రభుత్వ భూములు

అసైన్డ్‌ భూముల హక్కుదారుల పేర్లు మార్పు

పట్టా భూములూ ఒకరివి మరొకరికి..

నోటీసులు కూడా ఇవ్వకుండా బదలాయింపు

హక్కుదారులకు తెలియకుండా సవరణలు

రెవెన్యూ అధికారులు డిజిటల్‌ కీ దుర్వినియోగం

కావాల్సిన వారి పేరిట వేలాది ఎకరాల మార్పు


విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు.. ఖరీదైన పేదల అసైన్డ్‌ భూములు పలుకుబడి వ్యక్తులు సూచించిన వారికి.. ప్రైవేటు వ్యక్తుల భూములు కూడా ఒకరి పేరిట ఉన్నవి మరొకరికి.. ఇలా వెబ్‌ల్యాండ్‌లో అధికారులు అడ్డుగోలుగా రికార్డులు మార్చేశారు. గత నాలుగేళ్లలో వందలు, వేలు కాదు.. ఏకంగా 35 లక్షల అక్రమాలు చోటు చేసుకున్నాయి. రెవెన్యూ శాఖ స్వీయ పరిశీలనలో ఈ విషయం తేలింది. అసైన్డ్‌ భూమి హక్కుదారులు, ప్రైవేటు భూ యజమానులు తమ భూములు తమ పేరిటే ఉన్నాయా? లేక రికార్డులు మార్చేశారా? అన్నది వెంటనే వెబ్‌ల్యాండ్‌లో సరిచూసుకోవాలని అధికారులు చెబుతున్నారు. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ భూములకు కాపాలాదారుగా వ్యవహరించాల్సిన రెవెన్యూ అధికారులే వాటిని ప్రైవేటు పరం చేశారు. వేలాది ఎకరాల భూముల స్వభావాన్ని మార్చేశారు. ప్రైవేటు వ్యక్తులకు అనుగుణంగా భూమి రికార్డులను చీకట్లో మార్చేశారు. అలాగే అసైన్డ్‌ భూముల హక్కుదార్ల పేర్లను రికార్డుల్లో ఇష్టానుసారం మార్చేశారు. ప్రైవేటు వ్యక్తుల భూముల్లోనూ అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారు. ఒకరి పేరు మీదున్న భూమిని నోటీసులు ఇవ్వకుండానే మరొకరి పేరిట రికార్డుల్లో మార్పులు, చేర్పులు చేసేశారు. వెబ్‌ల్యాండ్‌ను గూడుపుఠాణి కేంద్ర ంగా మార్చేసి భూ మంతర్‌ నడిపారు. ఇవేవో గిట్టనివారు చెబుతున్నవి.. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కావు. రెవెన్యూ శాఖ స్వీయ పరిశీలనలో తేలిన విషయాలు. భూ రికార్డుల స్వచ్ఛీకరణ తర్వాత జరిగిన బాగోతం ఇది. వీటిపై రెవెన్యూ శాఖ విస్తుపోతోంది. ఇటీవలి కాలంలో వెబ్‌ల్యాండ్‌లో భూముల రికార్డుల సవరణలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, అసైన్డ్‌ భూములతో పాటు ప్రైవేటు పట్టా భూముల రికార్డులను పలువురు తహసీల్దార్లు ఇష్టానుసారంగా మార్చేస్తున్నారని ఇటీవల సర్కారుకు ఫిర్యాదులు వచ్చాయి. ఉమ్మడి ప్రకాశం, కర్నూలు, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు, అనంతపురం తదితర జిల్లాల్లో పలువురు తహసీల్దార్లు డిజిటల్‌ కీలను దుర్వినియోగం చేస్తూ రైౖతులకు నోటీసులు ఇవ్వకుండానే రికార్డులు మార్చారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై రెవెన్యూ శాఖ విచారణ జరిపింది. వెబ్‌ల్యాండ్‌లో జరుగుతున్న రికార్డు సవరణలపై సాంకేతిక అధ్యయనం చేసింది. గడిచిన నాలుగేళ్ల కాలంలో వెబ్‌ల్యాండ్‌లో రికార్డుల కరెక్షన్స్‌ మాడ్యూల్స్‌ (సవరించిన రికార్డుల జాబితా) చరిత్రను తెప్పించుకుంది. ఐటీ , రెవెన్యూ నిపుణులు, అధికారులు దానిపై అధ్యయనం చేశారు. ఏ రకమైన భూముల్లో ఏ తరహా సవరణలు చేశారు? సవరణలకు గురైన వాటిల్లో ప్రభుత్వ భూములు ఎన్ని? ఎవరి పేరిట ఎన్నిసార్లు రికార్డు మార్చారు? ఆ భూముల విస్తీర్ణం ఎంత? అసైన్డ్‌ భూముల్లో జరిగిన సవరణలు, ప్రైవేటు భూముల రికార్డుల్లో చేపట్టిన సవరణలు, వాటి లింకులు, ఏ సమయంలో ఎక్కువగా రికార్డు సవరణలు జరిగాయి? వంటి అంశాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా వెలికి తీశారు. 


1.70 కోట్ల రికార్డుల్లో 35 లక్షల అక్రమాలు

గడిచిన నాలుగేళ్ల కాలంలో వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో జరిగిన సవరణలను లెక్క తేల్చారు. కోటి 70 లక్షల రికార్డులను డిజిటల్‌ కీల సాయంతో మార్పులు చేశారు. ఇవన్నీ తహ సీల్దార్ల లాగిన్‌లో జరిగాయి. ఇందులో 35 లక్షల మేర అక్రమాలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. రైతుల ప్రమేయం లేకుండా, వారికి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, ఏకపక్షంగా సవరణలు చేసినట్టు గుర్తించారు. ఇందులో 20 లక్షల వరకు ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల రికార్డులు మార్చేసినట్లు గుర్తించారు. 15 లక్షల మేర ప్రైవేటు భూముల రికార్డులు సవరణలు చేసినట్లు తేల్చారు. ఇందులో వారసత్వంగా వచ్చిన భూముల వివరాలు కూడా ఉన్నట్లు తెలిసింది. నిజమైన భౌతిక రికార్డులతో వెబ్‌ల్యాండ్‌ రికార్డులను సరిపోల్చితే ఈ సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుందని అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి. 


లీగల్‌ కేసులు.. 

జగన్‌ సర్కారు కొలువుతీరిన కొత్తలో భూ రికార్డుల స్వచ్ఛీకరణ (పీఓఎల్‌ఆర్‌) చేపట్టింది. గ్రామాల వారీగా భౌతిక, డిజిటల్‌ రికార్డులను తనిఖీ చేసినప్పుడు 31 లక్షల ఎకరాల్లో భూమి విస్తీర్ణం, స్వభావం సరిపోలలేదు. ఇప్పటికీ ఆ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పుడు వెబ్‌ల్యాండ్‌లో జరిగిన సవరణల్లో 35 లక్షల కేసుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. అయితే, ఈ అక్రమాలకు సంబంధించిన భూ విస్తీర్ణం ఎంతన్నది అధికారులు గుట్టుగా ఉంచారు. నేషనల్‌ ఇన్‌ఫార్మాటిక్‌ సంస్థ (ఎన్‌ఐసీ) ప్రతినిధులతో ఈ అంశంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రీ సర్వే జరుగుతున్నందున సవరించిన భూముల వివరాలను పరిశీలించి, వాటిని పూర్వస్థితికి తీసుకొచ్చే అంశాన్ని పరిశీస్తున్నట్లు తెలిసింది. ప్రైవేటు ఖాతాలో వేసిన ప్రభుత్వ, అసైన్డ్‌ భూములను తిరిగి పూర్వస్థితికి తీసుకొస్తున్నారని, జిరాయితీ భూముల విషయంలో ఇది సాధ్యం కావడం లేదని తెలిసింది. ఇప్పటికే లీగల్‌గా అనేక కేసులు దాఖలయ్యాయని అధికార వర్గాలు గుర్తించాయి. 


రైతన్నలారా జాగ్రత్త.. 

రాష్ట్రంలో ఉమ్మడి 9 జిల్లాల పరిధిలో విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పేరిట మార్చినట్టు తేలింది. సర్వే నెంబర్ల వారీగా ప్రభుత్వ భూములను గుర్తించారు. అసైన్డ్‌ భూముల విషయంలోనూ ఇదే తరహాలో గోల్‌మాల్‌కు పాల్పడ్డారని తేలింది. ఉదాహరణకు రామయ్య అనే రైతు పేరిట చాలా విలువైన ప్రాంతంలో మూడు ఎకరాల అసైన్డ్‌ భూమి ఉంది. నేతలు, పెద్దలు సూచించిన వ్యక్తుల పేరిట ఆ భూమి రికార్డులను అధికారులు మార్చేశారు. కానీ ఈ విషయం హక్కుదారుకు తెలియదు. ఇప్పటికీ ఆ భూమి తన పేరిటే ఉందని భావిస్తున్నారు. ఇలాంటి అక్రమాలు 9 జిల్లాల పరిధిలో చాలా జరిగాయని తాజా పరిశీలనలో తేలింది. ఈ నేపఽథ్యంలో పట్టణ, నగర ప్రాంతాలు, మండల కేంద్రాలు, భూముల ధరలు ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో అసైన్డ్‌ భూములున్న రైతులు తక్షణమే తమ భూమి రికార్డులను ఆన్‌లైన్‌లో పరిశీలన చేసుకోవాలని అధికారులే సూచిస్తున్నారు. ‘‘అసైన్డ్‌ భూమి కేటాయింపు సమయంలో ఇచ్చిన రికార్డు ప్రకారమే వెబ్‌ల్యాండ్‌లో వివరాలు ఉన్నాయా? రైతు పేరు, విస్తీర్ణం, ఫోన్‌ నెంబర్‌, ఆధార్‌ నెంబర్లు సరిగా ఉన్నాయా? లేక రైతు పేరు మార్చేశారా? అన్నవి తమ వద్ద ఉన్న వివరాల ఆధారంగా వెబ్‌ల్యాండ్‌లో సరిచూసుకోవాలి. తేడాలుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలి’’ అని రెవెన్యూ అధికారి ఒకరు సూచించారు. పట్టా భూములున్న రైతులు కూడా తమ భూములు తమ పేరిటే ఉన్నాయా? లేక రికార్డును మార్చారా అన్నది వెంటనే వెబ్‌ల్యాండ్‌లో పరిశీలన చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. 


స్పందించని అధికారులు

వెబ్‌ల్యాండ్‌ అడ్డాగా కొందరు రెవెన్యూ అధికారులు చేసిన ఘరానా మోసాలను ధ్రువీకరించుకునేందుకు ‘ఆంధ్రజ్యోతి’ రెవెన్యూ శాఖను సంప్రదించింది. భూ రికార్డుల స్వచ్ఛీకరణ, వెబ్‌ల్యాండ్‌పై పరిశీలన నడుస్తోందని మాత్రమే బదులిచ్చారు. రికార్డుల సవరణల్లోని అక్రమాలపై స్పందించేందుకు వారు నిరాకరించారు. ఇదే అంశంపై  రెవెన్యూ శాఖ బాస్‌ సీసీఎల్‌ఏను సంప్రదించేందుకు ప్రయత్నంగా చేయగా అయన అందుబాటులోకి రాలేదు. 

Updated Date - 2022-06-26T07:50:03+05:30 IST