స్పందనకు 342 అర్జీలు

ABN , First Publish Date - 2021-10-26T07:43:09+05:30 IST

మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో డివిజన్‌ నలుమూలల నుంచి వెల్లువలా అర్జీదారులు వచ్చి వినతులు అందజేశారు.

స్పందనకు 342 అర్జీలు

మదనపల్లె టౌన్‌, అక్టోబరు 25: మదనపల్లె  సబ్‌కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన  స్పందన కార్యక్రమంలో డివిజన్‌ నలుమూలల నుంచి వెల్లువలా అర్జీదారులు వచ్చి వినతులు అందజేశారు.కలెక్టర్‌ హరినారాయణన్‌, జేసీ(హౌసింగ్‌) వెంకటేశ్వర్‌, సబ్‌కలెక్టర్‌ జాహ్నవి అర్జీలు స్వీకరించి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.31 మండలాల నుంచి 342 మందికి పైగా అర్జీదారులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఎక్కువగా మండలస్థాయి స్పందనలో తమ అర్జీలు పరిష్కారం కాలేదని కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. సబ్‌కలెక్టరేట్‌లో మూడు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి స్పందన అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. పింఛన్ల దరఖాస్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌లో డీఆర్‌డీఏ పీడీ తులసి స్వీకరించారు. డీఎంహెచ్‌వో శ్రీహరి, డీసీహెచ్‌ఎస్‌ సరళమ్మ, సర్వే ఏడీ జయరాజ్‌, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ భార్గవి తదితరులు పాల్గొన్నారు.

-50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 30 ఎకరాల ప్రభుత్వ భూమికి గతంలో కరణంగా పనిచేసిన ప్రసాద్‌, ఆయన కుటుంబ సభ్యులు డీకేటీ పట్టా పొందారని చౌడేపల్లె మండలం తెల్లనీళ్లపల్లెకు చెందిన దళితులు  ఫిర్యాదు చేశారు. 

- దారి సౌకర్యం కల్పించాలని మదనపల్లె మండలం కోటవారుపల్లె తాండాలో  నివసిస్తున్న గిరిజన కుటుంబాలు విన్నవించారు.

ఫ పెద్దపంజాణి మండలం శ్రీరామాపురంలో జనావాసాల మధ్య సెల్‌టవర్‌ నిర్మిస్తున్నారని, దీనిపై ఇదివరకే స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశామని గ్రామస్తులు తెలిపారు. కానీ సర్పంచు భర్త, మామ కలసి సెల్‌టవర్‌ నిర్మాణానికి అనధికారికంగా అనుమతులు ఇచ్చారన్నారు. మండలస్థాయి అధికారులు  సెల్‌టవర్‌ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారన్నారు.

ఫ తమిళనాడు రాష్ట్రం మధురై నుంచి 60 ఏళ్ల క్రితం  500కుటుంబాలు వలస వచ్చి చిత్తూరు జిల్లాలో స్థిరపడ్డామని, తమకు కుల ధ్రువీకరణపత్రం ఇవ్వడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఏపీ పిరమలై కల్లర్‌ తేవర్‌ సంక్షేమ సంఘం సభ్యులు పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు డీ నోటిఫైడ్‌ ట్రైబ్స్‌ కింద కుల ధ్రువీకరణపత్రం మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు.

- 2019 సాధారణ ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గానికి సంబంధించి తాము సీసీ కెమెరాలు, షామియానాలు, కుర్చీలు సమకూర్చామని,అయితే ఇంతవరకు తమకు బిల్లులు మంజూరు చేయలేదని కె.దివాకర్‌, ఎం.శ్రీనివాస్‌ వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై రూ.16.50లక్షల బిల్లులకు పూచికత్తుగా అప్పటి ఎన్నికల డీటీ హరిప్రసాద్‌ తమకు చెక్కులు కూడా ఇచ్చారన్నారు. రెండున్నరేళ్లు అవుతున్నా బిల్లులు మంజూరు చేయలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

- మదనపల్లె పట్టణం బీకేపల్లె కాలనీ సర్వేనెం.531/2లో ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది తప్పుడు పత్రాలతో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని వినతిపత్రం అందజేశారు.

ఫ 16 ఏళ్లుగా కడుపులో పెరుగుతున్న కణితి తన ప్రాణం తీస్తోందని, ఆర్థికంగా చితికిపోయిన తనకు ప్రభుత్వం మందులు, వైద్య చికిత్సలు అందించాలని మదనపల్లె పట్టణం వడ్డిపల్లెకు చెందిన సుభాషిణి కలెక్టర్‌ను వేడుకున్నారు.

ఫ గుడుపల్లెలో ఏపీఐఐసీకి ఇచ్చిన భూములకు ఇంతవరకు పరిహారం అందించలేదని యజమానులు  విన్నవించారు.

- మదనపల్లె డివిజన్‌లో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ మానిటరింగ్‌ సమావేశాలు నిర్వహించడం లేదని బాస్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఫిర్యాదు చేశారు. 



Updated Date - 2021-10-26T07:43:09+05:30 IST