సలహాల రాజ్యం!

ABN , First Publish Date - 2020-07-11T07:37:30+05:30 IST

ఇదో సలహాల రాజ్యం! వైపీసీ అధికారంలోకి వచ్చాక 13 నెలల్లో డజన్ల కొద్దీ సలహాదారుల నియామక జీవోలు వచ్చాయి. ఇప్పటికి 33 మంది సలహాదారులను నియమించారు. అందులోనూ...

సలహాల రాజ్యం!

  • 13 నెలల్లో 33 మంది సలహాదారులు
  • ఉండడానికి చాంబర్లూ లేవు
  • ఏం సలహాలిస్తున్నారో తెలియదు
  • కొందరికి ఎవరికి సలహాలివ్వాలో తెలీదు
  • సీఎంను ఒక్కసారీ కలవనివారూ ఉన్నారు

‘ముఖ్యమంత్రి జగన్‌కు ఎవరైనా సలహాలు ఇస్తున్నారా? ఇస్తున్నా... ఆయన వినడం లేదా’ ...ఇదీ పలు సందర్భాల్లో రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేసిన సందేహం! అంతెందుకు... ‘ప్రభుత్వానికి సరైన న్యాయ సలహాలు ఇస్తున్నట్లు లేదు’ అని మొన్నటికి మొన్న హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. అసలు విషయమేమిటంటే... జగన్‌ సర్కారులో కేబినెట్‌ మంత్రులకు మించిన సంఖ్యలో, కేబినెట్‌ ర్యాంకు ఉన్న సలహాదారులు ఉన్నారు. దాదాపు ప్రతి శాఖకూ ఒక సలహాదారు! కొన్ని అంశాలపై కేటగిరీల వారీగా సలహాదారులు! వీరిచ్చేవి ‘ఉచిత’ సలహాలు కాదు! లక్షలకు లక్షలు జీతాలు, భత్యాలూ అందుకుంటున్నారు. కానీ... వీరేం పని చేస్తున్నారు, ఎక్కడి నుంచి పని చేస్తున్నారు,  ఎలాంటి సలహాలు ఇస్తున్నారనేది మాత్రం రహస్యం! 



(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఇదో సలహాల రాజ్యం! వైపీసీ అధికారంలోకి వచ్చాక 13 నెలల్లో డజన్ల కొద్దీ సలహాదారుల నియామక జీవోలు వచ్చాయి. ఇప్పటికి 33 మంది సలహాదారులను నియమించారు. అందులోనూ... పది మందికి ఏకంగా కేబినెట్‌ హోదా ఇచ్చారు. వారికి ప్రతి నెలా లక్షల్లో జీతాలు అందుతున్నాయి. ఇదంతా బహిరంగమే. కానీ, ఆ సలహాదారులు చేస్తున్న పనేమిటి అనేది, వారు అసలు సలహాలు ఇస్తున్నారా లేదా, అసలు సలహాలు ఇచ్చే పరిస్థితులు  ఉన్నాయా అనేది ప్రశ్నార్థకం! 


ఉన్న ఆ ఇద్దరికీ... 

మొత్తం 33 మంది సలహాదారుల్లో కొందరు బాధ్యతలు కూడా స్వీకరించ లేదు. స్వీకరించిన వారిలో ఇద్దరు ముగ్గురికి తప్ప మిగిలిన వారికి కనీసం చాంబర్లు కూడా లేవు. సలహాదారులుగా నియమితులై అత్యున్నత హోదాలో ఉన్న రిటైర్డ్‌ ఐఏఎ్‌సలు అజేయ కల్లం, పీవీ రమేశ్‌! వారికి సీఎంవోలోనే చాంబర్లు ఉన్నాయి. అయితే, వారి వద్ద ఉన్న శాఖలన్నింటినీ ఇప్పుడు తొలగించారు. అంటే, వారికి ‘సలహాదారు’ పదవులున్నాయి. పని చేయడానికి చాంబర్లూ ఉన్నాయి. కానీ... శాఖలు మాత్రం లేవు. ఏం పని చేయాలని అంశం పై స్పష్టత లేదు. అజేయకల్లం, పీవీ రమేశ్‌ తదితరులకు ‘సలహాదారులు’గా నియమించినప్పుడు... ‘‘నమ్మిన వారికి జగన్‌  అన్యా యం చేయరు’’ అంటూ భారీ ప్రచారం జరిగింది. ఇప్పుడు... వారి సబ్జెక్టులన్నీ తొలగించి ‘నామ్‌కే  వాస్తే’ చేయడంతో ‘జగన్‌కు నమ్మకస్తులు అంటూ ఎవరూ ఉండరు! అనవసరం అనిపిస్తే వదిలించుకోవడమే’ అనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు ఉన్నతస్థాయి సలహాదారుల భవితవ్యంపై ఇంకా స్పష్టత రాలేదు.  వారికి కొత్త బాధ్యతలు ఏమైనా అప్పగిస్తారా, వారి స్థానంలో సీఎంవోలోకి ఇంకా ఎవరినైనా తీసుకొస్తారా అనేది ఇంకా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు.


మిగిలినవారి మాటేమిటో

అజేయ కల్లం, పీవీ రమేశ్‌ దాదాపు అన్ని కీలక సమీక్ష సమావేశాల్లో పాల్గొంటూ వచ్చా రు. అంటే, క్రియాశీలకంగా పని చేసినట్లే. మిగిలిన సలహాదారులు ఇప్పటి వరకు ఏమైనా సలహాలు ఇచ్చారా, అవి రాష్ట్ర ప్రగతికి దోహదపడ్డాయా అనేది ఎవ్వరికీ తెలియదు. ఒకరిద్దరు సలహాదారులకు తాము ఎందుకు ఉన్నామో కూడా తెలియడంలేదు. ‘‘ప్రభుత్వంతో మంచి ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నాం. కానీ, ఎవరికి సలహాలు ఇవ్వాలో తెలియడం లేదు’’ అని చెబుతున్నారు. మరో చిత్రమేమిటంటే... కొందరు సలహాదారులు తాము బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా సీఎంను ఒక్కసారీ కలవలేదు. కలిసేందుకు వారు చేసి న ప్రయత్నాలూ ఫలించలేదు. విదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులుగా పలువురు నియమితులయ్యారు.


వారిలో కొందరు రాష్ట్రానికి చేస్తున్న సేవ ఏమిటో తెలియదుకానీ... వారి ప్రయాణ ఖర్చుల బిల్లులు భారీగా ప్రభుత్వానికి సమర్పిస్తున్నారు. ఆయా శాఖలకు మంత్రులు, అనుభవజ్ఞులైన ఐఏఎ్‌సలు కార్యదర్శులుగా ఉన్నా... ప్రత్యేకంగా సలహాదారులను నియమించారు. మరో విచిత్రమేమిటంటే... మీడియాకు రాష్ట్రానికి ఒక సలహాదారు, జాతీయ స్థాయిలో ఒక సలహాదారును నియమించారు. పరిశ్రమలు, పెట్టుబడులకూ పలువురు సలహాదారులు! దీంతో... పలువురికి కేవలం పునరావాస కల్పన కోసమే సలహా పదవులు కట్టబెట్టారనే విమర్శలూ వస్తున్నాయి.


Updated Date - 2020-07-11T07:37:30+05:30 IST