Abn logo
Aug 4 2021 @ 00:18AM

3,200 లీటర్ల సారా ఊట ధ్వంసం

సారా ఊటను ధ్వంసం చేసిన పోలీసులు

తంబళ్లపల్లె, ఆగస్టు 3:  మండలంలోని కోటకొండ తాండాలో సారా స్థావరాలపై దాడులు నిర్వహించి 3,200 లీటర్ల ఊటను ధ్వంసం చేసినట్లు ములకలచెరువు ఎస్‌ఈబీ సీఐ మల్లిక తెలిపారు. కోటకొండ తాండా పరిసరాల్లో పెద్ద ఎత్తున సారా తయారు చేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు మంగళవారం ఎస్‌ఈబీ ఏఈయస్‌ రాధాకృష్ణ ఆధ్వర్యంలో డీటీఎఫ్‌ సీఐ వెంకట లక్ష్మి, తంబళ్లపల్లె ఎస్‌ఐ సహదేవి, ఎస్‌ఈబీ ఎస్‌ఐ నారాయణస్వామి సిబ్బందితో కలసి సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డ్రమ్ములు, బిందెల్లో నిల్వ ఉంచిన సారా ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. 

కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్టు


మదనపల్లె టౌన్‌: కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని చీకిలబైలు చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఈబీ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం అనంతపురం జిల్లా తనకల్లుకు చెందిన నరసింహులు కర్ణాటక నుంచి అక్రమంగా రూ.10 వేల విలువైన 98 టెట్రా ప్యాకెట్ల మద్యం తరలిస్తుండగా ఎస్‌ఈబీ చెక్‌పోస్టు సీఐ మోహన్‌ నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడ్డాడు. దీంతో మద్యాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని రిమాండుకు పంపినట్లు సీఐ చెప్పారు.

ములకలచెరువు: మండలంలోని బురకాయలకోట సమీపంలో మంగళవారం దాడులు నిర్వహించి కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనంతో చేసుకోవడంతో పాటు నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఈబీ సీఐ మల్లిక, ఎస్‌ఐ నారాయణస్వామి తెలిపారు. గ్రామం సమీపంలో కర్ణాటక మద్యం విక్రయిస్తున్నారని సమాచారం అందడంతో దాడి చేసి నిందితుడు గోపాల్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. 98 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.