ల్యాప్‌టాప్‌కు 32% మొగ్గు

ABN , First Publish Date - 2021-05-06T05:15:31+05:30 IST

‘అమ్మఒడి’ పథకంలో నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌ తీసుకునేందుకు జిల్లాలో మూడింట ఒక వంతు మాత్రమే ఆసక్తి చూపారు

ల్యాప్‌టాప్‌కు 32% మొగ్గు

నగదు కావాలన్న మిగిలినవారు 

‘అమ్మఒడి’పై ముగిసిన అభిప్రాయ సేకరణ 


విశాఖపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి): ‘అమ్మఒడి’ పథకంలో నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌ తీసుకునేందుకు జిల్లాలో మూడింట ఒక వంతు మాత్రమే ఆసక్తి చూపారు. వచ్చే విద్యా సంవత్సరం అమ్మఒడి కింద విద్యార్థుల అభీష్టానికి అనుగుణంగా నగదు లేదా ల్యాప్‌టాప్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలోని 5,446 పాఠశాలల్లో ఈ ఏడాది 7, 8, 9 (వచ్చే ఏడాది 8,9,10) తరగతులు చదువుతున్న 1,96,171 మంది విద్యార్థులు/వారి తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. వీరిలో 63,861 మంది ల్యాప్‌టాప్‌లు కావాలని ఆప్షన్‌ ఇవ్వగా, మరో 1,18,076 మంది గతంలో మాదిరిగా నగదు కావాలంటూ కోరారు. మరో 14,234 మంది  ఈ పథకానికి అర్హత సాధించలేదు.  కాగా, ప్రస్తుతం అన్ని ఫీచర్స్‌ వున్న సెల్‌ఫోన్‌ కావాలంటే 15 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. అటువంటిది 15 వేల రూపాయలకు ల్యాప్‌టాప్‌ వస్తుందంటే ఎంతవరకు పనిచేస్తుందనే సందేహం విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా కలిగింది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో కేవలం 63,861 మంది విద్యార్థులు మాత్రమే ల్యాప్‌టాప్‌కు ఆప్షన్‌ ఇచ్చారు. తక్కువ సొమ్ముతో కొనుగోలు చేసే ల్యాప్‌టాప్‌లు ఎలా పనిచేస్తాయన్నది వాటిని చూస్తే గానీ చెప్పలేమని నర్సీపట్నం ప్రాంతానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు అభిప్రాయం వ్యక్తంచేశారు.  


Updated Date - 2021-05-06T05:15:31+05:30 IST