Abn logo
Sep 20 2021 @ 20:26PM

హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకున్న కొన్ని రోజులకే మృతి

అహ్మదాబాద్: హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకున్న కొన్ని రోజులకే వ్యక్తి మృతి చెందిన సంఘటన విస్‌నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే  ఆయన మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతదేహనికి ఫోరెన్సిక్ పరీక్ష చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం..‘‘ అరవింద్ చౌదరి వయసు 31 ఏళ్లు. విస్‌నగర్ తాలుకాలోని ఖడోసన్ గ్రామంలో నివసిస్తున్నారు. ఆయన స్థానికంగా ఒక గ్రంథాలయాన్ని నడుపుతున్నారు. చౌదరి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్  ఆపరేషన్‌ను జైల్ రోడ్డులో ఉన్న క్లినిక్‌లో సెప్టెంబరు 15న సాయంత్రం 4గంటలకు చేయించుకున్నారు. ఆ రోజు రాత్రి 10గంటల వరకు క్లినిక్‌లోనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం ఆ రోజున బాగానే ఉంది. ఇంటికి వెళ్లే ముందు కొంత ఆహారం కూడా తీసుకున్నారు. సెప్టెంబరు 17వ తేదీన ఉదయం వచ్చి తనకు ఆరోగ్యం బాగా లేదని వైద్యులకు చెప్పారు. అనంతరం వారు పరీక్షలు చేయగా తనను ఆసుపత్రిలో చేర్చుకోవాలని కోరారు. ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటంతో వైద్యులు అత్యవసర విభాగానికి తరలించారు. అనంతరం సెప్టెంబరు 18న ఉదయం 7.30 గంటలకు తుది శ్వాస విడిచారు ’’ అని తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మ‌ృతదేహాన్ని సివిల్ ఆసుపత్రికి తరలిస్తున్నామని వివరించారు. మృతికి కారణం తెలుసుకునేందుకు శరీర అవయవ నమూనాలను ల్యాబోరేటరీకీ పంపిస్తున్నామన్నారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన వైద్యుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.