31 మందికి ‘ఒమైక్రాన్‌’ పరీక్షలు

ABN , First Publish Date - 2021-12-20T13:32:23+05:30 IST

రాష్ట్రంలో ఇప్పటివరకూ విదేశాల నుంచి విమానాల్లో వచ్చినవారిలో 31 మందికి కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ సోకిన లక్షణాలు ఉన్నట్టు గుర్తించి వారి రక్తపు నమూనాలను ప్రయోగశాలలకు పంపినట్టు

31 మందికి ‘ఒమైక్రాన్‌’ పరీక్షలు

                     - నేడు ఫలితాల వెల్లడి


చెన్నై: రాష్ట్రంలో ఇప్పటివరకూ విదేశాల నుంచి విమానాల్లో  వచ్చినవారిలో 31 మందికి కొత్త రూపు సంతరించుకున్న కరోనా వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ సోకిన లక్షణాలు ఉన్నట్టు గుర్తించి వారి రక్తపు నమూనాలను ప్రయోగశాలలకు పంపినట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం తెలిపారు. చెన్నైలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విదేశాల నుంచి విమానాల్లో వచ్చినవారిలో ఒకరికి మాత్రమే ‘ఒమైక్రాన్‌’ సోకినట్టు ప్రయోగశాల ఫలితాల ద్వారా నిర్ధారణ అయ్యిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 31 మందికి సంబంధించిన ఫలితాలు బెంగళూరు, హైదరాబాద్‌ ప్రయోగశాలల నుంచి వెల్లడి కావాల్సివుందన్నారు. ఈ ఫలితాలు సోమవారం వెల్లడించే అవకాశాలు ఉన్నాయని, ఆ ఫలితాలను బట్టి ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న వారికి తదుపరి చికిత్సలందించనున్నామని ఆయన వివరించారు. రాష్ట్రంలో సడలించిన కరోనా నిరోధక నిబంధనల్లో కొన్నింటిని మళ్ళీ అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కొన్ని కఠినతరమైన కరోనా వ్యాప్తి నిరోధక నిబంధనలు అమలు చేస్తామని, ఈ విషయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కొత్త వైరస్‌ ‘ఒమైక్రాన్‌’ గురించి ప్రజలు అనవసరంగా భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం పేర్కొన్నట్టు ముఖాలకు మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, రోజూ చేతులను శానిటైజర్లతో శుభ్రం చేయడం వంటి నియమాలను పాటిస్తే చాలునని, అదే సమయంలో రెండో డోసుల కరోనా నిరోధక టీకాలు కూడా వేసుకోవాలన్నారు. కొత్త వైరస్‌ వ్యాప్తి తీవ్రత గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి వివరాలను వెల్లడించలేదని, ఇదే విధంగా ఐసీఎంఆర్‌ కూడా ఈ వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని మాత్రమే హెచ్చరించిందన్నారు.

Updated Date - 2021-12-20T13:32:23+05:30 IST