Hijab controversy: హిజాబ్ మాకొద్దంటూ రోడ్డెక్కిన మహిళలు.. కట్టలు తెంచుకున్న కోపం.. తుపాకీ తూటాలకు 31 మంది బలి!

ABN , First Publish Date - 2022-09-23T20:46:48+05:30 IST

హిజాబ్‌ విషయమై మహిళల నిరసనలతో ఇరాన్‌ అట్టుడుకుతోంది. నిరసనకారులను అణచివేసేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వేర్వేరుచోట్ల భద్రతా దళాల తూటాలకు 31 మంది ప్రాణాలు కోల్పోయారు.

Hijab controversy: హిజాబ్ మాకొద్దంటూ రోడ్డెక్కిన మహిళలు.. కట్టలు తెంచుకున్న కోపం.. తుపాకీ తూటాలకు 31 మంది బలి!

నిరసనకారులపై భద్రతా దళాల ఉక్కుపాదం

హిజాబ్‌ నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్‌

ఇంటర్‌నెట్‌ బంద్‌.. వేల మంది అరెస్ట్‌

టెహ్రాన్‌, సెప్టెంబరు 22: హిజాబ్‌ విషయమై మహిళల నిరసనలతో ఇరాన్‌ అట్టుడుకుతోంది. నిరసనకారులను అణచివేసేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వేర్వేరుచోట్ల భద్రతా దళాల తూటాలకు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో నిరసనకారుల ఆగ్రహం కట్టలు తెగి పలుచోట్ల పోలీస్‌ స్టేషన్లను తగులబెట్టారు. నిరసనల వీడియోలు వైరల్‌ అవుతుండటంతో ఇంటర్‌నెట్‌ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ వినియోగంపై ఆంక్షలు విధించింది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, టెలిగ్రామ్‌, యూట్యూబ్‌పై గతేడాది నుంచే నిషేధం అమలులో ఉంది. హిజాబ్‌ సక్రమంగా ధరించలేదంటూ గత వారం మహ్సా అమిని (22) అనే యువతి మొరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకుని హింసించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో భగ్గుమన్న నిరసనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. ‘హిజాబ్‌ మాకొద్దు... స్వేచ్ఛా, సమానత్వం కావాలి’ అని నినదిస్తూ మహిళలు పెద్ద సంఖ్యలో నిరసన ర్యాలీలు చేస్తున్నారు.


జుట్టు కత్తిరించుకుంటూ, స్కార్ఫ్‌లు తగులబెడుతూ చేస్తున్న ఆందోళనల వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. నిరసనలు 30 నగరాలకు వ్యాపించాయి. పోలీసులు పెద్దసంఖ్యలో నిరసనకారులను అరెస్టు చేశారని మీడియా పేర్కొంది. ఇక, ఐక్యరాజ్య సమితి సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మాట్లాడుతూ ఇరాన్‌లో హక్కుల కోసం పోరాడుతున్న మహిళల వెంట నిలబడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 

Updated Date - 2022-09-23T20:46:48+05:30 IST