Iran Amini protests: 31 మంది నిరసనకారులను చంపేసిన ఇరాన్ బలగాలు

ABN , First Publish Date - 2022-09-23T03:20:49+05:30 IST

టెహ్రాన్‌: హిజాబ్‌ నిబంధనలను పాటించడం లేదనే కారణంతో మహ్సా అమినిని పొట్టన పెట్టుకున్నందుకు ఆందోళనలు చేస్తున్నవారిలో

Iran Amini protests: 31 మంది నిరసనకారులను చంపేసిన ఇరాన్ బలగాలు

టెహ్రాన్‌: హిజాబ్‌ నిబంధనలను పాటించడం లేదనే కారణంతో మహ్సా అమినిని పొట్టన పెట్టుకున్నందుకు ఆందోళనలు చేస్తున్నవారిలో 31 మందిని ఇరాన్‌ బలగాలు చంపేశాయి. మొత్తం ఆరు రోజుల్లో 31 మందిని చంపేశారని ఓస్లోలోని ఇరాన్ హ్యూమన్ రైట్స్ సంస్థ డైరక్టర్ మొహ్మద్ మొఘద్దామ్ ప్రకటించారు. ఒక్క ఉత్తర మజంద్రాన్ ప్రావిన్స్‌లోనే 11 మందిని పొట్టనపెట్టుకోగా, అదే ప్రావిన్స్‌లోని బబోల్ ప్రాంతంలో మరో ఆరుగురిని చంపేశారు. కుర్దిస్థాన్ ప్రావిన్స్‌లో 15మంది నిరసనకారులను ఇరాన్ బలగాలు చంపేశాయి. 


మహ్సా అమిని హత్యకు నిరసనగా తొలుత కుర్దిస్థాన్ నుంచి మొదలైన ఆందోళనలు ఇరాన్ అంతటా వ్యాపించాయి. 30 నగరాలు, పట్టణ ప్రాంతాలకు నిరసనలు పాకాయి. ఆందోళనలతో ఇరాన్ హోరెత్తుతోంది. వారం రోజులుగా యువతులు, మహిళల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిరసన చేస్తున్న మహిళలు జుత్తు కత్తిరించుకుంటూ వీడియోలు పెడుతూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లోకి వచ్చి హిజాబ్‌లు తీసేసి.. దహనం చేస్తూ.. నినాదాలు చేస్తున్నారు. 


కుర్దు యువతి అయిన అమినితో పాటు మరికొందరిని గత వారం మొరాలిటీ పోలీసులు రాజధాని టెహ్రాన్‌లో అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో ఆరోగ్యంగానే ఉన్న అమిని.. తర్వాతి రోజు కోమాలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయింది. కస్టడీలో ఉండగా అమిని అస్వస్థతకు గురైందని పోలీసులు చెబుతుండగా.. తన కుమార్తెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని అమిని తండ్రి చెప్పారు. ఆమె కాళ్లపై తీవ్ర గాయాలు ఉన్నాయని.. దీనికి పోలీసుల దాడే కారణమని ఆయన ఆరోపించారు. అమిని మృతికి నిరసన వ్యక్తం చేస్తూ.. ‘‘మహ్సా అమిని’’ హ్యాష్‌ట్యాగ్‌తో పర్షియన్‌ భాషలో చేసిన ట్వీట్లు లక్షలు దాటాయి. 


అమిని సొంత రీజియన్‌ కావడంతో కుర్దిస్థాన్‌లో ఆందోళనలు మరింత తీవ్రంగా ఉన్నాయి. దీని రాజధాని సనందజ్‌లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ఈ రీజియన్‌లో పెద్దఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. కాగా.. టెహ్రాన్‌ నుంచి నిరసనలు రష్త్‌, మషాద్‌, ఇస్ఫహాన్‌ నగరాలకూ వ్యాపించాయి. అమిని మృతి మానవ హక్కులకు జరిగిన ఘోరమైన అవమానంగా అమెరికా అభివర్ణించింది. ఫ్రాన్స్‌ కూడా ఈ ఘటనను ఖండించింది. అమిని ఉదంతం.. ఇరాన్‌ ప్రభుత్వం.. ఆ దేశంలోని మైనారిటీలైన కుర్దులకు మధ్య మరోసారి ఉద్రిక్తతలకు కారణమయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు. 


Updated Date - 2022-09-23T03:20:49+05:30 IST