సీబీఎస్ఈ ఫలితాలకు 30:30:40 ఫార్ములా

ABN , First Publish Date - 2021-06-17T08:23:57+05:30 IST

పన్నెండో తరగతి ఫలితాలను సీబీఎ్‌సఈ ఏ విధంగా ప్రకటిస్తుందో? అని అటు విద్యార్థులు.. ఇటు తల్లిదండ్రులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న తరుణంలో.

సీబీఎస్ఈ ఫలితాలకు 30:30:40 ఫార్ములా

  • నేడు సుప్రీం ముందుకు నివేదిక
  • సీబీఎస్ఈకి, ఇంటర్‌ బోర్డుకు ఎంత తేడా!
  • అక్కడ మూడేళ్ల ప్రతిభ ఆధారంగా మార్కులు
  • రాష్ట్రంలో ఫస్టియర్‌ మార్కులే ప్రామాణికం
  • చాలా మంది విద్యార్థులు నష్టపోయే ప్రమాదం


హైదరాబాద్‌, ముంబై, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): పన్నెండో తరగతి ఫలితాలను సీబీఎ్‌సఈ ఏ విధంగా ప్రకటిస్తుందో? అని అటు విద్యార్థులు.. ఇటు తల్లిదండ్రులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న తరుణంలో.. సుప్రీంకోర్టు ముందుకు ఓ ఫార్ములాకు సంబంధించిన నివేదిక గురువారం వెళ్లనుందని చెబుతున్నారు. 10, 11 తరగతుల్లో మార్కులు, 12వ తరగతిలో ఇంటర్నల్స్‌ మార్కుల ఆధారంగా వార్షిక ఫలితాలను సీబీఎ్‌సఈ ప్రకటించే అవకాశం ఉంది. 13 మంది సభ్యుల కమిటీ 30:30:40 ఫార్ములాకు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.. 10, 11 తరగతుల్లోని మార్కులకు 30ు చొప్పున.. 2020-21లో నిర్వహించిన 12వ తరగతి ఇంటర్నల్‌ పరీక్షలకు 40% వెయిటేజీ ఇచ్చి ఫలితాలను నిర్ణయిస్తారు. ఫార్ములా నివేదికను సుప్రీంకోర్టుకు కమిటీ సమర్పిస్తుందని.. తర్వాత నిర్ణయం ప్రకటిస్తుందని సమాచారం.


మన రాష్ట్రంలో... 

పరీక్షలు రద్దయితే విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించడానికి.. సీబీఎ్‌సఈ నియమించిన 13 మంది సీనియర్‌ అధికారుల బృందం సూచించిన 30-30-40 సూత్రం సరైన ప్రత్యామ్నాయ విధానంగా తోస్తోందని విద్యావేత్తలు అంటున్నారు. మార్కుల కేటాయింపు విషయంలో సీబీఎస్‌ విధానం విద్యార్థి విద్యా సామర్థ్యాన్ని చాలావరకు అంచనా వేసే దిశగా ఉండగా.. రాష్ట్రంలో మాత్రం ఏదో నామమాత్రంగా ముగించేలా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం మార్కుల ఆధారంగా సెకండియర్‌ మార్కులు కేటాయించాలని రాష్ట్రంలో దీనిపై కమిటీ ఈ నెల 15న ప్రభుత్వానికి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన గత ఏడాది తక్కువ మార్కులు వచ్చిన వారికి ఈసారి కూడా తక్కువ మార్కులు కేటాయిస్తారు. 


ఈ విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫస్టియర్‌ వార్షిక పరీక్షలను చాలామంది విద్యార్థులు తేలికగా తీసుకుంటారు. ఇలా తక్కువ మార్కులు వచ్చిన వారికి గత ఏడాది అడ్వాన్స్డ్‌ సప్లమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు రాసేందుకూ అవకాశం ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఆ మార్కులనే ప్రామాణికంగా తీసుకుని కీలకమైన సెకండియర్‌ మార్కులను కేటాయించడం సరికాదని విద్యావేత్తలూ పేర్కొంటున్నారు. దీనివల్ల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు. సీబీఎ్‌సఈ అవలంబించిన విధానాన్ని ప్రభుత్వం పరిశీలించాలని  కోరుతున్నారు. ఇక్కడ సెకండియర్‌లో ఇంటర్నల్‌ పరీక్షలు జరగనందున.. పదోతరగతి, ఫస్టియర్‌లో 50-50శాతం మార్కులను లెక్కించి ప్రకటిస్తే విద్యార్థి విద్యా సామర్థ్యాన్ని చాలావరకూ సరిగ్గా గుర్తించే అవకాశం ఉంటుందని వారు సూచిస్తున్నారు.

Updated Date - 2021-06-17T08:23:57+05:30 IST