వారంలో 300 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2022-01-12T06:20:55+05:30 IST

ఉమ్మడి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వారం రోజుల్లో 300 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

వారంలో 300 పాజిటివ్‌ కేసులు
తిరుమలగిరి మండలం బండ్లపల్లి గ్రామంలో సర్వే చేస్తున్న వైద్య బృందం

అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ

ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లకు మెడికల్‌ కిట్లు అందజేత


నల్లగొండ, నార్కట్‌పల్లి : ఉమ్మడి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వారం రోజుల్లో 300 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 8వ తేదీన 51 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 9న ఆదివారం కావడంతో టెస్టులు చేయలేదు. సూర్యాపేట జిల్లాలో మాత్రం నాలుగు కేసులు నమోదయ్యాయి. 10న ఉమ్మడి జిల్లాలో 65కేసులు, మంగళవారం 118 కేసులు నమోదయ్యాయి.


ఉమ్మడి జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం సంక్రాంతి పండుగ ఉండగా, కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో నిర్ధారణ పరీక్షల సంఖ్య పెం చాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లకు ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు, పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్స నిమిత్తం వెంటనే అందజేసేందుకు మెడికల్‌ కిట్లు ఇచ్చారు. వీరంతా గ్రామాల్లో పర్యటించి టెస్టులు చేసి లక్షణాలు ఉన్నవారికి మెడికల్‌ కిట్టు అందజేయనున్నారు. అదేవిధంగా ఈ నెల 26వ తేదీ వరకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తిచేయాలని, బూస్టర్‌ డోస్‌ సైతం 12వ తేదీ లోగా పూర్తిచేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. గత ఏడాది జనవరిలో రెండో దశ కరోనా ప్రారంభంకాగా, ఆ నెలాఖరుకు కేసుల సంఖ్య అధికమైంది. ఈ ఏడాది సైతం జనవరి రెండవ వా రంలో కరోనా కేసులు పెరుగుతండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.కాగా, అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని,వ్యాక్సిన్‌ తీసుకోవాలని,శానిటైజ్‌ చేసుకోవాలని, అప్పు డే కరోనానుంచి రక్షణ పొందవచ్చని డీఎంహెచ్‌వో కొండల్‌రావు తెలిపారు.


మంత్రి జగదీ్‌షరెడ్డికి కరోనా

విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయన వ్యక్తిగత సిబ్బంది మంగళవారం అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో హోంఐసోలేషన్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలిసిన వారు, సన్నిహితంగా మెలిగిన వారు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని మంత్రి ఓ ప్రకటనలో కోరారు.


కామినేనిలో కరోనా అంటూ మంత్రి కేటీఆర్‌కు యువకుడి ట్వీట్‌

నార్కట్‌పల్లి కామినేని వైద్య కళాశాలలో కరోనా కలకలం సృష్టిస్తోందని, దీన్ని యాజమాన్యం పట్టించుకోకుండా తరగతులు నిర్వహిస్తోందని ఓ వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశాడు. ఇక్కడి మెడికల్‌ కళాశాలలో 90మంది విద్యార్థులకు కరోనా సోకిందనీ, హాస్టల్‌లో ఉంటున్న 12మందికి పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌ వచ్చినా యాజమాన్యం స్పందించడం లేదని దూబగుంట రోహిత్‌ కిరీటీ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు మంగళవారం ట్వీట్‌ చేశాడు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కళాశాలలో కరోనా కేసులు లేవనీ, తప్పుడు ట్వీట్‌ చేసిన వ్యక్తిపై పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు యాజమాన్యం తెలిపింది.


వలిగొండలో ఇద్దరికి, మునగాలలో ఒకరికి పాజిటివ్‌

వలిగొండ, మునగాల: వలిగొండ మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో మంగళవారం 75 మందికి ర్యాపిడ్‌ టెస్ట్‌ నిర్వహించగా, ఇద్దరికి పాజిటివ్‌గా వచ్చినట్టు మండల వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌ కల్యాణ్‌ తెలిపారు. మునగాల మండల కేంద్రంలో ఓ బ్యాంక్‌లో పనిచేసే ఉద్యోగికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో మంగళవారం బ్యాంక్‌ను మూసివేశారు.


తిరుమలగిరిలో సీరో సర్వే

తిరుమలగిరి, తిరుమలగిరి రూరల్‌: ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ టీం తిరుమలగిరి మునిసిపాలిటీ ఐదో వార్డులో, మండలంలోని బండ్లపల్లి గ్రామంలో సీరో సర్వే నిర్వహించింది. ఈ సర్వేను సూర్యాపేట డీఎంహెచ్‌వో కోటాచలం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల్లో కొవిడ్‌ యాంటీబాడీస్‌ ఎంతవరకు వృద్ధి చెందాయో ఈ సర్వేతో తెలుస్తుందన్నారు. ఈ సర్వేను డాక్టర్‌ ఉష, డా. శశికుమార్‌ బృందం నిర్వహించింది. కార్యక్రమంలో డాక్టర్‌ ప్రశాంత్‌బాబు, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పోతరాజు రజనిరాజశేఖర్‌, వైస్‌చైర్మన్‌ సంకెపల్లి రఘునందన్‌రెడ్డి, ఎంపీపీ నెమురుగొమ్మల స్నేహలత, పీఏసీఎస్‌ చైర్మన్‌ పాలెపు చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.


అర్హులు బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలి : డీఎంహెచ్‌వో

భువనగిరి టౌన్‌: అర్హులంతా కొవిడ్‌ బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలని యాదాద్రి డీఎంహెచ్‌వో జి.సాంబశివరావు, డీసీపీ కె.నారాయణరెడ్డి అన్నారు. భువనగిరిలో పోలీసుల కు బూస్టర్‌ డోస్‌ శిబిరాన్ని వారు మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. హెల్త్‌ కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ బూస్టర్‌ డోస్‌ తీసుకుంటేనే విధుల్లో నిర్భయంగా పాల్గొనవచ్చన్నా రు. పోలీసుల కట్టడి చర్యలతోనే కరోనా నియంత్రణ సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో ఏసీపీలు ఏ.శ్రీనివాసరావు, ఎస్‌.వెంకట్‌రెడ్డి, సీఐలు సుధాకర్‌, జానయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-01-12T06:20:55+05:30 IST