కరోనా పంజా!

ABN , First Publish Date - 2020-06-07T06:18:22+05:30 IST

కరోనా మహమ్మారి జిల్లాను వణికిస్తోంది. జిల్లావ్యాప్తంగా 32 మండలాల్లో తన ప్రభావం చూపుతోంది.

కరోనా పంజా!

  • 300 దాటిన పాజిటివ్‌ కేసులు
  • ఒక్క రోజు 22 కేసుల నమోదు
  • వైరస్‌ తీవ్రతతో మహిళ మృతి


నెల్లూరు(వైద్యం) జూన్‌ 6 : కరోనా మహమ్మారి జిల్లాను వణికిస్తోంది.  జిల్లావ్యాప్తంగా 32 మండలాల్లో తన ప్రభావం చూపుతోంది. శనివారం ఒక్కరోజే 22 కేసులు నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 300 దాటేసింది.  మార్చి 9వ తేదీన జిల్లాలో మొదటి కరోనా వెలుగులోకి రాగా,  ఏప్రిల్‌ 14వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 56 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. మే  9వ తేదీ నాటికి జిల్లాలో 100 కేసులు నమోదయ్యాయి. అక్కడ నుంచి కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. 21వ తేదీ నాటికి 201 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదే తీవ్రతలో జూన్‌ 6వ తేదీ నాటికి 15 రోజుల వ్యవధిలో 300లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో 36 మంది 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 58 మంది 20 ఏళ్లలోపు వారు ఉన్నారు. 9 నెలల చిన్నారి కూడా కరోనాకు గురై కోలకుంది. 138 మంది 21 నుంచి 40 ఏళ్ల వారు, 41 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వారు 79 మంది ఉన్నారు. లాక్‌డైన్‌ సడలింపు కారణంగా కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. విచ్చలవిడిగా రోడ్డుపైకి జనం రావటం, కరోనా భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో పరిస్థితి అదుపు తప్పుతోందన్న భావన అందరిలో నెలకొంది. కాగా, ఇప్పటివరకు 317 మంది కరోనా పాజిటివ్‌కు గురవగా,  218 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 94 మంది ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.


22 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

శనివారం ఒక్కరోజే జిల్లాలో 22 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నెల్లూరులోని దర్గామిట్టలో మృతి చెందిన మహిళకు కరోనా నిర్ధారణ కాగా, మాగుంట లేఅవుట్‌లో ఒకటి, తడ మండలం రామాపురంలో 3, సూళ్లూరుపేటలోని వనంతోపు, కోళ్లమిట్టలో 3, ఇదే మండలంలోని దామా నెల్లూరులో ఒకటి, పొదలకూరు మండలం దేవాంగుల వీధిలో ఒకటి, చేజర్ల మండలం నూతక్కివారి కండ్రిగలో ఒకటి, కావలిలోని రామ్మూర్తినగర్‌లో ఒకటి, ఆత్మకూరులో ఒకటి, వింజమూరులో 2, సంగం 4, దగదర్తి 2, జలదంకి మండలం సోమవరప్పాడులో ఒక పాజిటివ్‌ కేసు నమోదయ్యింది.


ఐదుకు చేరిన మృతుల సంఖ్య

కరోనా ప్రభావంతో నెల్లూరు నగరంలో ఓ మహిళ (51) శనివారం సాయంత్రం మృత్యువాత పడింది. ఈ నెల 2వ తేదీన గుండె సొప్పితో  ఓ ఆసుపత్రిలో చేరిన ఆమెకు కరోనా లక్షణాలు ఉండటంతో ఈ నెల 4వ తేదీన స్వాబ్‌ తీసి జీజీహెచ్‌లోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. శనివారం తెల్లవారు జామున ఆమెకు పాజిటివ్‌ రావడంతో వెంటనే ఆమెను  జిల్లా కోవిడ్‌ ఆసుపత్రి నారాయణకు తరలించారు. ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలు సాయంత్రం 4.30 గంటలకు చనిపోయింది.  దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. 

Updated Date - 2020-06-07T06:18:22+05:30 IST