సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘అన్నామలై’ (Annaamalai) విడుదలై సోమవారానికి 30 యేళ్ళు పూర్తయ్యాయి. దీంతో ఈ చిత్ర దర్శకుడు సురేష్ కృష్ణ (Suresh Krissna) సోమవారం హీరో రజనీకాంత్‌ను పోయెస్ గార్డెన్‌లోని ఆయన నివాసంలో కలుసుకుని, అభినందనలు తెలిపారు. రజనీ సరసన ఖుష్బూ (Khushbu) నటించగా, ఇతర పాత్రల్లో శరత్‌బాబు (Sarathbabu), రాధారవి, జనకరాజ్, నిళల్గల్ రవి, రేఖ, వైష్ణవి తదితరులు నటించారు. దేవా (Deva) సంగీతం సమకూర్చారు. ముందు అనుకున్నదాని ప్రకారమైతే, ఈ చిత్రానికి వసంత్ దర్శకత్వం వహించాల్సి ఉంది.
కానీ, పలు కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో సురేష్ కృష్ణకు ఆ అవకాశం దక్కింది. రజనీ - సురేష్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఇది తొలి చిత్రం కావడం విశేషం. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో ‘వీరా’, ‘బాషా’ వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. 25 వారాల పాటు దిగ్విజయంగా ప్రదర్శితమై సిల్వర్ జూబ్లీ వేడుకలను ‘అన్నామలై’ జరుపుకుంది. రజనీ నటించిన ‘బాషా’ విడుదలయ్యేంత వరకు ‘అన్నామలై’ ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ, రజనీ అభిమానులు అత్యధికంగా ఇష్టపడే చిత్రం ఇదే. ఒకానొక సందర్భంలో రజనీ నటించిన చిత్రాల్లో రీమేక్ చేయదలిస్తే ‘అన్నామలై’ను రీమేక్ చేసి హీరోగా నటిస్తానని ఇళయదళపతి విజయ్ చెప్పడం గమనార్హం.
ఇక ఇదే సినిమాను తెలుగులో ‘కొండపల్లి రాజా’ అనే పేరుతో రీమేక్ చేశారు. విక్టరీ వెంకటేష్, నగ్మా, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం తెలుగు రీమేక్ మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోకోలేకపోయింది. కాగా, ప్రస్తుతం సూపర్‌స్టార్ ‘జైలర్’ సినిమాను చేస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. రజనీ 169వ సినిమా ఇది.