30 ఇయర్స్‌ ఇండస్ట్రీ

ABN , First Publish Date - 2022-07-02T06:06:54+05:30 IST

30 ఇయర్స్‌ ఇండస్ట్రీ

30 ఇయర్స్‌ ఇండస్ట్రీ

విజయవాడ-చెన్నై పినాకినీ ఎక్స్‌ప్రెస్‌కు 30 ఏళ్లు

ఉమ్మడి కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల ప్రయాణికులకు ఎంతో కీలకం

ఇప్పటికీ తగ్గని ఆదరణ

ఫ్యాన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఘనంగా బర్త్‌ డే


30 ఏళ్ల అలుపెరగని ప్రయాణం.. రోజుకు 430 కిలోమీటర్లు.. లెక్కలేనంత మంది అభిమానులు.. ఏకంగా ఫ్యాన్స్‌ అసోసియేషన్‌.. ఓ రైలుకు ఇంత ఫాలోయింగ్‌ ఉండటం మాటలే కాదు. అది ఒక్క పినాకిని సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ సొంతం చేసుకుంది. 30వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఘనంగా వేడుకలు జరుపుకొంది.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పినాకిని ఎక్స్‌ప్రెస్‌  30 ఏళ్లుగా ఆంధ్ర, తమిళనాడు రాష్ర్టాల ప్రయాణికులకు విశేష సేవలందిస్తోంది. విజయవాడ-చెన్నై రూటులో (నెంబరు 12711/12712) సూపర్‌ఫాస్ట్‌గా నడుస్తోంది. చెన్నై మార్గంలో ప్రారంభించిన మొట్టమొదటి ఇంటర్‌ సిటీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇది. సురక్షిత ప్రయాణానికి మారుపేరు. దీనికి పినాకిని అని పేరు రావటానికి ప్రత్యేక కారణం ఉంది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ర్టాల మీదుగా ప్రవహించే పెన్నానది ప్రాశస్త్యాన్ని గమనంలోకి తీసుకుని ఈ పేరు పెట్టారు. 1992, జూలై 1న ఈ రైలు ప్రారంభమైంది. దక్షిణ మధ్య రైల్వేజోన్‌లో విజయవాడ జంక్షన్‌ నుంచి దక్షిణ రైల్వేజోన్‌లోని తమిళనాడు రాష్ట్ర రాజధాని ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌కు రోజూ నడుస్తుంది. సగటున రోజూ 430 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కేవలం 12 హాల్ట్‌లను మాత్రమే కలిగి ఉన్న ఈ రైలుకు ఆక్యుపెన్సీ వందశాతం ఉంది. రెండు రాష్ర్టాల రాజధానులు, ఆయా రాష్ర్టాల పరిధిలోని ప్రధాన రైల్వే జంక్షన్లను అనుసంధానం చేసే లక్ష్యంతోనే ఇలా తక్కువ హాల్ట్‌లు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఉమ్మడి కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన ఎంతోమంది ఉద్యోగులు, విద్యార్థులు, సీజన్‌ టికెట్‌ హోల్డర్లు పినాకినీలో ప్రయాణిస్తుంటారు. ప్రారంభంలో 18 కోచ్‌లు ఉండేవి. డిమాండ్‌ కారణంగా 24కు పెంచారు. ఈ ఎక్స్‌ప్రెస్‌లో భద్రతాపరంగా తీసుకున్న జాగ్రత్తలు ప్రత్యేకం. కోచ్‌కు, కోచ్‌కు నడుమ పాత స్ర్కూ కప్లింగ్‌ స్థానంలో సెంట్రల్‌ బఫర్‌ కప్లర్‌ (సీబీసీ) వ్యవస్థను తెచ్చారు. దీనివల్ల కోచ్‌లు అత్యంత సురక్షితంగా ఉంటాయి.

ఘనంగా పినాకిని పుట్టినరోజు

పినాకిని ఎక్స్‌ప్రెస్‌ 30వ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఘనంగా జరిగాయి. దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) ఫ్యాన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు ఏ.కార్తికేష్‌ నేతృత్వంలోని 30 మందికి పైగా అభిమానులు ఈ వేడుకకు హాజరయ్యారు. విజయవాడలోని ఎలక్ర్టిక్‌ లోకోషెడ్‌ (ఈఎల్‌ఎస్‌)లో ఈ వేడుక జరిగింది. పాతకాలపు జ్ఞాపకాన్ని గుర్తుకుతెచ్చేలా రంగులు వేసి అందంగా ముస్తాబు చేశారు. అనంతరం ఒకటో నెంబర్‌ ప్లాట్‌ఫాంపైకి తీసుకొచ్చారు. ఫ్యాన్స్‌ క్లబ్‌ నేతృత్వంలో రైలు ముందు కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ప్రయాణికులకు స్వీట్లు పంచారు. ఈ రైలును బెజవాడ డివిజన్‌ పీఆర్వో నుస్రత్‌ మండ్రూపకర్‌, ఎలక్ర్టిక్‌ లోకోషెడ్‌ (ఈఎల్‌ఎస్‌) సీనియర్‌ డీఈఈ దినేష్‌రెడ్డి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఏ1 రైల్వేస్టేషన్‌ డైరెక్టర్‌ పీబీఎన్‌ ప్రసాద్‌, మెయింటినెన్స్‌ అధికారి ఉదయ భాస్కర్‌ పాల్గొన్నారు. 





Updated Date - 2022-07-02T06:06:54+05:30 IST