30 వేలు ఇస్తే చాలు

ABN , First Publish Date - 2022-09-23T10:46:45+05:30 IST

30 వేలు ఇస్తే చాలు

30 వేలు ఇస్తే చాలు

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో అర్హత.. కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడి హామీ

పోలీసులకు ఫిర్యాదు చేసిన రిక్రూట్‌మెంట్‌ అధికారి


నెల్లూరు (క్రైం), సెప్టెంబరు 22: ‘‘నెల్లూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో అర్హత సాధించకపోయినా ఫర్వాలేదు. రూ.30 వేలు చెల్లిస్తే చాలు సికింద్రాబాద్‌లో జరిగే రీ మెడికల్‌లో నిన్ను క్వాలిఫై చేయిస్తా’’ అంటూ ఓ శిక్షణ కేంద్రం నిర్వాహకుడు అభ్యర్థికి హామీ ఇచ్చాడు. ఈ విషయం దావానంలా వ్యాపించి ఆర్మీ అధికారులదాకా చేరడంతో.. రిక్రూట్‌మెంట్‌ అధికారి కల్నల్‌ కోహ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నెల్లూరులో ఈ నెల 15 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ జరుగుతోంది. రోజుకు సుమారు 3 వేల మందికి ఇక్కడ ఎంపిక పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, ప్రకాశం జిల్లా కొమరోలు ప్రాంతానికి చెందిన మీరావలి.. ‘మీరా కోచింగ్‌ సెంటర్‌’ పేరుతో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు వెళ్లే అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. అక్కడ శిక్షణ పొందిన మార్కాపురానికి చెందిన కాశీం బుధవారం రాత్రి నెల్లూరు ర్యాలీలో పాల్గొన్నాడు. కానీ మెడికల్‌ విభాగంలో కాశీం అర్హత సాధించలేక పోయాడు. ఈ విషయాన్ని మీరావలికి ఫోన్‌చేసి చెప్పాడు. దీంతో మీరావలి ‘‘సికింద్రాబాద్‌లో జరిగే రీ మెడికల్‌లో నిన్ను క్వాలిఫై చేయిస్తాను. రూ.30 వేలు పెట్టుకుంటే సరిపోతుంది. అంతా నేను చూసుకుంటాను’’ అని హామీ ఇచ్చాడు. దీంతో కాశీం మెడికల్‌లో అర్హత సాధించలేకపోయిన మరికొందరకి ఇదే విషయం తెలిపాడు. ఇది ఆనోటా ఈనోటా పడి డైరెక్టర్‌ రిక్రూట్‌మెంట్‌ గుంటూరు కల్నల్‌ షోజాదా కోహ్లీకి తెలిసింది. దీంతో ఆయన దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2022-09-23T10:46:45+05:30 IST