New York : 29వ అంతస్థు నుంచి పడి 3 ఏళ్ల బాలుడు మృతి..

ABN , First Publish Date - 2022-07-03T22:26:17+05:30 IST

ఎత్తైన భవంతి 29వ అంతస్థు మీద నుంచి పడి 3 ఏళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో శనివారం వెలుగుచూసిన

New York : 29వ అంతస్థు నుంచి పడి 3 ఏళ్ల బాలుడు మృతి..

న్యూయార్క్ : ఎత్తైన భవంతి 29వ అంతస్థు మీద నుంచి పడి 3 ఏళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో శనివారం వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ‘బూమ్’ అని గట్టి శబ్దాలు వినిపించడంతో బయటకొచ్చి అటూఇటూ చూసిన బిల్డింగ్ వాసులకు 5వ ఫ్లోర్‌ పరంజాపై పడివున్న బాలుడు కంటపడ్డాడు. అప్పటికే బాలుడిలో ఎలాంటి కదలికలు కనిపించలేదు. ప్రమాద సమయంలో బాలుడి తల్లి బిల్డింగ్ ఆవరణలోనే ఉన్న పార్క్‌లో ఉంది. బాలుడు పడడాన్ని గమనించి ‘ నా బిడ్డ.. నా బిడ్డ.. అది నా బిడ్డే’ అని బిగ్గరగా అరుచుకుంటూ పరిగెత్తుకొచ్చిందని ప్రత్యక్ష సాక్షి  ఒకరు చెప్పారు. ఇక బాలుడి తండ్రి పైఅంతస్థుల నుంచి కిందికి పరిగెత్తుకుంటూ కిందకు వచ్చాడు. పరంజా మీదకు ఎక్కి బాలుడిని దించే ప్రయత్నం చేశాడు. కానీ సాధ్యపడలేదు. అక్కడున్న కొందరు సాయం చేయడంలో బాలుడిని కిందికి దించారు. హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే బాలుడు కన్నుమూశాడని వైద్యులు నిర్ధారించారు.


కాగా ఈ ఘటనపై 23వ ఫ్లోర్‌కు చెందిన తంగెరిన్ క్యాస్ట్రో అనే మహిళ స్పందించారు. ‘‘ భారీ శబ్దం వినిపించడంతో బాల్కనీలోకి పరిగెత్తుకొచ్చా. పసుపు రంగు టీషర్ట్ ధరించిన బాలుడు పరంజాపై పడివున్నాడు.’’ అని ఆమె వివరించారు. 34వ ఫ్లోర్‌లోని అపార్ట్‌మెంట్‌లో నివాసముండే నదియా కార్డెరా అనే మరో మహిళ స్పందిస్తూ.. 29వ అంతస్థు బాల్కనీలో కొంతమంది వ్యక్తుల మధ్య పెద్ద గొడవ జరుగింది. ఆ తర్వాత 10 నిమిషాలకే బాలుడు పైనుంచి పడ్డాడని ఆమె తెలిపింది. డైపర్స్, టీషర్ట్‌లో బాలుడు ఉన్నాడని చెప్పారు. డైపర్స్ తొడగడం, పాలు తాగించే విషయాల్లో బాలుడి తల్లికి గతంలో తాను సాయపడ్డానని, బాలుడు ముద్దొచ్చేలా ఉంటాడని ఆమె తెలిపారు.


కాగా న్యూయార్క్ చట్టాల ప్రకారం.. 10 ఏళ్లలోపు వయసున్న పిల్లలుంటే 3 లేదా అంతకంటే ఎక్కువ అపార్ట్‌మెంట్లు ఉన్న బిల్డింగులకు విండో గార్డులను ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాగా బాలుడు ప్రమాదానికి గురయిన బిల్డింగ్‌కి విండో గార్డ్స్ ఉన్నాయో లేవో తెలియరాలేదు. మీడియా రిపోర్టుల ప్రకారం.. బాలుడి మృతిపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. బాలుడు కిందపడినప్పుడు అదే అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

Updated Date - 2022-07-03T22:26:17+05:30 IST