దసరా పండుగకు 3 వేల స్పెషల్‌ బస్సులు

ABN , First Publish Date - 2020-10-20T07:36:09+05:30 IST

దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ రద్దీకి అనుగుణంగా మూడు వేల స్పెషల్‌ బస్సులను నడపాలని నిర్ణయించినట్లు రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌

దసరా పండుగకు 3 వేల స్పెషల్‌ బస్సులు

రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ వరప్రసాద్‌...


చాదర్‌ఘాట్‌, అక్టోబర్‌ 19(ఆంధ్రజ్యోతి): దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ రద్దీకి అనుగుణంగా మూడు వేల స్పెషల్‌ బస్సులను నడపాలని నిర్ణయించినట్లు రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ వరప్రసాద్‌ తెలిపారు. సోమవారం ఆర్టీసీ మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో రంగారెడ్డి రీజినల్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలను ఆయన వివరించారు. ఈనెల 15వ తేదీ నుంచి ప్రత్యేక బస్సుల నడవడం మొదలైందన్నారు. ఈ నెల 24వ తేదీ వరకు నడిచే ఈ స్పెషల్‌ బస్సులు ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్‌, కేపీహెచ్‌బీ, ఎన్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట, టేలిఫోన్‌ భవన్‌, ఈసీఐఎల్‌, ఉప్పల్‌ చౌరస్తా, ఎల్‌బీనగర్‌ ప్రాంతాల నుంచి నడపడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఈనెల 22నుంచి 24వ తేదీ వరకు 2034 స్పెషల్‌ బస్సులను నడపనున్నట్లు ఆర్‌ఎం వివరించారు. 22న 657 బస్సులు, 23న 659 బస్సులు, 24న 614 బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేశామన్నారు.


ఈమేరకు అడ్వాన్‌ రిజర్వేషన్‌ సౌకర్యం కూడా కల్పించారు. జేబీఎస్‌ నుంచి కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల వైపు వెళ్లే రెగ్యులర్‌ బస్సులతోపాటు స్పెషల్‌ బస్సులు నడుస్తాయి. ఉప్పల్‌ చౌరస్తా, ఉప్పల్‌ బస్‌ స్టేషన్‌ నుంచి యాదగిరిగుట్ట, జనగాం, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్‌, తోర్రూర్‌, వరంగల్‌ వైపు వెళ్లే రెగ్యులర్‌ బస్సులతోపాటు స్పెషల్‌ బస్సులు నడవనున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్‌ నుంచి మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ, సూర్యాపేట వైపు వెళ్లే రెగ్యులర్‌ బస్సులతోపాటు స్పెషల్‌ బస్సులు నడవనున్నాయి. 

Updated Date - 2020-10-20T07:36:09+05:30 IST