Abn logo
Mar 28 2020 @ 00:47AM

వాయిదాలు వాయిదా

ఈఎంఐలకు హాలిడే

3 నెలల మారటోరియం

కరోనా కాటుకు మందు

రెపో 0.75% , రివర్స్‌ రెపో 0.90% తగ్గింపు

సీఆర్‌ఆర్‌లో 1 శాతం కోత 

వ్యవస్థలోకి  రూ.3.74 లక్షల కోట్ల నిధులు 

రుణాలు మరింత చౌక 

ఆర్‌బీఐ అత్యవసర భేటీ

అన్ని రకాల రుణాలకూ వర్తింపు

క్రెడిట్‌ కార్డు బకాయిలకు కూడా

నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ బ్యాంకులకు

చెల్లించే సామర్థ్యం ఉంటే చెల్లించొచ్చు

ఈసీఎ్‌సలకు బ్యాంకు అనుమతివ్వాలి

క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం ఉండదు

11 ఏళ్లలో పెద్ద మొత్తంలో తగ్గింపు ఇదే

16 ఏళ్ల కనిష్ఠ స్థాయికి చేరిన రెపో

మరింత తగ్గనున్న రుణాల వడ్డీ రేట్లు


కరోనా విలయం నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ఆర్బీఐ ముందుకొచ్చింది! దేశ ప్రజలంతా ఇల్లు దాటని ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలు తీసుకున్న వారు ఈఎంఐల చెల్లింపులకు ఇబ్బందులు పడకుండా మూడు నెలల మారటోరియానికి అవకాశం ఇచ్చింది! క్రెడిట్‌ కార్డు బకాయిలు సహా అన్ని రకాల రుణాలకూ ఈ వెసులుబాటు కల్పించింది! బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వడానికి, వాటికి మరింత నగదు అందుబాటులో ఉంచడానికి వీలుగా రెపో, రివర్స్‌ రెపో, సీఆర్‌ఆర్‌ రేట్లను భారీగా తగ్గించింది!కరోనా ధాటికి అచేతనమైన ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు, రుణగ్రహీతలకు భారీ ఊరట కల్పించేందుకు ఆర్‌బీఐ శుక్రవారంనాడు కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్ని రకాల రుణాల తిరిగి చెల్లింపులపై 3 నెలల మారటోరియం సదుపాయం కల్పిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. అంతేకాకుండా కొత్తగా రుణాలు తీసుకునే వారికి వడ్డీ భారం తగ్గేందుకు వీలుగా ఆర్‌బీఐ రెపో రేటును ఏకంగా 0.75 శాతం తగ్గించింది. దాంతో రెపో రేటు 4.4 శాతానికి చేరింది.  ఒకేసారి రెపో రేటును ముప్పావు శాతం తగ్గించడం గడిచిన 11 ఏళ్లలో ఇదే తొలిసారి. రివర్స్‌ రెపో రేటును సైతం 0.90 శాతం తగ్గించి 4 శాతానికి కుదించింది. ఇందుకుతోడు బ్యాంకుల నగదు నిల్వ నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)ని  ఏకంగా ఒక శాతం తగ్గించింది. దాంతో సీఆర్‌ఆర్‌ 4 శాతం నుంచి 3 శాతానికి తగ్గింది. సీఆర్‌ఆర్‌ తగ్గింపుతో రూ.1.37 లక్షల కోట్లు, మొత్తంగా రూ.3.74 లక్షల కోట్ల అదనపు ద్రవ్యం అందు బాటులోకి రానుందని ఆర్‌బీఐ పేర్కొంది. 


2009 జనవరి తర్వాత రెపో రేటును పెద్ద మొత్తంలో తగ్గించడం ఇదే తొలిసారి.


2004 అక్టోబరు తర్వాత మళ్లీ రెపో రేట్లకిదే కనిష్ఠ స్థాయి.


రెపో, సీఆర్‌ఆర్‌ తగ్గింపుతో వ్యవస్థలోకి అందుబాటులోకి రానున్న రూ.3.74 లక్షల కోట్ల నిధులు 2019-20 ఆర్థిక సంవత్సరం జీడీపీలో దాదాపు 2 శాతానికి సమానం. 


ఆర్‌బీఐ ఈ మధ్యకాలంలో చేపట్టిన చర్యలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లయితే వ్యవస్థలోకి అందుబాటులోకి రానున్న అదనపు నిధుల విలువ జీడీపీలో 3.2 శాతానికి సమానం. 


గత ఏడాది 5 ద్రవ్య పరపతి సమీక్షల్లో ఆర్‌బీఐ రెపో రేటును 1.35 శాతం తగ్గించింది. ధరల సూచీ ఆందోళనకర స్థాయికి ఎగబాకడంతో 2019 డిసెంబరు, 2020 ఫిబ్రవరి సమీక్షల్లో  రెపోను యథాతథంగా కొనసాగించింది. 


ద్రవ్య పరపతి సమీక్ష సమావేశం షెడ్యూల్‌కు ముందే ఆర్‌బీఐ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోవడం ఐదేళ్లలో తొలిసారి. 


వారం ముందే ఎంపీసీ సమావేశం

కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ప్రభుత్వంతో తాజాగా ఆర్‌బీఐ చేయి కలిపింది. ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షలో భాగంగా వచ్చే నెల 1-3 తేదీల్లో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల  మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం కావాల్సి ఉంది. కానీ ఎంపీసీ వారం రోజుల ముందే సమావేశమై ఎకానమీకి ఊతమిచ్చేందుకు తనవంతు చర్యలను ప్రకటించింది. వడ్డీ రేట్లను తగ్గింపునకు ఎంపీసీ సభ్యులంతా సుముఖత తెలిపినప్పటికీ.. 0.75 శాతం తగ్గింపునకు మాత్రం నలుగురే ఓటేశారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని ఎదుర్కోవడంతోపాటు వృద్ధిని పెంచేందుకు అవసరమైతే వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తామని, ఇతర చర్యలకూ సిద్ధమని ఆర్‌బీఐ సంకేతాలిచ్చింది. 


వృద్ధికి రిస్కే.. 

కరోనా వ్యాప్తితో దేశ ఆర్థిక వృద్ధికి ముప్పు పొంచి ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 5 శాతంగా నమోదు కావాలంటే, జనవరి- మార్చి త్రైమాసికానికి కనీసం 4.7 శాతం వృద్ధి అవసరమని అన్నారు. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, తీవ్రత, కట్టడికి ఎంతకాలం పట్టవచ్చన్న అంశాలపైనే భవిష్యత్‌ వృద్ధిరేటు, ద్రవ్యోల్బణం ఆధారపడి ఉండనున్నాయని ఆయన పేర్కొన్నారు. 


దాస్‌ ఇంకా ఏమన్నారంటే.. 

2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం నాటి పరిస్థితులతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు మరింత పటిష్ఠంగా ఉన్నాయి. 

బ్యాంకులు తమ డిపాజిట్లను ఆర్‌బీఐ వద్ద జమ చేయకుండా నిరుత్సాహపరిచేందుకే రివర్స్‌ రెపోను తగ్గించడం జరిగింది. బ్యాంకులు కీలక రంగాలకు మరిన్ని రుణాలిచ్చేందుకు ఈ నిర్ణయం బాటలు వేయనుంది. 


ఆర్థిక వృద్ధికి అవసరమైనంత కాలం మద్దతివ్వడంతోపాటు వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకే వడ్డీ రేట్లను తగ్గించడం జరిగింది. కఠిన సమయం ఎల్లకాలం ఉండబోదు.. కేవలం కఠినమైన మనుషులు, వ్యవస్థలే దీర్ఘకాలం బరిలో నిలుస్తాయి. 

- శక్తికాంత దాస్‌, ఆర్‌బీఐ గవర్నర్‌ 


రుణాల ఈఎంఐలు, నిర్వహణ మూలధనంపై వడ్డీ చెల్లింపులకు మూడు నెలల విరామం కల్పించడం భారీ ఊరట. ఆర్‌బీఐ రెపో రేట్లకు అనుగుణంగా బ్యాంకులు సైతం రుణ రేట్లను త్వరితగతిన తగ్గించాలి. 

- నిర్మలా సీతారామన్‌, ఆర్థిక మంత్రి


ఆర్‌బీఐ చర్యలతో వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెరగడంతోపాటు రుణాలు చౌకగా లభించనున్నాయి. ఇది మధ్యతరగతి వారికి, వ్యాపారులకు ఎంతగానో దోహదపడనుంది. 

- నరేంద్ర మోదీ, భారత ప్రధాని 


ఆర్‌బీఐ తాజా చర్యలు ఆర్థిక మార్కెట్ల స్థిరత్వానికి దోహదపడనున్నాయి. వ్యవస్థలో నిజంగా అవసరమైన వారికి నిధుల కొరతను తీర్చేలా ఉన్నాయి. అంతేకాదు, చర్యల ఫలితాలు వేగంగా ప్రజలకు చేరనున్నాయి.

- రజనీశ్‌ కుమార్‌, ఎస్‌బీఐ చైర్మన్‌ 

Advertisement
Advertisement
Advertisement