24 రోజులకే నూరేళ్లు!

ABN , First Publish Date - 2020-05-31T08:03:16+05:30 IST

కొడుకు పుట్టాడన్న ఆనందం ఆ తల్లిదండ్రులకు నెలైనా మిగల్లేదు. ముద్దుగా చేతుల్లోకి తీసుకొని ముద్దాడే అవకాశమూ రాలేదు. భూమిపై పడ్డ రోజుల వ్యవధిలోనే కరోనా బారిన...

24 రోజులకే నూరేళ్లు!

పసిగుడ్డును బలిగొన్న కరోనా రక్కసి

3 నెలల శిశువు కూడా మృత్యువాత

రాష్ట్రంలో మరో 6 మరణాలు

కొత్తగా 74 పాజిటివ్‌ల నిర్ధారణ

సౌదీ నుంచి వచ్చిన ఐదుగురికి

10 జిల్లాల్లో కొత్తగా పాజిటివ్‌లు

వనపర్తి జిల్లాలో తొలి కేసు నమోదు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): కొడుకు పుట్టాడన్న ఆనందం ఆ తల్లిదండ్రులకు నెలైనా మిగల్లేదు. ముద్దుగా చేతుల్లోకి తీసుకొని ముద్దాడే అవకాశమూ రాలేదు. భూమిపై పడ్డ రోజుల వ్యవధిలోనే కరోనా బారిన పడి 24 రోజులకే ప్రాణాలు విడిచాడు. ఈ శిశువుతోపాటు మరో 3 నెలల చిన్నారినీ కరోనా రక్కసి కబళించింది. పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్య తలెత్తడం ఈ చిన్నారిని కరోనా నుంచి కోలుకోకుండా చేసింది. వీరితో కలిపి కరోనా కారణంగా రాష్ట్రంలో శనివారం ఆరుగురు మృతి చెందారు. మిగిలిన నలుగురూ వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడున్న వారేనని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన బులిటెన్‌లో పేర్కొంది. వీరిలో 58 ఏళ్ల వ్యక్తి ఒకరు, 62 ఏళ్లు, 52 ఏళ్ల వ్యక్తులు మరో ఇద్దరు హైపర్‌ టెన్షన్‌తో బాధపడుతున్నవారని, 47 ఏళ్ల మరో వ్యక్తికి కార్డియాక్‌ సర్జరీ అయిందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 77కు చేరింది. ఇక శనివారం కొత్తగా మరో 74 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో 41 కేసులు ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే రాగా, 5 కేసులు రంగారెడ్డి జిల్లా పరిధిలో వచ్చాయి. మరో 14 కేసులు వివిధ జిల్లాల్లోని వారికి నిర్ధారణ అయ్యాయి. వీరితోపాటు మరో 9 మంది వలస కార్మికులకు, సౌదీ నుంచి వచ్చిన ఐదుగురికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,499కి చేరింది. ఇప్పటివరకు 1,412 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా, మరో 1010 మంది చికిత్స పొందుతున్నారు. 


జిల్లాల్లో కరోనా వ్యాప్తి..!

రాష్ట్రంలో కరోనా వైరస్‌.. జిల్లాల్లోనూ విస్తరిస్తోంది. శనివారం ఏకంగా 10 జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. వీటిలో గత కొద్దిరోజులుగా కేసుల ప్రస్తావన లేని జిల్లాలు ఉండటంతోపాటు ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదుకాని వనపర్తి జిల్లాలోనూ తొలి కేసు నిర్ధారణ అయింది. తాజాగా సంగారెడ్డి జిల్లాలో మూడు, మహబూబ్‌నగర్‌, జగిత్యాల జిల్లాల్లో రెండు చొప్పున, సూర్యాపేట, వనపర్తి, వరంగల్‌ అర్బన్‌, వికారాబాద్‌, మేడ్చల్‌, నాగర్‌ కర్నూల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు వైరస్‌ బారినపడ్డ వలస కార్మికుల సంఖ్య 189కి చేరగా, సౌదీ నుంచి వచ్చినవారి సంఖ్య 212కు చేరింది. మొత్తం ఈ నెలలోనే 1460 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 49 మంది చనిపోయారు. ఈ నెల 19 నుంచి 12 రోజుల వ్యవధిలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. 


సూర్యాపేట జిల్లా కాసరబాద గ్రామంలో ఈ నెల 27న కరోనాతో మృతి చెందిన బాలుడి మేన్తకు శనివారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బాలుడు ఆస్పత్రిలో ఉన్నప్పుడు అతనికి ఆమే సపర్యలు చేసింది. 


నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామానికి చెందిన మహిళ(60) కరోనాతో శనివారం మృతి చెందారు. రంజాన్‌ సందర్భంగా గ్రామంలో పలువురికి ఆమె కుటుంబసభ్యులు సేమియా ఇవ్వడంతో ఇప్పుడు వారందరినీ క్వారంటైన్‌ చేశారు. 


రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదర్‌పల్లి గ్రామంలో 13 నెలల చిన్నారికి కరోనా సోకింది. 


వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ కుమార్‌పల్లి ప్రాంతానికి చెందిన వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. 


సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని మూసానగర్‌లో ఇప్పటికే పాజిటివ్‌గా తేలిన వ్యక్తి భార్యకు శనివారం నిర్ధారణ అయింది. పోతిరెడ్డిపల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన, రామచంద్రాపురంలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌కు ఇప్పటికే పాజిటివ్‌ రాగా, అతని కుమార్తెకు కూడా సోకినట్లు తేలింది. 


మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం వేపూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(35)కి కరోనా నిర్ధారణ కాగా.. శుక్రవారం ఉస్మానియా ఆస్పత్రి నుంచి తప్పించుకొని వచ్చాడు. శనివారం జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్‌ వద్ద కనిపించిన అతణ్ని పోలీసులు పట్టుకొని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 


నలుగురు జర్నలిస్టులకు కరోనా


హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారుల ఆదేశం

హైదరాబాద్‌లో నలుగురు జర్నలిస్టులు కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. వారిలో జాతీయ మీడియాకు చెందిన ముగ్గురు ఫొటో జర్నలిస్టులు ఉండగా.. మరొకరు ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుగా తెలుస్తోంది. శుక్రవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 20 మంది జర్నలిస్టులకు పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. వారిలో నలుగురికి స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. వారిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించారు.


ఉస్మానియా ఆస్పత్రిలో ఇద్దరు పీజీ విద్యార్థులకు కరోనా 

ఉస్మానియా మెడికల్‌ కాలేజీకి చెందిన ఇద్దరు పీజీ వైద్య విద్యార్థులకు కరోనా వైరస్‌ సోకింది. ఉస్మానియా ఆస్పత్రి క్యాంటీన్‌ సిబ్బంది ఒకరికి కూడా పాజిటివ్‌గా తేలింది. వీరితోపాటు తిలక్‌నగర్‌కు చెందిన ఓ పోలీ్‌సస్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్‌, అతని భార్య, తల్లి, బావమరిది, చెల్లెలుకు కరోనా సోకింది. వినాయక్‌నగర్‌ డివిజన్‌ శివనగర్‌కు చెందిన మరో కానిస్టేబుల్‌కూ పాజిటివ్‌ వచ్చింది. ఎల్‌బీనగర్‌ మజీద్‌గల్లీలో మటన్‌షాపు నిర్వహించే 65 ఏళ్ల వ్యక్తి ఇటీవల జియాగూడలో కరోనా పాజిటివ్‌తో మృతి చెందిన వారి అంత్యక్రియలకు వెళ్లి రాగా అతనికీ వైరస్‌ ఉన్నట్లు తేలింది. మల్కాజిగిరి దుర్గానగర్‌కు చెందిన (20) తొమ్మిది మాసాల నిండు గర్భిణికీ వైరస్‌ సోకింది. రామంతాపూర్‌ కామాక్షిపురంలో నివసించే ఓ వ్యాపారి (36), సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అయిన అతని భార్య (30)కు కరోనా పాజిటివ్‌గా తేలింది.

Updated Date - 2020-05-31T08:03:16+05:30 IST