ట్రిపుల్ రైడింగ్‌కు ఫైన్.. అంతలోనే ఆ ముగ్గురూ మృత్యువాత

ABN , First Publish Date - 2021-04-13T00:23:59+05:30 IST

ట్రిపుల్ రైడింగ్‌కు జరిమానా కట్టిన గంటలోనే ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. రాజస్థాన్‌లోని

ట్రిపుల్ రైడింగ్‌కు ఫైన్.. అంతలోనే ఆ ముగ్గురూ మృత్యువాత

జైపూర్: ట్రిపుల్ రైడింగ్‌కు జరిమానా కట్టిన గంటలోనే ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. రాజస్థాన్‌లోని బార్మెర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. బచ్‌డౌ గ్రామానికి చెందిన ముగ్గురు కూలీలు బలోత్రాలో పనులు ముగించుకుని ఒకే బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు.


అత్యంత వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వస్తుండగా బార్మెర్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఖేట్ సింగ్ కీ ప్యావు గ్రామ సమీపంలో బైక్ అదుపు తప్పడంతో ముగ్గురూ చెల్లాచెదురుగా పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి అంబులెన్స్‌లో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్టు నిర్ధారించారని సర్దార్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ తెలిపారు.   


మృతులను మోతారామ్ మేఘ్‌వాల్, హడ్మన్‌రామ్ మేఘ్‌వాల్, జబారా రామ్‌గా గుర్తించారు. వీరు ముగ్గురూ బచ్‌డౌ గ్రామానికి చెందిన వారేనని పోలీసులు తెలిపారు. కాగా, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో ప్రమాదానికి గంట ముందే జరిమానా చెల్లించినట్టు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-04-13T00:23:59+05:30 IST