ఫ్రాన్స్‌లో మరో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి !

ABN , First Publish Date - 2020-10-30T12:43:49+05:30 IST

ఫ్రాన్స్‌లో ఓ స్కూల్‌ టీచర్‌ తల నరికిన ఘటన మరువక ముందే.. మరో ఉగ్రదాడి జరిగింది. నైస్‌ నగరంలోని నోట్రే-డేమ్‌ ప్రాంతంలో చర్చి వద్ద గురువారం ఉదయం ఓ దుండగుడు కత్తితో దాడి చేసి ముగ్గురిని హత్య చేశాడు.

ఫ్రాన్స్‌లో మరో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి !

కత్తితో నరికి ముగ్గురిని హత్య చేసిన దుండగుడు

ప్రవక్త కార్టూన్ల ప్రదర్శనపై ముస్లిం దేశాల ఆగ్రహం

ఉగ్రవాదంపై పోరులో ఫ్రాన్స్‌తో భారత్‌: మోదీ

ముస్లింలకు చంపే హక్కు ఉంది: మహతీర్‌

నైస్‌, అక్టోబరు 29: ఫ్రాన్స్‌లో ఓ స్కూల్‌ టీచర్‌ తల నరికిన ఘటన మరువక ముందే.. మరో ఉగ్రదాడి జరిగింది. నైస్‌ నగరంలోని నోట్రే-డేమ్‌ ప్రాంతంలో చర్చి వద్ద గురువారం ఉదయం ఓ దుండగుడు కత్తితో దాడి చేసి ముగ్గురిని హత్య చేశాడు. పలువురిని గాయపరిచాడు. అల్లాహూ అక్బర్‌ అని అరుస్తూ కత్తితో దాడులకు తెగబడ్డాడని అధికారులు తెలిపారు. టునీషియాకు చెందిన అతడు, ఇటీవలే యూర్‌పలో అడుగుపెట్టినట్లు పేర్కొన్నారు. అధికారుల కాల్పుల్లో ఉగ్రవాది గాయపడ్డాడని నగర మేయర్‌ క్రిస్టియన్‌ ఎస్ట్రోసీ తెలిపారు. దాడి నేపథ్యంలో ప్రభుత్వం దేశంలో హై అలర్ట్‌ ప్రకటించింది. ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదంపై పోరులో ఫ్రాన్స్‌కు అండగా ఉంటామని భారత ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మరోవైపు.. సామాజిక మాధ్యమాల్లో ఫ్రాన్స్‌కు మద్దతుగా ‘ఐ స్టాండ్‌ విత్‌ ఫ్రాన్స్‌’ అన్న హాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అయింది.


అసలేం జరిగింది?

ఈ నెల 16న ఫ్రాన్స్‌లోని కాన్‌ఫ్లాన్స్‌-సెయింటే-హోనోరైన్‌ ప్రాంతంలో సామ్యూల్‌ పాటీ(47) అనే ఉపాధ్యాయుడిని అబ్దౌల్లాఖ్‌ అబౌయేదొవిచ్‌ అంజోరోవ్‌ అనే ఉగ్రవాది తల నరికి హత్య చేసిన సంగతి తెలిసిందే. మహ్మద్‌ ప్రవక్తపై కార్టూన్లను విద్యార్థులకు పాటీ చూపించడమే హత్య వెనుక కారణం. అనంతరం అధికారులు ముష్కరుడిని కాల్చి చంపా రు. ఉగ్రవాదంపై నిరసనగా ఫ్రాన్స్‌ ప్రభుత్వం, చార్లీ హెబ్డో కార్టూన్లను మరింత పెద్దవిగా చేసి ప్రభుత్వ భవనాలకు వేలాడదీసింది. దీంతో ముస్లిం దేశాలన్నీ ఫ్రాన్స్‌పై మూకుమ్మడిగా విమర్శలు గుప్పించాయి. హిట్లర్‌ హయాంలో జర్మనీ జరిపిన దారుణ మారణకాండ ‘హోలోకాస్ట్‌’ జరగలేదని అనడం ఫ్రాన్స్‌లో నేరమైనప్పుడు ప్రవక్తను దూషించడాన్ని మాత్రం ఎందుకు నేరంగా పరిగణించరు అని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అలీ ఖమినియ్‌ ప్రశ్నించారు. కోప్పడేందుకు, లక్షలాదిమంది ఫ్రెంచి పౌరులను చంపేందుకు ముస్లింలకు హక్కు ఉందంటూ తాజా ఉగ్రదాడి అనంతరం మలేషియా మాజీ ప్రధాని మహతిర్‌ మహ్మద్‌ ట్వీట్‌ చేయడం గమనార్హం.

Updated Date - 2020-10-30T12:43:49+05:30 IST