కోల్‌కతాలో ముగ్గురు జేఎంబీ ఉగ్రవాదుల అరెస్టు

ABN , First Publish Date - 2021-07-11T23:52:30+05:30 IST

జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ముగ్గురిని కోల్‌కతా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌‌టీఎఫ్) పోలీసులు..

కోల్‌కతాలో ముగ్గురు జేఎంబీ ఉగ్రవాదుల అరెస్టు

కోల్‌కతా: జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ముగ్గురిని కోల్‌కతా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌‌టీఎఫ్) పోలీసులు ఆదివారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. కోల్‌కతాలోని హరిదేవ్‌పూర్‌లోని ఓ అద్దె ఇంట్లో వీరు గత రెండు నెలలుగా నివాసముంటున్నట్టు చెబుతున్నారు. మధ్యతరగతి వర్గం ఎక్కువ మంది నివసించే ఈ ప్రాంతంలో వీరు పట్టుబడటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. రోజువారీ గాలింపు చర్యలు జరుపుతుండగా ఈ ముగ్గురు అనుమానాస్పద టెర్రరిస్టులను పట్టుకున్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం వారిని ఇంటరాగేట్ చేస్తున్నామని, దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని చెప్పారు. పట్టుబడిన ఉగ్రవాదుల వద్ద జీహాదీ సాహిత్యం దొరికిందని, వారి ఫేస్‌బుక్ అకౌంట్లను విశ్లేషిస్తున్నామని చెప్పారు. కీలకమైన జేఎంబీ సభ్యుల పేర్లు, నెంబర్లు రాసి ఉన్న ఒక డైరీని కూడా స్వాధీనం తాము చేసుకున్నట్టు ఎస్‌టీఎఫ్ సీపీ వి.సాల్మన్ తెలిపారు. పట్టుబడిన ముగ్గురిని సోమవారంనాడు కోర్టు ముందు హాజరుపరుస్తామని చెప్పారు.

Updated Date - 2021-07-11T23:52:30+05:30 IST