తగ్గినట్టే తగ్గి.. అక్కడ ఒక్కరోజే 29 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-27T17:50:17+05:30 IST

ఉమ్మడి జిల్లాలో కరోనా కంగారెత్తిస్తోంది. తగ్గుముఖం పట్టినట్టే పట్టిన మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. మళ్లీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లా వైద్య శాఖ అధికారులు, ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా

తగ్గినట్టే తగ్గి.. అక్కడ ఒక్కరోజే 29 కరోనా కేసులు

ఉమ్మడి జిల్లాలో ఒక్కరోజే 29 పాజిటివ్‌లు

రంగారెడ్డి జిల్లాలో 24, వికారాబాద్‌లో 5 కేసులు నమోదు 

వికారాబాద్‌ జిల్లాలో 36 రోజుల తర్వాత మళ్లీ కేసులు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి జిల్లాలో కరోనా కంగారెత్తిస్తోంది. తగ్గుముఖం పట్టినట్టే పట్టిన మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. మళ్లీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లా వైద్య శాఖ అధికారులు, ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది.  మంగళవారం ఒక్కరోజే రంగారెడ్డి జిల్లాలో  24 కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది.  వికారాబాద్‌ జిల్లాలో 36రోజుల తర్వాత మళ్లీ పాజిటివ్‌లు రావడంతో జనం బెంబేలెత్తుతున్నారు. కరోనా వైరస్‌ రంగారెడ్డి జిల్లాపై పంజా విసురుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిత్యం పెరుగుతున్న పాజిటివ్‌ కేసులతో జనం బెంబేలెత్తుతున్నారు. మంగళవారం ఒక్కరోజే 24 మందికి కరోనా సోకడం కలకలం రేకెత్తించింది. భార్యాభర్తల నుంచి వారి బంధువుల్లో 19 మందికి కరోనా సోకినట్లు జిల్లా వైద్యశాఖ అధికారులు గుర్తించారు. మరో కుటుంబంలో ఒకరి నుంచి ముగ్గురికి వైరస్‌ సోకినట్లు తేల్చారు. అదేవిధంగా ఓ స్టాఫ్‌నర్స్‌ వైరస్‌ బారిన పడినట్లు నిర్ధారించారు. ఆర్‌కేపురంలో మరొకరికి పాజిటివ్‌గా తేలింది.  


బోరబండకు చెందిన భార్యా భర్తలు పహాడిషరీఫ్‌లో ఉండే తమ బంధువుల వద్దకు వెళ్లారు. వారు అక్కడ రెండు రోజులు గడిపారు. అనంతరం ఆ దంపతులిద్దరూ మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని హర్శగూడలో నివాసముంటున్న సడ్డకుని ఇంటికి వెళ్లారు. అయితే వీరిద్దరి నుంచి సడ్డకునితోపాటు అతని భార్య, కొడుకు, బిడ్డకు కరోనా వైరస్‌ సోకింది. అలాగే పహాడిషరీఫ్‌‌లో రెండు రోజులు ఉండటంతో అక్కడ వీరి బంధువుల్లో 15 మంది కరోనా బారిన పడ్డారు.


ఇదిలా ఉండగా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఇంట్లో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కొండాపూర్‌ డివిజన్‌లోని రాఘవేంద్ర కాలనీలో నివాసముండే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ (38)కు కరోనా పాజిటివ్‌ రాగా మంగళవారం అతని భార్య (31), బామ్మర్ది కొడుకుకు, బిడ్డకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. 


చందానగర్‌కు చెందిన ఓ మహిళ చెస్ట్‌ ఆసుపత్రిలో నర్స్‌గా విధులు నిర్వహిస్తుంది. ఈమెకు కరోనా సోకినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కరోనా సోకిన వారి కుటుంబ సభ్యులను గాంధీ, ఫీవర్‌ ఆసుపత్రులకు తరలించారు. ఆర్‌కేపురంలో మరొకరికి పాజిటివ్‌గా తేలింది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్యం 171కి చేరుకుంది. 


వికారాబాద్‌ జిల్లాలో మళ్లీ కరోనా కల్లోలం

వికారాబాద్‌ జిల్లాలో మళ్లీ కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. కరోనా నుంచి ఇటీవలే విముక్తి పొందిన జిల్లాలో మంగళ వారం ఒకేరోజు అయిదుగురికి పాజిటివ్‌ రావడం ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో చివరి పాజిటివ్‌ కేసు నమోదైన  36 రోజుల తరువాత మళ్లీ పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో జిల్లా అధికారులు, ప్రజలు ఉలిక్కిపడ్డారు. కులకచర్ల మండలం, బండివెల్కిచర్లలో ముగ్గురికి, తాండూరులో ఒకరికి కరోనా పాజిటివ్‌ రాగా, ధారూరు మండలం గట్టేపల్లి గ్రామానికి చెందిన మరొకరికి కూడా కరోనా సంక్రమించింది.  బండివెల్కిచర్లలో ఏడు నెలలు, రెండేళ్ల చిన్నారులు, ఓ మహిళ (50)కు వైరస్‌ సోకగా, తాండూరులో ఏడాది వయసున్న బాబుకు పాజిటివ్‌ వచ్చింది. ఇటీవల బండివెల్కిచర్లలో నిర్వహించిన ఓ వేడుకకు హాజరై వెళ్లిన షాద్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు కరోనా బారిన పడగా, అదే కార్యక్రమానికి వచ్చిన బండివెల్కిచర్లకు చెందిన ముగ్గురితోపాటు తాండూరుకు చెందిన బాలుడికి కరోనా సోకింది. 


ఇదిలాఉంటే, కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ధారూరు మండలం, గట్టేపల్లికి చెందిన ఓ వ్యక్తికి శస్త్ర చికిత్స చేయడానికి ముందు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతడికి కరోనా ఉన్నట్లు తేలింది. చికిత్స కోసం అతడు పలుమార్లు తాండూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లాడు. శస్త్ర చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరిన అతడికి ముందుగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో వైరస్‌ ఉన్నట్లు తేలింది. మంగళవారం పాజిటివ్‌ వచ్చిన వారిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.


కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబసభ్యులతోపాటు వారితో సన్నిహితంగా ఉన్న వారిని హోంక్వారంటైన్‌ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వికారాబాద్ జిల్లాలో ఏప్రిల్‌ 19వ తేదీన చివరి పాజిటివ్‌ కేసు నమోదు కాగా, ఆ తరువాత 36 రోజులకు మళ్లీ జిల్లాలో పాజిటివ్‌ కేసులు రావ డం కలకలం రేపుతోంది. కరోనా యాక్టివ్‌ కేసులు లేని జిల్లాగా ప్రకటించిన 12రోజుల తర్వాత మళ్లీ కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇదివరకు 38 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా,  వారిలో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 42కు చేరింది.

Updated Date - 2020-05-27T17:50:17+05:30 IST